LRS దెబ్బకు కుదేలైన ‘రియల్’ రంగం..!

by Shyam |   ( Updated:2020-09-04 02:43:10.0  )
LRS దెబ్బకు కుదేలైన ‘రియల్’ రంగం..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం రియల్టర్లు, బిల్డర్ల పాలిట అశనిపాతంగా మారింది. ఇప్పటికే కొవిడ్-19 కరోనా వైరస్‌ ధాటికి ఈ రెండు రంగాలు దాదాపు కుదేలైపోగా ఇప్పుడు ప్రభుత్వం వెలువరించిన ఆదేశాలతో ఈ రంగం ఇప్పట్లో కోలుకునేటట్టుగా లేదని రియల్టర్లు, బిల్డర్లు వాపోతున్నారు. వాస్తవానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విశాల ప్రజా ప్రయోజనాల రీత్యా అవసరమే. డీటీసీపీ లేఅవుట్లు కాకుండా ఎక్కడికక్కడ వ్యవసాయ భూములను కొనుగోలు చేసి మ్యాప్‌ రిలీజ్‌ చేయడం.. వచ్చినకాడికి అమ్ముకోవడం.. ఆనక రోడ్లను సైతం ఆక్రమించుకోవడం.. కొన్ని కొన్ని సార్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వారిని కూడా మోసపుచ్చుతున్న ఘటనలు జరుగుతునే ఉన్నాయి. వీటన్నిటికీ చెక్‌ పెట్టాలన్న యోచనతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొండనాలకకు మందేస్తే ఉండ నాలుక ఊడిందన్నట్టుగా ఉందని ఈ రంగాన్ని నమ్ముకుని పెట్టుబడులు పెట్టినవారు వాపోతున్నారు.

డీటీసీపీ (డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌) లేదా స్థానికంగా ఉన్న అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల నుంచి అనుమతులు పొందిన వెంచర్లు, ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా క్రమబద్ధీకరణ జరిగిన ప్లాట్లు మినహా మిగిలిన వాటిని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్ట్రేషన్‌ చేయొద్దని.. ఒకవేళ గతంలో రిజిస్ట్రేషన్‌ జరిగినా మళ్లీ ఎట్టి పరిస్థితులలోనూ చేయొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈమేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మెమో నెం-జి2-257-19 ఉత్తర్వులను 26.8.2020 తేదీతో జారీ చేశారు. దీంతో ఇక ఎక్కడా లేఅవుట్‌ అనుమతి, ఎల్‌ఆర్‌ఎస్‌లు లేకుండా రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదంటూ ఆయా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలలో నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఇలాంటి ఆదేశాలు గతంలోనూ ఉన్నప్పటికీ ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది. దీంతో దీనిపై పలుమార్లు చర్చించిన ప్రభుత్వం కఠినమైన వైఖరి తీసుకుంది.

ఆదిలోనే వెంచర్లను అడ్డుకుని ఉంటే..

వాస్తవానికి ఏదైనా భూమిని లేఅవుట్‌ చేయాలంటే ముందుగా సదరు భూమిని వ్యవసాయేతర భూమిగా రెవెన్యూ శాఖలో నాలా ట్యాక్స్‌ చెల్లించి భూ వినియోగ మార్పిడి చేయించాలి. ఆనక సదరు భూమికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించి సంబంధిత స్థానిక సంస్థల ద్వారా విస్తీర్ణాన్ని బట్టి డీటీసీపీ లేదా ఆయా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీలకు అప్లై చేయాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్‌ను పరిశీలించిన ప్లానింగ్‌ విభాగం లేఅవుట్‌ నిబంధనల మేరకు ఆ మ్యాప్‌లో అవసరమైన మార్పులు చేర్పులు చేసి బేసిక్‌ అమెనిటీస్‌ ఏర్పాటు కోసం టెంటేటివ్‌ పర్మిషన్‌ ఇస్తారు. బీటీ రోడ్ల నిర్మాణం, విద్యుత్‌ సరఫరా లైన్లు, తాగునీటి సరఫరా లైన్లు, డ్రైనేజి పారుదల సౌకర్యం, సెప్టిక్‌ ట్యాంక్‌లతో పాటుగా ఓవర్ హెడ్‌ ట్యాంక్‌ నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్‌ పూర్తి చేయాలి. దీంతోపాటుగా గ్రీన్‌బెల్ట్‌ పేరిట మొత్తం విస్తీర్ణంలో 10 శాతం భూమిని, కామన్‌ యుటిలిటీ కోసం 1 శాతం భూమిని ఆయా స్థానిక సంస్థల పేరిట రిజిస్ట్రేషన్‌ చేస్తూ స్వాధీనం చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇదంతా డబ్బు, సమయం బాగా ఖర్చయ్యే దీర్ఘకాలిక ప్రాసెస్‌.

ఇలా చేసిన వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే దురాక్రమణ, డబుల్‌ రిజిస్ట్రేషన్లు, హద్దు తగాదాలు లాంటివి భవిష్యత్‌లో రావన్న ఉద్దేశంతో ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టింది. అయితే అమలులో ఇది తీవ్రమైన అవినీతికి, అధికార దుర్వినియోగానికి గురవుతోందన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఫలితంగా టౌన్‌ ప్లానింగ్‌, జిల్లాల్లో ఉండే టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ అధికారులు దీన్ని ఆసరాగా చేసుకుని విపరీతంగా దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతోబాటుగా బిల్డింగ్‌ పర్మిషన్ల కోసం కూడా నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌బీపాస్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీన్ని అనుసరించి 75 గజాల లోపు విస్తీర్ణంలో నిర్మించే ఇళ్లకు అనుమతులు అవసరం లేదు. కేవలం ఒక్క రూపాయి చెల్లించి అప్లై చేసుకుంటే చాలు. ఆపైన విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు సైజును బట్టి ఫీజు చెల్లిస్తే చాలు, అప్లై చేసుకున్నంతనే ఆన్‌లైన్‌లోనే ఫీజు జనరేట్‌ అవుతుంది. తనిఖీలు, అనుమతుల గొడవ లేదు. అయితే ఇంటి యజమాని ఏ ప్లాన్‌ అయితే ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేస్తారో అదే విధంగా నిర్మించాలి. లేదంటే పోస్ట్‌ ఇన్స్‌ఫెక్షన్‌లో గుర్తిస్తే మాత్రం భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. టీఎస్‌బీపాస్‌పై హర్షం వ్యక్తం చేస్తున్న రియల్టర్లు, బిల్డర్లు, తాజాగా జారీ చేసిన మెమోపై మాత్రం పెదవి విరుస్తున్నారు. ఇది ఆచరణ సాధ్యం కాని ఉత్తర్వులంటున్నారు.

నల్లగొండ జిల్లాలో ఇదీ పరిస్థితి..

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో వందలాది అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. వీటి పరిధిలో లక్షలాది ప్లాట్లు బాధితులు ఇప్పటికే కొనుగోలు చేశారు. ఇంకా లక్షల్లో ప్లాట్లు క్రయవిక్రయాలు జరిగేందుకు రెడీగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం క్రమబద్ధీకరణ నిర్ణయంతో రియల్ వ్యాపారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇటు కొనుగోలుదారులు.. అటు రియల్ వ్యాపారులు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే నల్లగొండ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 278 వెంచర్లు ఉంటే.. ఇందులో కేవలం 108 వెంచర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేని 170 అక్రమ వెంచర్లు పరిధిలో 52 వేలకుపైగా ప్లాట్లు ఉన్నాయి. ఇదీకాక ఆయా గ్రామ పంచాయతీలో పెద్దఎత్తున అక్రమ వెంచర్లు వెలిశాయి.

సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో..

ఇక సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే.. సూర్యాపేట జిల్లాలో 323 వెంచర్లు ఉన్నాయి. ఇందులో కేవలం 67 వెంచర్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలతోపాటు హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి, సూర్యాపేట – జనగాం రోడ్డు, సూర్యాపేట- దంతాలపల్లి రోడ్డు వెంట భారీగానే వెంచర్లు పుట్టుకొచ్చాయి. మరో జిల్లా అయిన యాదాద్రిలో అధికారులు గుర్తించిన అక్రమ వెంచర్లు 925 వరకు ఉన్నాయి. అనధికారికంగా మరో 500 వరకు జిల్లా పరిధిలో ఉన్నాయి. యాదాద్రి జిల్లా పరిధిలో ఆరు మున్సిపాలిటీలు, 421 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే ఇందులో అధిక శాతం యాదాద్రి ఆలయ చుట్టుపక్కల వేల ఎకరాల్లో అక్రమ వెంచర్లు పుట్టుకొచ్చాయి. దీనికితోడు హైదరాబాదుకు సమీపంలో ఉన్న చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు రియల్ వ్యాపారులు ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వ నిర్ణయంతో ఈ వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు.. వెంచర్లు ఏర్పాటు చేసిన వ్యాపారులు బిక్కమొహం వేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత..

గతంలో గ్రామ పంచాయతీలు జారీ చేసిన లేఅవుట్ల అనుమతులు చెల్లవంటూ ప్రస్తుతం చెప్పడం పట్ల కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడో ఒక గ్రామంలో ఉన్న చిన్న జాగాను తమ అవసరాల కోసం అమ్ముకోవాలన్నా కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ చేసే పరిస్థితి లేదు. దీంతో ఆస్తి ఉండీ అమ్ముకోలేని దుస్థితి తలెత్తనుందని, ఇది ప్రజలకు ఇబ్బందికరమైన అంశం. అయితే 2018 మార్చిలోపు కొనుగోలు చేసిన ప్లాట్లకు కొత్తగా క్రమబద్దీకరించుకునే వెసులుబాటు కల్పించారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన ప్లాట్ల పరిస్థితి అగమ్యగోచరమే. ఒక సమగ్రమైన విధానమంటూ లేకుండా ఎప్పటికప్పుడు నిధుల సమీకరణ కోసం ఆదేశాలు ఇస్తుండడమే ఇలాంటి దుస్థితికి కారణమంటున్నారు. ‘గతంలో అక్రమ లేఅవుట్‌.. కొన్నాళ్లకు ఎల్‌ఆరెస్‌ చెల్లిస్తే సక్రమం చేయడం..’ లాంటివి కాకుండా ఇకనుంచైనా ఈ రంగంపై సమగ్ర అధ్యయనం చేసి ఒక విధానాన్ని తీసుకురావాలని కోరుతున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు తమ అధికార పరిధిలో ఇచ్చిన అనుమతులను కూడా తాజాగా తోసిపుచ్చడం సరికాదన్న విమర్శ కూడా ఉంది. ఒక భూమికి రెండుసార్లు ఫీజులు కట్టాలని ఆదేశించడం సరికాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నిర్మాణ రంగం పూర్తిగా పడకేస్తుందంటున్నారు.

Advertisement

Next Story