కేంద్రానికి రూ. 99,122 కోట్ల డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ!

by Harish |   ( Updated:2021-05-21 06:56:42.0  )
కేంద్రానికి రూ. 99,122 కోట్ల డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) భారీ నిధులను కేటాయించింది. 2021 మార్చి 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ. 99,122 కోట్ల మిగులు ద్రవ్యాన్ని డివిడెండ్ రూపంలో కేంద్రానికి ఆర్‌బీఐ ఇవ్వనుంది. శుక్రవారం ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. అలాగే, ఆకస్మిక రిస్క్ బఫర్‌ను 5.5 శాతంగా ఉంచినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ కరెన్సీ ట్రేడింగ్, బాండ్ ద్వారా భారీగా ఆదాయం కలిగి ఉంది. ఇందులో ఆర్‌బీఐ కార్యకలాపాల కోసం కొంత మొత్తాన్ని ఉంచుకుని, మిగిలిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక అవసరాల కోసం అందజేస్తుంది. అందులో భాగంగానే ఈ సారి రూ. 99,122 కోట్లను అందించనున్నట్టు వెల్లడించింది.

గతేడాది ఇదే సమయంలోనూ ఆర్‌బీఐ కేంద్రానికి డివిడెండ్ రూపంలో రూ. 57 వేల కోట్లు ఇచ్చింది. ఇది మొత్తం మిగులు ద్రవ్యంలో 44 శాతంతో గత ఏడేళ్ల కాలంలో ఆర్‌బీఐ ఇచ్చిన చాలా తక్కువ డివిడెండ్. కరోనా సెకెండ్ వేవ్ ప్రతికూల ప్రభావాన్ని, ఆర్థిక పరిస్థితిని ఆర్‌బీఐ బోర్డు సమీక్షించింది. అంతేకాకుండా, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులతో పాటు సెకెండ్ వేవ్ కారణంగా ఉత్పన్నమయ్యే సవాళ్లను తగ్గించేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలను పరిశీలించింది.

Advertisement

Next Story