ఆ చిన్నారుల బాధ్యత నాదే: రసమయి

by Sridhar Babu |
ఆ చిన్నారుల బాధ్యత నాదే: రసమయి
X

దిశ, మానకొండూరు: తల్లిదండ్రులు మరణించడంతో అనాథలుగా మారిన చిన్నారులకు అండగా ఉంటానని ప్రకటించిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మంగళవారం ఆ చిన్నారులను వ్యక్తిగతంగా కలిశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు ఏడు నెలల వ్యవధిలోనే అకాల మరణం చెందారు.

దీంతో చిరుప్రాయంలోనే వారి కూతుర్లిద్దరూ అనాథలుగా మారారు. కూలీ పనులు చేసుకుంటూ తన భార్యా పిల్లలను పోషించుకుంటున్న నాగుల రమేష్ 7 నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందగా, ఆయన మృతితో మనో వేదనకు గురైన భార్య శారధ కూడా అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసింది. తల్లిదండ్రులు ఇద్దరూ తమ కళ్ల ముందే కాటికి వెళ్లడంతో అభినయ, ఆలయలు అనాథలుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎరడపల్లిలో వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ… తల్లిదండ్రుల ఒడిలో సేద తీరాల్సిన అభినయ, ఆలయల పోషణతోపాటు ఉన్నత చదువుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story