పూజల పేరుతో వివాహితపై అత్యాచారం.. సహకరించిన సీఐ, ఎస్ఐ

by Sumithra |   ( Updated:2021-05-31 07:53:00.0  )
పూజల పేరుతో వివాహితపై అత్యాచారం.. సహకరించిన సీఐ, ఎస్ఐ
X

దిశ, నార్కట్ పల్లి : పూజలు చేస్తే కుటుంబంలో అనారోగ్యo తగ్గి ఆరోగ్యం బాగుపడుతుందని, కుటుంబ కలహాలు తొలగి, సుఖసంతోషాలతో ఉంటారని నమ్మబలికి.. వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ బురిడీ బాబా. ఇదంతా వీడియో తీసి డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్‌కు దిగాడు. ఈ దారుణ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల ప్రకారం.. మునిపంపుల గ్రామానికి చెందిన మహిళ పది ఏళ్ల క్రితం వలిగొండ మండలం, గోపారాశిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే వీరికి వివాహం జరిగి 10 ఏళ్లు అయినప్పటికీ సంతానం కలుగలేదు. ఈ కారణంగా సదరు మహిళ విడాకులు తీసుకుని తల్లిగారి గ్రామమైన మునిపంపులలో ఉంటున్నది. ఈ నేపథ్యంలో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది దొంగ బాబాలు మహిళను ఎలాగైనా ట్రాప్ చేసి ఆపై డబ్బులు గుంజాలనే ప్లాన్ వేసుకున్నారు.

వెంటనే బాబాల అవతారంలో రంగంలోకి దిగి పూజలు చేస్తే కుటుంబంలోని కలతలు సద్దుమణిగి సుఖసంతోషాలతో ఉంటారని నమ్మబలికారు. ఈ విషయాన్ని నమ్మిన మహిళ వెంటనే బాబాలు చేప్పింది చేయడానికి ఒప్పుకుంది. అదే అదునుగా మహిళను పూజల పేరిట లోబరుచుకొని అత్యాచారానికి పాల్పడ్డారు దొంగ బాబాలు. అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియో తీశారు. కొద్దిరోజులకు బాబాలు ఆ వీడియోను మహిళ కుటుంబ సభ్యులకు చూపించి డబ్బులివ్వాలని, లేకుంటే వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్‌కు దిగారు.

దీంతో ఎక్కడ తమ పరువు పోతుందోనని భయపడి వారు అడిగినంత సొమ్ము ఇచ్చారు. తర్వాత కొద్ది రోజులకు మళ్లీ.. దొంగ బాబాలు మరికొంత డబ్బు ఇవ్వాలని.. లేకుంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని తిరిగి బెదిరించడం ప్రారంభించారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు రామన్నపేట పోలీసులను ఆశ్రయించారు. అయితే.. పోలీసులు మహిళ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా.. మధ్యవర్తులుగా మారి దొంగ బాబాలను పిలిపించి వారితో మాట్లాడి బాధిత మహిళ.. బాబాలకు ఇచ్చిన డబ్బులను వెనక్కి ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. వెంటనే బాబాలు సగం డబ్బులు ఇచ్చి.. కొద్దిరోజుల పూర్తి డబ్బు ఇస్తామని చెప్పడంతో మహిళ కుటుంబ సభ్యులు అంతటితో ఊరుకున్నారు.

కానీ రోజులు గడుస్తున్నప్పటికీ బాబాలు తీసుకున్న డబ్బు ఇవ్వక పోయేసరికి బాధిత మహిళ, కుటుంబ సభ్యులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మహిళ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని రాచకొండ సీపీ మహేష్ భగవత్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో విచారణ జరిపిన సీపీ ఈ ఉదంతం అంతా వాస్తవమేనని నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీపీ మహేష్ భగవత్ ఈ ఉదంతానికి బాధ్యులైన ఎస్ఐ చంద్రశేఖర్, సీఐ శ్రీనివాస్‌లను సస్పెండ్ చేశారు. మహిళ ఫిర్యాదు మేరకు బాబాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed