- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రమణమ్మ మంచి మనసు
దిశ, కథాస్రవంతి : ఉదయాన్నే ఇంటి బయట కళ్ళాపి జల్లి చక్కటి ముగ్గు వేసి లోపలికి వచ్చింది రమణమ్మ.
కాసేపటికి బయటకు వెళ్లిన భర్త ఇంటికి రావడంతో.. కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తీసుకోని వెళ్లిన ఆమెకు ఉదయం వేసిన ముగ్గు అక్కడక్కడా చెరిగిపోయి కనిపించింది..
ఆశ్చర్యపోయిన రమణమ్మ ఏం మాట్లాడకుండా ఆ ముగ్గుని సరిచేసి లోపలోకి వెళ్ళిపోయింది.
ఒకరోజు రమణమ్మ ఇంటి ముందు ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న గులాబీ మొక్కలను మేకలు వచ్చి తినేశాయి.. రమణమ్మ మళ్లీ కొత్త చెట్లు వేసి చుట్టూ ముళ్ళ కంచె వేసింది.
తరువాత రోజు నుండి వారి పెరట్లోకి అరటి తొక్కలు వేయడం, చిమ్మగా వచ్చిన కసువు వారింట్లోకి వేయడం ఇలా రోజుకొక రకంగా జరిగేది రమణమ్మ కి.
అన్నీ ఓపిగ్గా భరించి అన్నీ బాగుచేసుకునేది కానీ ఎవరినీ ఒక్క మాట కూడా అనేది కాదు ఆమె..
కొన్నిరోజులకి ఆమె ఇంటి చుట్టుపక్కవారు రమణమ్మ తో మాట్లాడడం మానేశారు. కారణం.. ఆమె మీద ఎవరో లేనిపోనివి ఇరుగుపొరుగు వారికి కల్పించి చెప్పడమే.
ఆమె ఇవేవీ పట్టించుకోకుండా ఆమె పని ఆమె చూసుకునేది.
అనతికాలంలోనే ఆమె మంచి మనసునెరిగిన ఇరుగుపొరుగు అందరూ మళ్ళీ మిత్రులైపోయారు ఆమెకు.
ఒకరోజు రమణమ్మ భర్త భార్యను పిలిచి “రమణి.. నిన్ను రోజూ ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరో తెలిసి కూడా ఇలా మౌనంగా భరిస్తున్నావెందుకు?” అని అడిగాడు.
“ఇవన్నీ చేస్తున్నది ఎదురింటి రంగమ్మ అని నాకు తెలుసు అండీ.
మీరూ, ఆమె భర్త ఒకేసారి వ్యాపారం చేయడం మొదలు పెట్టినా.. వారి వ్యాపారం నష్టాల్లో ఉండడం వలన మనం ఆర్ధికంగా వారికంటే బాగా ఎదిగిపోయామని, కాలేజ్ లో మన కూతురికి ఆమె కొడుకు కంటే మంచి ర్యాంక్ వచ్చిందనీ, మన ఇరుగుపొరుగంతా నాతో స్నేహంగా ఉంటున్నారనీ, మన ఇంటి ముందు నేను పెంచిన పూల మొక్కలు చాలా అందంగా ఉన్నాయని ఎవరో ఆమెతో అన్నారనీ, ఆఖరికి నేను వేసిన ముగ్గు ఆమె ముగ్గు కన్నా బాగుందనీ… ఇలా ప్రతి చిన్నదానికీ నాతో పోల్చుకుంటూ నా మీద ఈర్ష్య ను పెంచుకోని ఇలా చేస్తుంది.
గొడవలు ఏం లేకుండా ప్రశాంతంగా ఉండాలనుకునే నాతో తగవు పెట్టుకోవాలని చూస్తుందామే..
ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా అన్నిటినీ మౌనంగా భరిస్తూ నా పని నేను చేసుకుంటూ పోతున్నాను.
మనమంటే పడనివారికి మనం ఎప్పుడూ వారితో తగవులు పడుతూ ఉంటేనో లేదా బాధపడుతూ కూర్చుంటేనో మనశ్శాంతిగా ఉంటుంది.. నేను ఆవిడకు ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు.
నా మీద ఈర్శ్యతో… నన్నెలా ఇబ్బందికి గురి చేయాలి అని ఆలోచించే బదులు ఆ సమయాన్ని ఆమె ఇల్లు చక్కబెట్టుకోవడంలో వినియోగించుకోవచ్చు కదా..
భర్తకు వ్యాపారంలో ఆమె వంతు సాయాన్ని అందిస్తూ, పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని చదివిస్తూ, ఇరుగుపొరుగుతో మర్యాదగా ఉంటూ, తగు సూచనలను పాటిస్తూ ఇంటిముందు మంచి మొక్కల్ని పెంచుతూ, అందమైన ముగ్గులు నెర్చుకోని వేస్తూ అందరితో నాకంటే ఎక్కువ మన్ననలు పొందవచ్చు కదా..
ఆమెలో వచ్చే ఈ మార్పు కోసమే ఎదురుచూస్తున్నానండి నేను” అని చెప్పడం ముగించి భర్తకు కాఫీ తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్తున్న రమణమ్మ వైపు మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయాడు ఆమె భర్త.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. రమణమ్మ నుండి ఆశించిన స్పందన లేకపోవడంతో విసుగు చెందిన రంగమ్మ.. రమణమ్మను ఇబ్బంది పెట్టే పనులు చేయడం మానేయాలని తలంచి ఇంటి పనుల్లో నిమగ్నమైపోయింది.