- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నదాతలతో ‘సింగరేణి’ ఆటలు.. నాలుగేళ్లలో రూ.3 కోట్ల నష్టం..?
దిశ, రామగిరి : తెలంగాణ ప్రభుత్వం 2018లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు రామగిరి మండలం బుధవారం పేట, రాజాపూర్ గ్రామస్తులకు ‘అందని ద్రాక్షలా’ మారింది. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన నాటి నుండి నేటికి రైతులకు సాయం అందట్లేదు. గడిచిన నాలుగేళ్లుగా రైతులు సుమారు రూ.3 కోట్ల మేర నష్టపోయారు. కష్టసమయంలో ఉన్నప్పటికీ.. తమకున్న భూమిని అమ్మి కూతురు, కొడుకు వివాహం జరిపిద్దామన్నా అవకాశం లేకుండా పోయింది. దీనితో రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. రైతులు వారి భూములపై హక్కులు కోల్పోయారు. సింగరేణి అధికారులు ఇప్పుడు రూ.9 లక్షలు చెల్లిస్తామన్న రైతులు తీసుకునేందుకు సుముఖంగా లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎకరాకు ఇక్కడ రూ.15 నుండి 20 లక్షల వరకు ధర పలుకుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. రామగుండం 3 ఏరియా ఓపెన్ కాస్ట్ 2 విస్తరణలో భాగంగా రెండు గ్రామాల్లోని సుమారు 218 మంది రైతుల నుండి 708 ఎకరాలు భూసేకరణ చేపట్టాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. 2009లో డ్రాఫ్ట్ డిక్లరేషన్ ఇచ్చి, 2011 నోటిఫికేషన్ ప్రకటించింది. అనంతరం 2015లో ‘అవార్డు’ సైతం జారీ చేసింది. భూసేకరణ సమయంలో ‘లోక్ అదాలత్ ద్వారా వన్ టైమ్ సెటిల్మెంట్’ కింద ఎకరాకు 9.60 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. అనంతరం ఇది సింగరేణి నిబంధనలకు విరుద్ధమని పాత చట్టం ప్రకారం 4.60 లక్షలు చెల్లిస్తామనడంతో వివాదం తలెత్తింది. దీనికి సరైన నష్టపరిహారం కావాలని కోరుతూ కొంతమంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతోంది. సింగరేణి భూసేకరణ ప్రక్రియ చేపట్టడంతో గ్రామానికి నిధులు రాక అభివృద్ధిలోనూ వెనకబడిపోయింది.
భూములు వద్దంటున్న సింగరేణి..
దాదాపు ఐదేండ్లు గడిచాక సింగరేణి భూములను వద్దంటుంది. చట్టప్రకారం అవార్డ్ పాస్ చేశాక ఐదు సంవత్సరాల్లో భూమి సేకరించి నష్టపరిహారం చెల్లించాలి. కానీ, నష్టపరిహారం విషయంలో రైతులు ఒప్పుకోకపోవడంతో పనుల్లో జాప్యం జరిగింది. కొన్ని నెలల కిందట గ్రామస్తులు ‘అవార్డ్ పాస్’ అయ్యి ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి కావున రద్దు చేసి తమ భూములు తమకు అప్పగించాలని సింగరేణి డైరెక్టర్ బలరాంకు వినతిపత్రం అందజేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అవార్డు రద్దు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. భూసేకరణను పెండింగ్లో పెట్టి రైతు బంధు, రైతు బీమా రాక రైతులు అన్ని విధాలుగా నష్టపోయాక భూములు వద్దనడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఇన్ని సంవత్సరాలుగా సింగరేణి అధికారుల వల్ల తాము కోల్పోయిన నష్టాన్ని ఎవరు తీరుస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే పరిష్కారం అవుతుంది :
అవార్డు రద్దు కోరుతూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాము. ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. దీనికి కొంత సమయం పడుతుంది. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది.
-ఇందారపు పుష్పలత, ఎమ్మార్వో రామగిరి
యాజమాన్య హక్కు కల్పించాలి :
ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా పరిహరం అందలేదు. కొత్త చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించాలి. లేకపోతే రైతులకు యాజమాన్య హక్కు కల్పించాలి.
-ఆరెళ్లి కొమురయ్య, బుధవారంపేట గ్రామస్తుడు
ఇప్పటికే చాలా నష్టపోయాం :
మా భూములపై అవార్డ్ పాస్ చేయడం వల్ల రైతు బంధు, రైతు బీమా అందక ఇప్పటికే చాలా నష్టపోయాం. ఇటు పరిహారం అటు ప్రభుత్వ పథకాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నం.
-పుల్లెల కొమురయ్య, రాజాపూర్ గ్రామస్తుడు