నాడు రక్తదానం.. నేడు అన్న దానం

by Sridhar Babu |   ( Updated:2020-04-01 03:27:30.0  )
నాడు రక్తదానం.. నేడు అన్న దానం
X

దిశ, కరీంనగర్: ఆయనో చిరువ్యాపారి. కానీ, ఎవరికైనా రక్తం అవసరముందని ఫోన్ చేస్తే చాలు వెంటనే స్పందిస్తారు. రక్తం అందేలా చూస్తారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న సంకల్పంతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. రక్తదానం చేసే వారి జాబితా సిద్ధం చేసి, రక్తం కావాల్సిన వారికి అందేలా కృషి చేస్తారు. నాలుగేళ్లుగా రక్తదానం చేసేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఓ గ్రూపును తయారు చేశారు. అయితే, ఇప్పడాయన రక్తదానం కాకుండా అన్నదానం చేస్తున్నారు. ఎందుకంటే లాక్ డౌన్ సందర్భంగా కొంత మందికి అన్నదానం దొరకడం లేదు కాబట్టి. ఆయనెవరో కాదండీ.. వినాయక క్యాటరర్స్ ఉద్యోగి నగునూరి రాజేందర్. పేద విద్యార్థులను ఆదుకుంటూ, అన్నదానం చేస్తూ పలువురి ఆకలి తీరుస్తూ ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు.

అందరి ఆకలి తీరుస్తూ..

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో విధులు నిర్వర్తించే పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు భోజనం దొరకడం ఇబ్బందని గమనించిన ఆయన లాక్ డౌన్ అమలవుతున్న నాటి నుంచి ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్‌లో వివిధ ప్రాంతాల్లో డ్యూటీలు చేసే వారికోసం మీల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్ (కోవిడ్ -19) నివారణా చర్యలు తీసుకుంటూ, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తూ అక్కడకు వచ్చే వారికి ఆహారం అందిస్తున్నారు. ఇవే కాకుండా అన్నార్థులను ఆదుకోవాలన్న సంకల్పంతో నగరంలో తిండి దొరకని వారికీ భోజనం ఇస్తున్నారు. రోజుకు 200 భోజనాలను సమకూర్చుతున్నారు. ఉచితంగా ఇచ్చే భోజనమే కదా అని మొక్కుబడిగా పులిహొరో లేక సాంబర్ రైస్ ఇచ్చే పద్ధతిన కాకుండా రెండు రకాల కూరలు, పప్పు సాంబార్, పెరుగు, చట్నీ, అన్నం రెడీ చేసి తన క్యాటరింగ్ సెంటర్‌కు వచ్చే వారికి సీటింగ్ ఏర్పాటు చేసి మరీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని వలస కూలీలకు, ఆకలితో అలమటించే వారికి అన్నం ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు.

ఎవరి సాయం లేకుండానే..

రాజేందర్ సేవలను గుర్తించిన పలువురు తాము కూడా ఇందులో భాగస్వాములవుతామనీ, ఆర్థిక సాయం చేస్తామని ముందుకొస్తే తిరస్కరించారు. తాను ఎవరి సాయం లేకుండానే సేవలందిస్తానని తెలిపారు. అయితే, ప్రస్తుతం అధికార యంత్రాంగం వలస కూలీలు, ఆకలితో అలమటించే వారికి ఆహార ఏర్పాట్లు చేస్తోంది. కాని అధికారులు కూడా కొన్ని చోట్ల లాక్ డౌన్ ప్రభావంతో హోటళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న రాజేందర్ వారికీ భోజనం అందిస్తున్నారు. విరాళాలిచ్చేందుకు తనకు వందలాది మంది ఫోన్ చేస్తున్నారనీ, కాని తాను ఒంటరిగానే సేవలు కొనసాగిస్తున్నానని అంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఆయన చేస్తున్న సేవలకు జిల్లా వాసులు హ్యట్సాఫ్ చెబుతున్నారు.

Tags : food, govt officers, migrant workers, corona effect, lockdown

Advertisement

Next Story

Most Viewed