ఉద్యోగుల వేతనాల పెంపు హర్షణీయం: ట్రెస

by Shyam |
ఉద్యోగుల వేతనాల పెంపు హర్షణీయం: ట్రెస
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) మంగళవారం హర్షం వ్యక్తం చేసింది. గత పీఆర్సీలో 42 శాతం ఫిట్మెంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఫిట్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నామని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కె గౌతమ్ కుమార్‌లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు, భూ సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేక స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వానికి రెవెన్యూ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

పదవీ విరమణ వయసు పెంపు పట్ల హర్షం

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతామని, ఉద్యోగుల జీతాలు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల తెలంగాణ ఉద్యోగుల సంఘం హనరరీ చైర్మన్ పద్మచారి, అధ్యక్షుడు పవన్ కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్ రవీందర్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నర్సింగ్ రావులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఉద్యోగుల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంతోపాటు పదవీ విరమణ వయస్సు పెంపు కమిటీ వేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కమిటీ నివేదికను కూడా త్వరితగతిన తెప్పించుకుని పదవీ విరమణ వయస్సు పెంచాలని, పీఆర్సీని సీఎం కేసీఆర్ వీలైనంత తొందరగా ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల నియమాలను చేపట్టడం కూడా శుభపరిణామమని, సీఎం కేసీఆర్ కు తెలంగాణ ఉద్యోగుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story