అకాల వర్షాలకు తడిసిన ధాన్యం.. రైతు కష్టాలు తీరేదెన్నడు ?

by Shyam |   ( Updated:2021-11-14 22:43:42.0  )
అకాల వర్షాలకు తడిసిన ధాన్యం.. రైతు కష్టాలు తీరేదెన్నడు ?
X

దిశ, వర్ధన్నపేట: ఈశాన్య రుతుపవనాలు వల్ల వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో పలుచోట్ల వర్షం పడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం కారణంగా కోనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి ముద్ద అయింది. రాయపర్తి మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి మైలారం గ్రామ శివారులో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం‌లో రైతులు అమ్మడానికి తీసుకువచ్చిన ధాన్యం నీళ్లలో తడిసి ముద్దయింది. కొన్ని గ్రామాల్లో కుప్పలపై టాల్ఫిన్ పరదాలు కప్పినప్పటికీ అడుగు భాగాన నీరు చేరి ధాన్యం తడవడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు చెప్పుకుంటూ రైతులను ఆగం చేస్తున్నారని పలువురు మండి పడుతున్నారు. దాదాపు మండలంలో 30 శాతం పైగా వరి పంటలు కోసి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు ట్రాక్టర్ల ద్వారా తరలించారు. అయితే మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు కోనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవటంతో కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తరలించి ఆరబెట్టి 10 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు వాటిని ప్రారంభించక పోవడంపై రైతన్నలు స్థానిక ప్రజా ప్రతినిధులపై, ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి, చెమట చుక్కలు ధారపోసి పంట పండించిన రైతులకు అకాల వర్షం కన్నీటిని మిగిల్చింది.

అకాల వర్షంతో అన్నదాతలు అతలాకూతలం:

కొన్ని చోట్ల కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు అతలా కుతలం అవుతున్నారు. రైతులు ఆరబెట్టిన ధాన్యం లోకి నీరు చేరి తడిసి ముద్దయింది. కొంత మంది రైతులు ధాన్యం కుప్పలపై పరదలు కప్పకపోవడం, ధాన్యం ఆరబెట్టి అలాగే ఉంచడంతో ధాన్యం మొత్తం తడసి ముద్దైంది.

లక్షల పెట్టుబడి నీళ్ల పాలు:

రైతులు పంట పండించడం కోసం తమ చెమటను ధార పోయడమే కాకుండా లక్షల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ఆఖరికి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయమని బ్రతిమాలాడాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో దళారుల వ్యవస్థ ఉన్నప్పుడు నేరుగా కళ్లాల వద్దకు వచ్చి దళారులు ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్రాక్టర్ల ద్వారా వారే తీసుకెళ్లిన దాఖలాలు ఉన్నాయని, దళారుల కంటే ప్రభుత్వం రెండు మూడు వందల రుపాయలు ఎక్కువగా చెల్లిస్తుందని, ట్రాక్టర్ కూలి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతుకూలి కలుపుకుంటే ప్రభుత్వ మద్దతు ధర, దళారుల ధర అంతా సమానంగా ఉందని అంటున్నారు. కొనుగోలు కేంద్రాల పరిస్థితి చూస్తే దళారులకు అమ్ముకోవడమే మంచిదని అనుకుంటున్నారు.

తడిసి ధాన్యానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి:

ప్రభుత్వం ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వలన ఈ అకాల వర్షాలకు రైతన్నలకు అపార నష్టం కలుగుతుందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి తడిసిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed