సూపర్ ఫాంలో జూనియర్ ద్రవిడ్

by Shyam |
సూపర్ ఫాంలో జూనియర్ ద్రవిడ్
X

పిట్ట కొంచెం కూత ఘనం సామెత సమిత్ ద్రవిడ్‌కి అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటే ఈ జూనియర్ ద్రవిడ్ సూపర్ ఫాంలో ఉన్నాడు. బ్యాటు, బంతితో రాణిస్తూ మాయచేస్తున్నాడు. బ్యాటింగ్‌లో తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటూనే బంతితో కూడా మెరుపులు మెరిపించి తన జట్టును సెమీఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. గత ఆరు నెలల్లోనే రెండు డబుల్ సెంచరీలు చేసి.. ఔరా.. ఏమాడాడు అంటూ క్రికెట్ పండితులను నోరెళ్లబెట్టేలా చేశాడు.

రాహల్ ద్రవిడ్ క్రికెట్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని పేరు. భారత క్రికెట్ కీర్తి కిరీటంలో కలికితురాయి. జట్టంతా ఒకెత్తు రాహుల్ ద్రవిడ్ ఒక్కడూ ఒకెత్తు ఇది చాలు ఆయన గురించి చెప్పడానికి ఇంతకీ రాహుల్ ద్రవిడ్ ప్రస్తావన ఎందుకంటే.. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న చిచ్చరపిడుగు సమిత్ ద్రవిడ్.. రాహుల్ ద్రవిడ్ కుమారుడే. తండ్రి నుంచి క్రికెట్‌ను వారసత్వంగా తీసుకున్న సమిత్ తిరుగులేని ఆటతీరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు.

అండర్ 14 బీటీఆర్ షీల్డ్ టోర్నమెంట్‌లో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ తరపున ఆడుతున్న సమిత్.. విద్యాషీల్స్ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సమిత్ ద్రవిడ్ 131 బంతుల్లో 24 బౌండరీల సాయంతో 166 పరుగులు చేశాడు. అన్వయ్ (90) అతనికి మంచి సహకారమందించాడు. దీంతో మాల్యా అదితి ఇంటర్నేషనల్ స్కూల్ నిర్ణీత 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన విద్యాషీల్స్ జట్టు 182 పరుగులకే కుప్పకూలింది. సమిత్ 4 వికెట్లతో రాణించాడు.

ఇంతకు ముందు ఇదే టోర్నీలో శ్రీ కుమారన్ జట్టుపై సమిత్ ద్రవిడ్ 33 బౌండరీల సాయంతో 204 పరుగులు చేశాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన అండర్ 14 రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా సమిత్ రాణించాడు. కోల్‌కతా వేదికగా జరిగిన అండర్ 14 జోనల్ టోర్నీలో వైస్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ తరపున బరిలోకి దిగి ధార్వాడ్ జోన్‌పై 256 బంతుల్లో 22 బౌండరీల సాయంతో 201 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 94 నాటౌట్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. సమిత్ ఆటతీరు చూసిన వారంతా ద్రవిడా మజాకా అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed