టీమ్ ఇండియా కోచ్ పోస్టుకు రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు

by Shyam |
టీమ్ ఇండియా కోచ్ పోస్టుకు రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా హెడ్ కోచ్ పోస్టుకు మాజీ క్రికెటర్, ఎన్ఏసీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు చేశాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత కోచ్ రవిశాస్త్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు గతంలోనే ప్రకటించాడు. దీంతో హెడ్ కోచ్ పదవితో పాటు సహాయక సిబ్బంది కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మొదటి నుంచి రాహుల్ ద్రావిడ్ లేదా అనిల్ కుంబ్లేలలో ఒకరికి ఆ పదవిని అప్పగించాలని భావించారు. అయితే గతంలో అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్న సమయంలో ఆటగాళ్లతో పలు విభేదాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా పలువురు బీసీసీఐ పెద్దలు కూడా కుంబ్లే అభ్యర్థిత్వంపై వ్యతిరేకత చూపించారు.

దీంతో రాహుల్ ద్రావిడ్ వైపు పలువురు ఆసక్తి చూపించారు. మంగళవారం హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేయడానికి ఆఖరి రోజు కావడంతో పలుమార్లు ద్రావిడ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. రూ. 10 కోట్ల మేర జీతానికి రాహుల్ ద్రావిడ్ ఒప్పుకున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. వరల్డ్ కప్ అనంతరం జరిగే న్యూజీలాండ్ సిరీస్ నుంచే ద్రావిడ్ కోచ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది. ఇక రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ అయితే నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ పదవి ఖాళీ కానున్నది. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను డైరెక్టర్ చేయాలని బీసీసీఐ భావిస్తున్నది. మరోవైపు టీమ్ ఇండియా బ్యాటింగ్ కోచ్ పదవికి విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ పదవికి మాజీ కీపర్ అజయ్ రాత్రా దరఖాస్తు చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story