సోకాల్డ్ కమ్యూనిస్టులు ఏకమవ్వకుంటే అదో గతే!

by Shyam |
సోకాల్డ్ కమ్యూనిస్టులు ఏకమవ్వకుంటే అదో గతే!
X

దిశ, మహబూబాబాద్ : రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఒంటరిగా పోరాడుతుంటే సోకాల్డ్ కమ్యూనిస్టులు మాత్రం ఓట్ల కోసం వేరు కుంపట్లు పెట్టుకోవడం దేనికి సంకేతమని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశ్నించారు. ప్రజాకవి గొడిశాల జయరాజు తల్లి బోగిళ్ల అచ్చమ్మ సంస్మరణ సభను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అతని నివాసంలో ఆదివారం నిర్వహించారు. భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభకు నారాయణమూర్తి హాజరై మాట్లాడారు. సోకాల్డ్ కమ్యూనిస్టులు ఏకం కాకుంటే ప్రజలు, రైతుల ఓట్లు పడవన్నారు. వ్యవసాయం సైతం ప్రైవేటీకరణ కాబోతుంటే కమ్యూనిస్టులు తమ పంథా మార్చుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, అరుణోదయ నాగన్న, ప్రజాఫ్రంట్ నాయకులు నలమాస కృష్ణ, పోటు రంగారావు, చిన్న చంద్రన్న, సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు రాములు, రాయల చంద్రశేఖర్, ప్రమ్ చంద్, జూపూడి ప్రభాకర్ తదితరులు మాట్లాడారు.

ఈ దేశంలో వీరుల చరిత్ర.. వారిని కన్న తల్లుల చరిత్ర కనుమరుగు అయిందన్నారు. ‘మా తల్లుల చరిత్రలే ఈ దేశ చరిత్రలు’ అనే నినాదం‌తో ఈ సభ సాగింది. పాలకుల, రాజుల, రాణుల చరిత్రలు ముందుకు రావడం చరిత్రక తప్పిదం అన్నారు. దేశంలో రాజకీయం కోసం మనుషుల మధ్య విద్వేష బీజాలు నాటుతున్నారని తెలిపారు. జయరాజు లాంటి కవులు రెట్టింపు వేగంతో దేశంలో జరుగబోయే అశాస్త్రీయతకు చెక్ పెట్టాలని కోరారు. ప్రపంచ చరిత్ర అంతా శ్రామిక వర్గం నుంచి వచ్చిన తల్లులదే అన్నారు. అమ్మల చరిత్ర, అవని చరిత్రను పాలకులు వక్రీకరణ చేశారని అన్నారు. జయరాజు రచనల సారాంశం అంతా ప్రత్యామ్నాయ సంస్కృతి వైపు, ఒక నూతన మానవ ఆవిష్కరణ కోసం సాగాయని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed