వైఎస్సార్సీపీలో కలకలం రేపుతున్న పీవీపీ ట్వీట్

by srinivas |
వైఎస్సార్సీపీలో కలకలం రేపుతున్న పీవీపీ ట్వీట్
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, వైఎస్సార్సీపీ నేత పీవీపీ చేసిన ట్వీట్ వైఎస్సార్సీపీలో కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత విద్యా, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా… ఆయన మౌనంగా తన పనితాను చేసుకెళ్లిపోతున్నారు. మరో ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీకి తీరుగులేదు అనుకుంటున్న తరుణంలో పీవీపీ చేసిన ట్వీట్ సీఎం మార్పు చోటుచేసుకుంటుందా? అన్న అనుమానాలకు తావిస్తోంది.

విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీపీ.. టీడీపీ ఎంపీ కేశినేని నాని చేతిలో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి పెద్దగా రాజకీయాల జోలికి రాని పీవీపీ అడపాదడపా ట్వీట్లు చేస్తూ టీడీపీ, కేశినేని నానిపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన తాజాగా సొంత పార్టీపైనే చేసిన ట్వీట్ పలు అనుమానాలకు తావిస్తూ..పార్టీలో పెద్ద చర్చను లేవదీసింది. ఇంతకీ ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే…

‘బూజు పట్టిన సాంప్రదాయాలకు తెరదించుతూ… మగ ఆఫీసర్స్ ఆడవారి ఆర్టర్లను తీసుకోరు అనే ప్రభుత్వ వాదనను పక్కనపెట్టి… కొత్త శకానికి నాంది పలికిన సుప్రీంకోర్టు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు ఆడవారికి సమాన ఆస్తి హక్కులు కల్పించి, మన తెలుగు కుటుంబాల ఉదారతను ప్రపంచానికి తెలియజేశారు. అదే స్ఫూర్తితో మన తెలుగువారు కూడా మన ఆడపడుచులను గౌరవిస్తూ, తెలుగు మహిళా ముఖ్యమంత్రిని చూడాలని కోరుకుంటున్నాను. అవకాశాల్లో సగం, ఆస్తిలో సగం, ప్రజా ప్రతినిధులలో సగం, ప్రభుత్వంలో సగం’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ట్వీట్ ఒక్కసారిగా వైరల్ కావడంతో ప్రమాదాన్ని శంకించిన పీవీపీ దానిని తొలగించారు. అయితే అప్పటికే దానిని స్క్రీన్ షాట్ తీసుకున్న నెటిజన్లు మాత్రం దానిని వైరల్ చేస్తున్నారు. సీఎం జగన్ ఉండగా పీవీపీ కోరుకుంటున్న మహిళా సీఎం ఎవరు? అనే చర్చ ఆరంభమైంది. జగన్ సీఎంగా పూర్తి కాలం పదవిలో కొనసాగరా? జగన్ మరోసారి జైలుకి వెళ్లే పరిస్థితి ఉందా? అంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

జగన్ గైర్హజరీలో వైఎస్సార్సీపీ భారాన్ని వైయస్ భారతి, షర్మిళ, వైయస్ విజయమ్మలలో ఎవరు మోస్తారు? ఈ ముగ్గురిలో జగన్ స్థానంలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేది ఎవరు? ఉన్నపళంగా.. రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ మార్పులు చోటుచేసుకోకుండా పీవీపీ ఈ ట్వీట్ చేయడం వెనుక కారణమేంటి? అంటూ చర్చ తారస్థాయికి చేరుకుంటోంది. పీవీపీ దీనిపై స్పందించలేదు. దీంతో ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటూ విశ్లేషించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed