- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ ఠీవీ మన పీవీ
దిశ ప్రతినిధి, కరీంనగర్: విలక్షణ వ్యక్తిత్వం, బహుముఖ రంగాల్లో పాండిత్యం ఆయన సొంతం. ఉమ్మడి ఏపీకి సీఎంగానే కాదు, తెలుగు జాతి అంతా చెప్పుకునేలా దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవిని అధిష్ఠించిన మొదటి వ్యక్తి పీవీ నరసింహారావు.
జాతీయోద్యమకారునిగా, ప్రాంతీయోద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన పీవీ నిస్వార్థ రాజకీయానికి నిలువుటద్దం. స్వాతంత్ర్య సమరానికి ముందు బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం పోరాటం చేస్తే ప్రజా జీవితంలోనూ అదే స్ఫూర్తితో కొనసాగారు. బహుభాషా కోవిదునిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదిగిన పీవీ భూ స్వామ్య కుటుంబంలో పుట్టి భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారు. భారత ఆర్థిక సంస్కరణల పితామహుడైన నరసింహారావు జీవన విధానంఅత్యంత వైవిధ్యంగా సాగింది. 1921 జూన్ 28న నర్సంపేట సమీపంలోని లక్నెపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో జన్మించిన పివి పెద్దనాన్న రంగారావు ఇంటికి దత్తపుత్రుడిగా వెళ్లాడు.1957 నుంచి 1972 వరకు వరసగా నాలుగు సార్లు మంథని ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహోన్నత నేత అయిన పీవీ నరసింహారావు గురించి ఆయన సన్నిహితుల మాటల్లో..
ప్రత్యర్థి షష్టిపూర్తికి హాజరైన గొప్పవ్యక్తి
రాజకీయంగా వైరుధ్యమే కాదు ఏకంగా ఎమ్మెల్యేగా తనపై పోటీ చేసిన నాయకుని షష్టిపూర్తి ఉత్సవానికే హాజరైన గొప్పవ్యక్తి పీవీ నరసింహారావు అని స్వాతంత్ర్య సమరయోధుడు రాంపెల్లి కిష్టయ్య తెలిపారు. మంథని మొట్టమొదటి ఎమ్మెల్యే గులుకోట శ్రీరాములు షష్టి పూర్తి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి విదేశాంగా శాఖ మంత్రి హోదాలో పీవీ హాజరయ్యారని చెప్పారు. శ్రీరాములు రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ పీవీ హాజరు కావడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. స్వాతంత్ర్యం కోసం మంథని ప్రాంతానికి తామంతా మహారాష్ట్ర చాందా (చంద్రపూర్)లో సాయుధ శిక్షణ పొందుతున్నసమయంలో గుల్కోట శ్రీరాములు నేతృత్వంలో ఏర్పడిన మా బృందానికి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన యోధులు కూడా జత కలిశారు. ఈ నేపథ్యంలో మాకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు పీవీ కూడా వచ్చారు. వివిధ భాషల్లో అనర్గళంగా ఉపన్యసించే పీవీ వ్యక్తిగతంగా మాత్రం మితభాషిగానే ఉండేవారన్నారు. మంథని ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు ఆనాటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైనని, బొక్కలవాగుపై వంతెన, మంథని పట్టణానికి గోదావరి నీటి సరఫరా, సోమన్ పల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం వంటివెన్నో చేశారన్నారు. ఎక్కడ, ఎప్పుడు కలిసినా పేరు పెట్టి పిలిచే వారని వివరించారు. ప్రధానిగా ఎదిగినా కూడా మంథని ప్రాంతాన్ని మాత్రం మర్చిపోకుండా మసలుకోవడం ఆయన స్పెషాలిటీ అని చెప్పారు. ఉన్నత స్థానానికి ఎదిగినా ఒదిగి ఉండేతీరులో ఆయనకు ఆయనే సాటని రాంపెల్లి కిష్టయ్య చెప్పారు. మంథని, మహాదేవపూర్ ప్రాంతంలోని దాదాపు అన్ని గ్రామాలతో ఆయనకు సంబంధాలు ఉండేవని తెలిపారు.
దేశానికే వన్నెతెచ్చాడు..
వంగెర బిడ్డ భారతదేశానికే వన్నె తెచ్చి చరిత్ర సృష్టించాడని బొజ్జపూరి వెంకటయ్య చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ దశ, దిశను మార్చేసిన ఘన కీర్తి పీవీకే సొంతమన్నారు. మహోన్నత విలువలతో కూడిన పీవీ దేశమే తన కుటుంబం అన్న రీతిలో వ్యవహరించారు తప్ప లాభాపేక్షకోసం మాత్రం పాకులాడలేదని చెప్పారు. దేశానికే ప్రధానిగా పనిచేసినప్పటికీ ఢిల్లీలో ఇల్లు కూడా కట్టుకోలేదన్నారు. మొదట సోషలిస్టు నాయకునిగా పీవీకి వ్యతిరేకంగా మంథనిలో ప్రచారం చేసి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పీవి నరసింహారావు వద్ద శిష్యరికం చేశానని తెలిపారు. స్వాతంత్య్రోద్యమ పోరాట సమయంలో చాందా క్యాంపులో సాయుధ శిక్షణ పొందుతున్న సమయంలో విముక్తి పోరాటం కోసం ఎన్నో ప్రసంగాలు చేశారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. తన ప్రాంత అభివృద్ధి కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావించి రాజకీయ జీవితాన్ని గడిపారన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నాను. ఆయనను కలిసేందుకు సెక్యూరిటీ సమస్యలు ఎదుయ్యాయి. కానీ, ఆయన చూస్తే మాత్రం పేరు పెట్టి పిలిచి మరీ పలకరించిన సందర్భాలు ఎన్నోఉన్నాయని చెప్పారు. ఓ వైపున దేశం మరోవైపున కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు మాత్రం దారుణమన్నారు. పీవీ విషయంలో అధిష్టానం చిన్నచూపు చూడటం బాధించిందని వెంకటయ్య వ్యాఖ్యానించారు. ఆయన దేశానికి చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇచ్చి గౌరవించాలని కోరారు.
ఆనాడే టెక్నాలజీతో బ్రిడ్జి
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని మానేరు దిగువ ప్రాంతానికి చెందిన దాదాపు 120 గ్రామాల ప్రజలు నియోజకవర్గ కేంద్రానికి రావాలంటే మానేరు నదిని దాటాల్సిన పరిస్థితి ఉండేది. నదిపై వంతెన లేకపోవడంతో మహదేవపూర్ ప్రాంత వాసులు ఆరెంద వెంకటాపూర్ వరకు చేరుకుని బస్సు ఎక్కి వెళ్లేవారు. తాడిచర్ల ప్రాంతానికి చెందిన వారు మానేరు నది దాటి ఖమ్మంపల్లి వరకు వచ్చి అక్కడ్నుంచి మంథనికి వెళ్లేవారు. మానేరు నది దిగువ ప్రాంత వాసులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న అప్పటి మంథని ఎమ్మెల్యే పీవీ నరిసింహారావు సోమన్‌పల్లి వద్ద మానేరు రివర్‌పై వంతెన నిర్మించేందుకు నిధులు మంజూరు చేయించారు. జర్మనీ టెక్నాలజీతో ఆ బ్రిడ్జి కట్టించారుల. బ్రిడ్జి రూఫ్‌కు పిల్లర్లకు మధ్య స్ప్రింగులను ఏర్పాటు చేసి వంతెనను పూర్తి చేయించారు. దీంతో ఈ వంతెన స్ప్రింగ్‌లా ఊగుతూ ఉంటుందని ఇంజినీర్లు చెప్పారు.
ఆయన పేరిట ఊరు
సోమన్‌పల్లి వద్ద భారీ వంతెన నిర్మాణం చేపట్టడంతో వంతెన పక్కనే పీవీ చేసిన కృషికి గుర్తుగా పీవీ నగర్ అనే ఓ గ్రామమే వెలిసింది. మంథని పట్టణానికి అడ్డుగా ఉన్న బొక్కలవాగు వల్ల వర్షాకాలంలో సంబంధాలు లేకుండా పోయేవి. రోడ్డు డ్యాం నిర్మించినప్పటికీ వరద నీరు పొంగిపొర్లితే మంథని పట్ణణం జలదిగ్బంధనంలో కూరుకపోయేది. అలా జరగకుండా అక్కడ బొక్కలవాగుపై ప్రత్యేకంగా వంతెన నిర్మాణం చేయించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేసిన ఘనత కూడా పీవికే దక్కుతుంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన మంథని అభివృద్ధి విషయమై పీవీ శ్రద్ధ చూపేవారు. మహదేవపూర్, కాటారం, మహాముత్తారం మండలాలను కలుపుతూ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 105 కిలోమీటర్ల రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 8.60 కోట్ల నిధులు మంజూరు చేయించారు.