పంజాబ్‌లో మే 1 వరకు లాక్‌డౌన్

by Shyam |

ఛండీగడ్ : పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను అమలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ శుక్రవారం.. వీడియో కాన్పరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునేందుకు, రానున్న పంట కోతల కాలంలో ప్రజలు గుమిగూడొద్దన్న అంశాలపై చర్చించేందుకు సీఎం ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదమున్నదని అందుకే, సకాలంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగించే నిర్ణయం తీసుకున్నారు. కాగా, లాక్‌డౌన్ పొడిగింపుపై తీసుకున్న నిర్ణయాన్ని రేపు జరిగే సదస్సులో ప్రధాని మోడీకి సీఎం వివరించబోతున్నట్టు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. పంజాబ్ క్యాబినెట్ లాక్‌డౌన్‌ను వచ్చే నెల 1వ తేదీవరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నదని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేబీఎస్ సిద్దూ ట్వీట్ చేశారు.

దీంతోపాటు పంజాబ్ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్‌డౌన్‌ను ఏ పద్ధతిలో ఎత్తివేయాలన్న వ్యూహాన్ని రచించేందుకు 15 మంది సభ్యులతో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీలో వాణిజ్యం, వ్యాపారం, పారిశ్రామిక, పౌరసమాజం, వైద్యారోగ్య నిపుణులు సహా పలురంగాల నుంచి ఈ కమిటీలో సభ్యులను ఎంపిక చేసింది. ఈ వ్యూహాన్ని రూపొందించి అందిచేందుకు పదిరోజుల గడువును ఇచ్చింది. అంతేకాదు, రాష్ట్ర ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మెన్ మాంటెక్ అహ్లువాలియా ఈ కమిటీకి నేతృత్వం వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఐదో తరగతి, ఎనిమిదో తరగతి విద్యార్థులను పై తరగతికి ప్రమోట్ చేసే నిర్ణయం తీసుకున్నది.

ఈ నెల 14న ముగియనున్న లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించబోయే అవకాశమున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో కేంద్రం విధించిన లాక్‌డౌన్‌కు ముందే పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను అమలు చేయడం గమనార్హం.

Tags: punjab, lockdown, extension, may 1, cm amarinder singh, cabinet, decision

Advertisement

Next Story