‘సుక్క’ లేక చుక్కలు చూస్తున్నరు !

by Shyam |
‘సుక్క’ లేక చుక్కలు చూస్తున్నరు !
X

దిశ, మేడ్చల్: ప్రపంచవ్యాప్తంగా కంటికి కనిపించకుండా లక్షలాది మందికి సోకి, వేలాది మంది ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్.. ప్రజెంట్ సిచ్వేషన్‌లో కల్లు, మద్యం ప్రియులను బలిగొనేలా చేస్తుంది. ఐదారు రోజులుగా మద్యం, కల్లు కంపౌండ్‌‌లు తెరవకపోవడంతో మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఇప్పటికీ వైన్‌షాపులు వద్దే పడిగాపులు కాస్తున్నారంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్‌ ఇందిరానగర్‌‌కు చెందిన మధుకు మద్యం తాగే అలవాటు ఉంది. 5రోజులుగా మద్యం దొరక్కపోవడంతో మతిస్థిమితం కోల్పోయి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా బేగంపేటకు చెందిన సాయికుమార్‌‌ టైల్స్‌ కూలీగా పనిచేస్తూ మద్యానికి అలవాటు పడ్డాడు. మద్యం దొరక్క పోవడంతో పంజాగుట్ల ఫైఓవర్‌ నుంచి దూకగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అటు నిజామాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తికి కల్లు దొరక్కపోవడంతో ఫిట్స్ వచ్చి చనిపోయాడు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోనూ అశోక్‌ అనే వ్యక్తి కల్లుకు అలవాటు పడి బానిసయ్యాడు. అతడి భార్య ఇంట్లో కట్టేయగా, తప్పించుకొని పోతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయాడు.

అటు కల్లు, ఇటు మద్యం లేకపోవడంతో రాష్ట్రంలో మందుబాబులు ఆగమాగం అవుతున్నారు. కొందరు ఫిట్స్‌ వచ్చి, కోమాలోకి పోతుండగా ఇంకొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నరు. కరోనా కట్టడికి సర్కారు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో అత్యవసర సేవలు అన్నింటినీ మూసివేసింది. దీనిలో భాగంగానే మద్యం, కల్లు దుకాణాలు, బార్లు, కూడా మూతపడ్డాయి. కరోనాతో ప్రాణం పోయినా సరే కల్లు కావాలంటూ కొందరు కల్లుబట్టీల వద్దకు వచ్చి ఆందోళన చేస్తుండటం గమనార్హం. దీన్ని భరించలేక కొన్ని చోట్ల స్థానిక సర్పంచ్‌లు కల్లు దుకాణాలను తెరిపించారు.

‘కల్లు’ లేక పిచ్చిపిచ్చి చేస్తున్నరు

కల్లుకు బానిసైన చాలా మంది వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. కల్లు లేకపోవడంతో శరీరం వణకడం, నిలబడ్డ చోటే కూలిపోవడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. ఇలాంటి కేసులు రాష్ట్రంలోని నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, హైదరాబాద్‌ లాంటి చోట్ల అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణంగా తాటి, ఈత చెట్ల నుంచి తీసే కల్లుకు కాంపౌండ్లలో అమ్మే సీసా కల్లుకు చాలా తేడా ఉంటుంది. కల్లు దుకాణాల్లో అచ్చంగా చెట్టు నుంచి తెచ్చిన కల్లు అమ్మరు. ఇక్కడే విక్రయించే కల్లులో కల్లులో డైజోఫామ్‌, క్లోరోఫామ్‌, ఆల్ఫడాజోలం లాంటి కెమికల్స్‌ను కలుపుతారు. ఒక్కసారి దానికి అలవాటుపడ్డారంటే దానికి బానిసలు అయిపోతారు. నిత్యం తాగనిదే రోజు గడవదు. గతంలో కూడా కల్లు దుకాణాలు బంద్ చేసినప్పుడల్లా జనం మానసిక రోగుల్లా చేసిన పరిస్థితులు ఉన్నాయి.

మందు లేక సూసైడ్స్‌..

కొందరు కాంపౌండ్‌ కల్లు లేకపోవడంతో పిచ్చిపిచ్చిగా చేస్తుండగా, నిత్యం చుక్క వేసే మందుబాబుల పరిస్థితి మరోలా తయారైంది. వణకడం, నాలుక పిడిశ కట్టుకుపోవడం, తల దిమ్మదిమ్మ కొట్టుకోవడం, అశాంతి, ఆందోళనకు గురవుతారు. ఈ నెల 22 నుంచి మద్యం బంద్‌ కాగా, మొదట రెండు రోజులు ఉండగలిగారు. ఇప్పటికే 6 రోజులు గడవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సాధారణంగా డీ అడిక్షన్ సెంటర్లలో కూడా కల్లు, మందు ఒక్కసారిగా బంద్‌ చేయించరు. మెల్లమెల్లగా కౌన్సెలింగ్‌ చేస్తూ తాగుడు మాన్పిస్తరు. కానీ ప్రస్తుతం ఒక్కసారిగా మద్యం, కాంపౌండ్‌ కల్లు లేకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏకంగా రెండు గంటలైనా దుకాణాలు తెరవాలని డిమాండ్‌ చేస్తుండటం గమనార్హం.

పల్లె కల్లుకు డిమాండ్‌

మద్యం కట్టడితో పల్లెల్లో కల్లుకు డిమాండ్ పెరిగింది. జనాలంతా పొలాలకు, తాటి చెట్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. కల్లు కోసం ఎంతైనా పెట్టడానికి వెనకాడటంలేదు. ఒక లీటర్ తాటికల్లు గతంలో రూ. 30 ఉంటే, ప్రస్తుతం రూ.50 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. అంతేకాదు తాటిచెట్ల దగ్గర కూడా సామాజిక దూరంగా పాటిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు మీటర్ల దూరం ఉంచి సర్కిల్స్ ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story