తగ్గిన ఆస్తులు…పెరిగిన మోసాలు!

by Harish |
తగ్గిన ఆస్తులు…పెరిగిన మోసాలు!
X

ఆస్తులేమో తరిగిపోయే..మోసాలేమో పెరిగిపోయే! ప్రసుత్తం ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు సంస్కరణల పేరిట ప్రభుత్వ నిర్ణయాలు, మరోవైపు తీసుకున్న అప్పులను ఎగ్గొట్టే బాపతుగాళ్లు…రెండిటి మధ్య బ్యాంకింగ్ రంగం నలుగుతోంది. బ్యాంకులను ఆర్థికంగా మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల అనంతరం ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)ల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ)లు 2019 సెప్టెంబర్ 30 నాటికి రూ. 7.27 లక్షల కోట్లకు తగ్గినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. గతంలో 2018 మార్చి చివరి నాటికి ఎన్‌పీఏలు రూ. 8.96 లక్షల కోట్లుగా ఉండేవి.

‘పూచీకత్తు, పర్యవేక్షణ,పునరుద్ధరణలను మెరుగుపరచడానికి పీఎస్‌బీలలో సమగ్ర సంస్కరణలను ప్రభుత్వ ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్ రంగం అన్ని అంశాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించిందని, ఈ ఫలితాల కారణంగానే ఎన్‌పీఏలు తగ్గాయని’ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమాధానమిచ్చారు. 2019, సెప్టెంబర్‌తో ముగిసిన ఒకటిన్నర సంవత్సర కాలంలో రికవరీలు రికార్డు స్థాయిలో రూ. 2.03 లక్షల కోట్లని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో మొత్తం 18 పీఎస్‌బీలలో 12 పీఎస్‌బీలు లాభాలను నివేదించాయని చెప్పారు. ఈ గణాంకాలు గత ఏడున్నర సంవత్సరాల్లో అత్యధిక కేటాయింపు కవరేజ్ నిష్పత్తి అని నిర్మలా సీతారామన్ అన్నారు.

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, పీఎస్‌బీల స్థూల నిరర్ధక ఆస్తులు 2015 మార్చి 31 నాటికి రూ. 2,79,016 కోట్ల నుంచి 2017 మార్చి 31 నాటికి రూ. 6,84,732 కోట్లకు పెరిగాయి. అలాగే 2018 మార్చి 31 నాటికి రూ. 8,95,601 కోట్లకు పెరిగాయి. అదే సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకు కేటాయింపు కవరేజ్ నిష్పత్తి 60.5 శాతం నుండి 61.5 శాతానికి పెరిగినట్టు ఆర్థిక మంత్రి లోక్‌సభలో వెల్లడించారు. పీఎస్‌బీల నికర నిరర్ధక ఆస్తుల నిష్పత్తి క్షీణించిందని మంత్రి అన్నారు. ఇది బ్యాంకింగ్ రంగం స్థితిస్థాపకతను సూచిస్తుంది.

ఋణాలను పొడిగించడంలో బ్యాంకుల విశ్వాసానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి, అరుదైన క్రెడిట్ డీఫాల్ట్ సంఘటనలు, మోసాల వల్లే బ్యాంకులు ఋణాలివ్వడంలో విముఖతకు కారణమని స్పష్టం చేశారు. ఎంపిక చేసిన ఆర్థిక సంస్థలు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు నివేదించిన మోసపూరిత కేసుల విలువ 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,934 కోట్లు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ. 41,167 కోట్లకు పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక 2018-19 ఆర్థిక సంవత్సరంలో మోసపూరిత కేసుల విలువ రూ. 71,543 కోట్లు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో వీటి విలువ రూ. 1,13,374 కోట్లకు పెరిగింది. అయితే, బ్యాంకులు ఇచ్చే ఋణాలకు సంబంధించిన ఇతర విషయాలను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్‌బీఐ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా సానుకూల ద్రవ్య నిర్వహణ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల రంగానికి నగదు మద్దతు, నిలిచిన పోయిన గృహ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం కల్పించడం వంటివి ఈ చర్యల్లో ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల రీ క్యాపిటలైజేషన్ కారణంగా వాణిజ్య బ్యాంకుల మూలధన సమృద్ధి నిష్పత్తి 2019 మార్చిలో 14.3 శాతం నుండి 2019 సెప్టెంబర్ నాటికి 15.1 శాతానికి మెరుగుపడిందని ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన ఆర్థిక నివేదికలో పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed