ప్రజలు విసిగి పోతున్నారు.. ప్రజాప్రతినిధులకు ఫ్యాషన్ అయిందా..!

by Anukaran |   ( Updated:2021-03-05 12:57:12.0  )
ప్రజలు విసిగి పోతున్నారు.. ప్రజాప్రతినిధులకు ఫ్యాషన్ అయిందా..!
X

సైరన్‌తో కూడిన బుగ్గకారు ప్రజాప్రతినిధుల డాబు, దర్పానికి ప్రతీక. 2017 మే 1వ తేదీ నుంచి వీటి వినియోగంపై నిషేధం ఉన్నా ప్రజా ప్రతినిధులు పట్టడంలేదు. నిబంధనలు, సర్క్యులర్లు ఎలా ఉన్నా ఆ హోదాను వదులుకోడానికి సిద్ధంగా లేరు. అందుకే కార్పొరేషన్ చైర్‌పర్సన్ మొదలు మంత్రుల దాకా ఇప్పటికీ సైరన్ మోగిస్తూనే ఉన్నారు. నగరంలో వందలాది వాహనాల సైరన్​ మోతలకు జనం విసిగి వేసారి పోతున్నారు. ప్రజాప్రతినిధులే కాకుండా వాళ్ల కుటుంబసభ్యులు సైతం ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో వెయ్యి వాహనాలు సైరన్​తో తిరుగుతున్నట్టు అంచనా.

దిశ తెలంగాణ బ్యూరో: నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో వారం రోజుల క్రితం ఓ ఇన్నోవా వాహనం సైరన్‌ మోగిస్తూ హల్‌చల్ చేసింది. ఓ ప్రజా ప్రతినిధి కుమారుడు తన వ్యక్తిగత వాహనంలో వచ్చి సైరన్ మోగించి అక్కడి వారిని ఇబ్బందిపెట్టాడు. పక్కనే పోలీస్ పాట్రోలింగ్ వాహనం ఉన్నా పట్టించుకోలేదు. రాష్ట్రంలో 23 మంది ఎంపీలు, 120 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు, సుమారు 80 మంది వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, 60 మందికిపైగా కలెక్టర్లు, ఎస్పీలు ఇప్పటికీ సైరన్ వినియోగిస్తూనే ఉన్నారు. కారులో వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నా అదో అలవాటుగానే మారిపోయింది. వీరికి అధికారికంగా వచ్చిన వాహనాలతోపాటు వ్యక్తిగత వాహనాలకు కూడా ఇలాంటి సైరన్‌లను బిగించుకుంటున్నారు. దీంతో కనీసంగా వెయ్యి వాహనాలు రాష్ట్రంలో సైరన్‌లతో తిరుగుతున్నట్టు ఒక అంచనా. చివరకు జీహెచ్ఎంసీలోని పలువురు కార్పొరేటర్లు సైతం సైరన్లు వాడుతున్నారు.

టీఆర్ఎస్‌కి చెందిన రాజ్యసభ సభ్యుడు తన వ్యక్తిగత వాహనానికి సైరన్ అమర్చుకున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన కొడుకు నాగర్‌ కర్నూల్ పోలీస్ స్టేషన్ ముందే సైరన్ మోగించారు. ఆ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విషయం చివరకు ఎంపీదాకా పోయింది. తప్పేముందంటూ పోలీసులతో ఆ ఎంపీయే వాదనకు దిగారు. ఇది అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ఒక్క ఎంపీ విషయమే కాదు.. చాలా మంది ప్రజాప్రతినిధుల కార్లు నిబంధనలకు విరుద్ధంగా ఇలా రోడ్డెక్కుతున్నాయి. వ్యక్తిగత వాహనాలకు కూడా సైరన్లు బిగించుకుంటున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ఇది ఒక హోదాగా మారిపోయింది.

విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రతినిధులతో పెట్టుకుంటే ఏమవుతుందో చాలా మంది పోలీసులకు స్వీయానుభవం. వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడొద్దనే నిబంధన విషయంలోనూ ఇదే ధోరణి. సైరన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణలోని ఎంపీలు సైతం సమర్థించారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలికింది. కానీ అమలులో మాత్రం ఆ జాడ్యాన్ని వదులుకోడానికి ప్రజా ప్రతినిధులు సిద్ధంగా లేరు. వారితో ఘర్షణ ఎందుకనే ధోరణితో పోలీసులు సైతం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.

సామాన్యులకు సైరన్ కష్టాలు

ట్రాఫిక్ కూడళ్ల దగ్గర, రద్దీ ప్రదేశాల్లో ప్రొటోకాల్ అంటూ సైరన్ కూతతో ప్రజాప్రతినిధులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటివి రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ సిబ్బంది ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. సైరన్‌తో వెళ్లే ఆంబులెన్సుకు దారి ఇవ్వని ప్రజలు వీఐపీల పేరుతో మోగించే సైరన్‌కు మాత్రం జై కొడుతున్నారు. దీన్ని విమర్శించేవారూ ఉన్నారు. డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ లేనివారిపైనే ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారిస్తున్నారు తప్ప డబుల్ హారన్లు, బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ వినియోగం, శబ్ద కాలుష్యాన్ని కలిగించే హారన్లపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.

ఉల్లంఘిస్తే చర్యలేంటి?

నిబంధనలకు విరుద్ధంగా సైరన్లను వాడితే శిక్షార్హులంటూ మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 190 (2) స్పష్టంగా పేర్కొంది. సైరన్లు బిగించి శబ్దకాలుష్యానికి పాల్పడుతున్నవారికి రూ.2,000 నుంచి రూ.3,000 వరకు జరిమానా విధించాలని పేర్కొంది. తెలంగాణలో నిత్యం వందలాది వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నా ఒక్కరికీ జరిమానా విధించలేదు. పైగా సైరన్ మోగించిన వాహనాన్ని వీఐపీకి చెందినదిగా భావించి మరింత రాచమర్యాదలు చేసి, సామాన్యులను ఇబ్బంది పెట్టి, ట్రాఫిక్ మొత్తాన్ని ఆపి మెహర్బానీ చాటుకుంటున్నారు. ఆ వాహనాల కోసం మామూలు ట్రాఫిక్‌ని నిలిపేస్తున్నారు. ఈ క్రమంలో డ్యూటీకి ఆలస్యమవుతోందని మొత్తుకునే చిరుద్యోగులు వేల సంఖ్యలోనే ఉన్నారు.

“వీఐపీ కల్చర్ లేదనుకుంటాం. కానీ ఇప్పటికీ అది కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఎంతగా చెప్పినా ఆ అలవాటును మానుకోడానికి మన నాయకులకు మనసు ఒప్పుకోవడంలేదు. సైరన్లు, ట్రాఫిక్‌ నిలిపేయడం లాంటి కారణాలతో అనుకున్న సమయానికి ఆఫీసులకు చేరుకోలేకపోతున్నాం. దీంతో ముందుగానే బయల్దేరాల్సి వస్తోంది. ట్రాఫిక్‌లో వీఐపీ కల్చర్ అవసరం లేదనేది నా అభిప్రాయం. ట్రాఫిక్‌లో ఉన్నట్టుండి ఒకేసారి సైరన్ మోగడంతో మహిళలు, పిల్లలు ఆ భారీ శబ్దానికి హడలిపోతున్నారు”.– ముత్యాల దీపక్ రెడ్డి, హైదరాబాద్

ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే ఉండాలి

“మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఎమర్జెన్సీ వాహనాలు తప్ప ఇతర వాహనాలేవీ సైరన్ వాడకూడదు. పోలీసు, ఫైర్, అంబులెన్సు, రెడ్ క్రాస్.. ఇలాంటి ఎమర్జెన్సీ వాహనాలకు మాత్రమే ఎర్రబుగ్గ, సైరన్ వినియోగించే అర్హత ఉంది. రాజకీయ నాయకులు వాడడం నిబంధనలకు వ్యతిరేకమే. నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం. జరిమానాలు చెల్లించాలి. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి”. – పురుషోత్తం, డిప్యూటీ ట్రాన్సుపోర్టు కమిషనర్, వరంగల్

Advertisement

Next Story

Most Viewed