భారత్‌లో ‘పబ్జీ’ ఖేల్ ఖతం

by Anukaran |   ( Updated:2020-10-30 10:28:56.0  )
భారత్‌లో ‘పబ్జీ’ ఖేల్ ఖతం
X

న్యూఢిల్లీ: భారత్‌లో పబ్జీ మొబైల్ గేమ్ ఖేల్ ఖతమైంది. ఇక నుంచి పబ్జీ మొబైల్, పబ్జీ మొబైల్ లైట్‌ల ద్వారా ఈ ఆటను ఆడటానికి వీలుండదు. వీటికి సంబంధించిన సర్వలన్నింటినీ శుక్రవారం నుంచి భారత్‌లో షట్ డౌన్ చేసినట్టు ఆ కంపెనీ వెల్లడించింది. జాతీయ భద్రత దృష్ట్యా పబ్జీ సహా మరో 117 యాప్‌లపై భారత ప్రభుత్వం గతనెలలో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు రెండు నెలల అనంతరం పబ్జీ తన సేవలను నిలిపివేసింది.

ఈ మేరకు పబ్జీ మొబైల్ కంపెనీ ఫేస్‌బుక్‌లో స్పందిస్తూ.. ‘ప్రియమైన అభిమానులారా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గతనెల 2న జారీ చేసిన ఆదేశాలకనుగుణంగా, భారత్‌లో పబ్జీకి సంబంధించిన అన్ని సేవలను ఈ నెల 30నుంచి నిలిపివేస్తున్నాం. కావునా, పబ్జీ మొబైల్ నోర్డిక్ మ్యాప్: లివక్, పబ్జీ మొబైల్ లైట్ సర్వీసెస్ నిలిచిపోయాయి’ అని పేర్కొంది. అలాగే, తాము యూజర్ల డేటా భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తామని, భారత చట్టాలను గౌరవిస్తామని తెలిపింది. కాగా, నిషేధానికి ముందే పబ్జీని డౌన్‌లోడ్ చేసుకున్నవాళ్లకు ఇన్నాళ్లు ఈ గేమ్ ఆడే అవకాశం లభించింది. కంపెనీ తాజా నిర్ణయంతో ఇకపై ఆ యాప్‌ కూడా పనిచేయదు. అయినప్పటికీ, కొందరు యూజర్లు వీపీఎన్ లేదా ప్రాక్సీని ఉపయోగించి గేమ్ ఆడే అవకాశమున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed