లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన టీమిండియా ఓపెనర్

by Shyam |
Prithvi shah
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాడు. ప్రస్తుతం మహారాష్ట్ర, గోవాలో పూర్తిగా లాక్‌డౌన్ అమలు అవుతుండగా.. అధికారుల అనుమతులు తీసుకోకుండా గోవా వెళ్లేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికాడు. ముంబై నుంచి గోవాకు తన సొంత కారులో బయలుదేరాడు. మహారాష్ట్రలో తిరగాలంటే ఈ-పాస్ తప్పనిసరి. అయితే పృథ్వీషా మాత్రం ఎలాంటి పాస్ తీసుకోకుండా వెళ్తుండగా అంబోలీ జిల్లా చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

అతడి వద్ద ప్రయాణించడానికి ఈ-పాస్ లేకపోవడంతో గోవాకు వెళ్లడం కుదరదని తేల్చి చెప్పారు. పృథ్వీషా తాను భారత జట్టు క్రికెటర్‌ని అని బతిమిలాడినా పోలీసులు కనికరించలేదు. దీంతో అక్కడే నిలబడి ఫోన్ ద్వారా ఈ-పాస్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. గంటన్నర తర్వాత అతడికి ఆన్‌లైన్‌లో పాస్ మంజూరు కావడంతో పోలీసులు పృథ్వీషాను విడిచిపెట్టారు. కాగా, ఐపీఎల్ అర్దాంతరంగా రద్దు కావడంతో ప్రస్తుతం పృథ్వీషా ఇంటికి చేరుకున్నాడు. సెలవులు దొరకడంతో సరదాగా గోవాలో ఎంజాయ్ చేయడానికి బయలు దేరినట్లు తెలసింది.

Advertisement

Next Story

Most Viewed