'ఎల్లుండి కలెక్టరేట్ల ఎదుట నిరసన'

by Shyam |
ఎల్లుండి కలెక్టరేట్ల ఎదుట నిరసన
X

lదిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రకాలుగా వివక్షతకు గురై అనేక రకాలుగా నష్టపోయిన పాలమూరు ప్రజలు నేడు తెలంగాణ పాలనలో కూడా వివక్షతకు గురికావడం ఆందోళన కలిగిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం పోతిరెడ్డిపాడు 203 జీవోపై సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయనతోపాటు రిటైర్డ్ ఇంజినీర్ విఠల్ రావు పాల్గొని మాట్లాడారు. పాలమూరు జిల్లా ఎంపీగా పనిచేసిన నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాకు చేసిందేమిటని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై కొనసాగిన వివక్షత నేడు కూడా కొనసాగుతుందన్నారు. మనకు కేటాయించిన నికర జలాలను కూడా నేటికి మనం వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల దగ్గర మరో 20 టీఎంసీల నీటి నిల్వ అయ్యేలా రిజర్వాయర్ కడితే దక్షిణ తెలంగాణకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే ఎస్ఎల్బీసీపై ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా వెంటనే రూ.500 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తి కావడంతోపాటు రైతులకు నీరు అందుతుందన్నారు. అదే విధంగా రూ. 2 వేల కోట్లు కేటాయిస్తే పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పారు. చివరకు ఈ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తీసుకువచ్చిన 203 జీవోపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ జీవో తెలంగాణ జీవన్మరణ సమస్యగా మారిందన్నారు. ఏపీ తీసుకువచ్చిన జీవో కారణంగా తెలంగాణలో కడుతున్నా ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు కానుందన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదో ప్రజలకు చెప్పాలన్నారు. అసలు ముందుగానే జగన్ కేసీఆర్ తో ఈ ప్రాజెక్టు విషయంపై ఏమైనా చర్చించారా అని ప్రశ్నించారు. ఈ 203 జీవోకు నిరసనగా ఈ నెల 10వ తేదీన అని జిల్లా కేంద్రాల్లోని కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా పార్టీ కార్యదర్శి పరమేష్ గౌడ్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నర్సింహా, ఉమ్మడి జిల్లా కార్యదర్శులు విజయరాములు, ఆంజనేయులు, కొండన్న, నాయకులు వార్లవెంకటయ్య, సురేష్, బాల్ కిషన్, రాం మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed