- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమోషన్ ఫైట్!
దిశ, కరీంనగర్: పోలీసు అధికారుల ప్రమోషన్ల తంతులో తాత్కాలిక ప్రయోజనాలతో కూల్ చేయాలన్న ప్రయత్నాలు మళ్లీ సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని కూడా కాదని పదోన్నతులకు బ్యాచ్ వైజ్ లేదా ట్రైనింగ్‌లో ప్రతిభ ఆధారిత ప్రమోషన్ పద్ధతిని పక్కన పెట్టేస్తున్నారు. దీంతో తప్పుల తడకగా మారిన ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ లిస్ట్ ప్రాతిపాదికనే సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించి చేతులు దులుపుకునే ప్రక్రియకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోసారి ప్రమోషన్ల తంతులో తమకు న్యాయం చేయాలంటే వారికి అన్యాయం చేయాల్సిందేనన్న ఒత్తిళ్లు సైతం పోలీసు బాసులపై పెరుగుతున్నాయి. ఈ పదోన్నతుల వ్యవహారంలో నిన్న మొన్నటి వరకు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి పనిచేసిన వరంగల్ జోన్ పోలీసు అధికారుల మధ్య కోల్డ్ వార్ కూడా మొదలైంది.
అసలేం జరుగుతోంది…?
నక్సల్స్ ప్రాబల్య జోన్ గా ఉన్న వరంగల్ రేంజ్‌లో కొందరి నిర్లక్ష్యం వల్ల ఎస్ఐలుగా పోస్టింగ్ అయిన పోలీసు అధికారులు సకాలంలో పదోన్నతులు పొందలేకపోయారు. ఈ విషయాన్ని కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ దృష్టికి వరంగల్ జోన్‌లోని 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన సీఐలు తీసుకెళ్లారు. హైదరాబాద్ జోన్‌లో పనిచేస్తున్న తమ బ్యాచ్ వారు, జూనియర్లు పదోన్నతులు పొందుతున్నారు కానీ, తమకు మాత్రం అన్యాయం జరిగిందని చెప్పుకుంటున్నారు. వారి గోడంత విన్న సీఎం వెంటనే బ్యాచ్‌ల వారీగా, ట్రైనింగ్‌లో ప్రతిభ ఆధారంగా ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు పోలీసు ఉన్నతాధికారులు కూడా కొంతమేర కసరత్తులు చేశారు. ఇక్కడి నుంచే అసలు కొర్రీల మాయాజాలం మొదలైంది. హైదరబాద్ సిటీ రేంజ్ కు చెందిన 1996 బ్యాచ్ సీఐలు వరంగల్ జోన్‌లోని 1995 బ్యాచ్‌కు చెందిన వారి కంటే ముందు ప్రమోషన్ పొందారు. కాబట్టి హైదరాబాద్ వారికి ముందుగా పదోన్నతులు ఇవ్వాలన్న డిమాండ్ హైదరాబాద్ రేంజ్ వారు లేవనెత్తారు. తమకు ముందు ప్రమోషన్ వచ్చింది కాబట్టి నెక్ట్స్ ప్రమోషన్‌కు కూడా సీనియర్లుగా తామే అర్హులమన్న వాదనను హైదరాబాద్ రేంజ్‌కు చెందిన 1996 బ్యాచ్ అధికారులు తీసుకరావడంతో మళ్లీ పంచాయతీ మొదటికొచ్చింది.
విస్మరిస్తున్న అసలు విషయాలు…
ఆరేళ్ల సీనియారిటీ నిండిన ప్రతీ అధికారి తదుపరి పదోన్నతికి అర్హత సంపాదిస్తాడు. ప్రతీ సంవత్సరం ప్యానెల్ సంవత్సరమనే పద్ధతిలో ఆయా ప్యానెల్ ఇయర్‌లో రేంజ్ లో ఏర్పడే ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయడం ఉన్నతాధికారుల బాధ్యత. పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి, సీనియారిటీ, అకాడమీ మెరిట్ తదితర అంశాల ఆధారంగా జాబితాను తయారు చేసి ఖాళీలను బట్టి ప్రమోషన్లు ఇచ్చే విధానానికి వరంగల్ జోన్‌లో గతంలో కొన్నేళ్ల పాటు మంగళం పాడారు. దీని దుష్ఫలితాలు నేటికీ అనుభవిస్తున్నది మాత్రం వరంగల్ జోన్ పోలీస్ అధికారులే. హైదరాబాద్ సీటీతో పాటు రేంజ్‌లోని పోలీస్ అధికారులు వడివడిగా పదోన్నతులు పొందుతుంటే, వరంగల్ జోన్‌లోని పోలీసులు మాత్రం అన్యాయమే జరుగుతుంది. కానీ బ్యాచ్ సీనియారిటీ, ప్రతిభా పాఠవాలను పక్కనపెట్టి, హైదరాబాద్ రేంజ్, సీటీ వారికే పదోన్నతులు చకాచకా వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలోని జోన్ల విధానాన్నే పట్టుకుని వెళాడాల్సిన దుస్థితి ఇప్పటికీ ఉందని వాపోతున్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఐదు జోన్లు ఉంటే, ఇప్పుడు మాత్రం రెండే జోన్లు మిగిలాయి. ఇందులో వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ పాత జిల్లాలు మాత్రమే ఉంటే మిగతా ఆరు జిల్లాలు హైదరాబాద్ రేంజ్‌లో ఉన్నాయి. హైదరాబాద్ సిటీ జోన్, రేంజ్ పోలీసు అధికారులు కళ్లు మూసి తెరిచే లోగా ప్రమోషన్ పొందుతుంటే వరంగల్ జోన్ పోలీసులు రిటైర్ అయ్యే ముందైనా పదోన్నతి వస్తుందా అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. మరో వైపున నిబంధనల ప్రకారం 70:30 నిష్పత్తిలో ప్రతి ప్యానల్ సంవత్సరం పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. 70 శాతం డైరెక్ట్ రిక్రూట్ అయిన వారికి ప్రమోషన్లు కల్పిస్తే, 30 శాతం ర్యాంకర్లకు ప్రమోషన్ల ప్రక్రియ కల్పించాలన్న నిబంధన ఉండగా అసలు హైదరాబాద్ జోన్ లో పదోన్నతుల ప్రక్రియలో చాలా వరకు ఈ విషయాన్నే పట్టించుకోలదేన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వరంగల్ జోన్‌లో కోల్డ్ వార్..
ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాచ్‌ల వారీగా, జూనియర్ల కింద సీనియర్ బ్యాచ్ వారు పనిచెయ్యడమేంటని ప్రశ్నిస్తూ, ప్రతిభ ఆధారంగా, సీనియర్ బ్యాచ్‌లకు ముందు తరువాతి బ్యాచ్‌ల వారికి వరుసగా ప్రమోషన్ ఇచ్చే ప్రక్రియను స్టార్ట్ చేయాలని ఆదేశించారు. అయితే సిటీ జోన్ పోలీసు అధికారులు కొత్త పల్లవి ఎత్తుకోవడంతో మళ్లీ ఈ ఫైలుకు బ్రేకు పడ్డట్టయింది. దీంతో తమకు పదోన్నతి రావాలన్న ఆలోచనతో ఉన్న 1995 బ్యాచ్‌కు చెందిన వరంగల్ జోన్ అధికారులు సిటీ జోన్ అధికారులతో మిలాఖత్ అయి తమ రెండు బ్యాచ్‌లకు అంటే వరంగల్ జోన్‌లోని 1996 బ్యాచ్ వారిని మినహాయించి ప్రమోషన్ల ఫైలుకు ఓకే చెప్పించుకోవాలని తీవ్రప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 120 సూపర్ న్యూమరరీ పోస్టులను ఎలాగైనా పొందాలని రకరకాల దారులను గుర్తించినట్టు పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. ఇందుకోసం వరంగల్ జోన్ కు చెందిన 1995 బ్యాచ్ చెందిన పోలీసు అధికారులు 1996 బ్యాచ్ సిటీ జోన్ పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయి చర్చలు జరిపి ఈ నిర్ణయానికి వచ్చారని పోలీస్ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వరంగల్ జోన్ 95, 96 బ్యాచ్ అధికారుల మధ్య ఈ కొత్త ప్రతిపాదన సరికొత్త చిచ్చునే రేపినట్టయింది.
1996 బ్యాచ్ పోలీస్ అధికారుల వాదన..
ఇప్పటికే వరంగల్ జోన్ పోలీసు అధికారులు 1989 బ్యాచ్ మొదలుకొని ఇప్పటివరకూ ప్రమోషన్లలో తీరని అన్యాయానికి గురయ్యారు. తమకు జరిగిన అన్యాయం తమ తరువాతి బ్యాచ్ లకు జరగవద్దంటే బ్యాచ్‌ల వారీగా, అకాడెమీలోని మార్కులు, మెరిట్ ఆధారంగా ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. తాత్కాలికంగా తమకు పదోన్నతులు వచ్చాయి కదా అని సంబరపడి పోతే తమ తరువాత, ఎస్సైలుగా ఎంపికయిన వారు కూడా తమలాగే తీరని అన్యాయానికి గురవుతున్నారని, తాత్కాలిక స్వార్ధ ప్రయోజనాలను పక్కనపెట్టి, శాశ్వత పరిష్కారం కనుగొనాలని వారు అధికారుల్ని వేడుకొంటున్నారు. మహారాష్ట్రలో, తమిళనాడు రాష్ట్రాల్లో సీఐలు స్టేట్ వైడ్ గా బదిలీ అయ్యే అవకాశం ఉందని ఇదే విధానాన్ని తెలంగాణాలోనూ అమలు చేసి బ్యాచ్ వైజ్ ప్రమోషన్ల ప్రక్రియ మొదలు పెడితే సామాజిక, సమ, సహజ న్యాయం అమలవుతుందని వివరిస్తున్నారు.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018లో ఏముంది?
2018 ఆగస్టు నెలలో అమల్లోకి వచ్చిన నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లోని మూడవ అధికరణం ఆధారంగా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం, 36 నెలల లోపు ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా వివిధ వ్యవస్థికరించుకోవచ్చు. ఈ పద్ధతిలో ప్రస్తుతం 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం జోనల్ లెవెల్ పరిధిలో ఉన్న ఇన్‌స్పెక్టర్ పోస్ట్‌ను, నూతన ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను అనుసరించి, రాష్ట్రస్థాయి పోస్టుగా క్రమబద్ధీకరిస్తే, దశాబ్దాలుగా నెలకొన్నఈ సమస్యకు తెరపడే అవకాశం ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌లోని ఈ నిబంధనను అనుసరించి, జనవరిలో డీజీపీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను, ప్రభుత్వం అంగీకరించి, ఎస్ఐ పోస్టును జోనల్ పరిధికి ఇన్‌స్పెక్టర్ పోస్టును స్టేట్ లెవెల్ చేస్తూ జీఓ జారీ చేస్తే ఈ రాచపుండు అనే వైరస్‌కు మందును కనుగొన్నట్టే. ఇప్పటికే ఐదు పదుల వయసుకు చేరినా పోలీసు శాఖలో పనిచేస్తున్న అధికారులు రాష్ట్ర రాజధానిలో పని చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో మహానగరంలో లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ అందని ద్రాక్షగానే మిగిలింది.