ఓటు కాస్ట్ పెరిగింది.. అదే మా బలం : కోదండరాం

by Shyam |
ఓటు కాస్ట్ పెరిగింది.. అదే మా బలం : కోదండరాం
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ‘ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట్ల కొనుగోలుకు రంగం సిద్ధమ‌వుతున్నది. ఈసారి ఓటుకు రూ.5 వేలు ఇచ్చే దగ్గర రూ.6వేలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే మా బలాన్ని తెలియజేస్తున్నది. మేం గెలుస్తామనే ఆ పార్టీలు ఓటుకు రేటు పెంచాయి’ అని టీజేఎస్ అభ్యర్థి, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. బుధ‌వారం వ‌రంగ‌ల్ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్‌లో ఆయ‌న మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొందరిపాలే అయ్యిందని, ప్రధానంగా ఆ ఫ‌లాల‌ను కేసీఆర్ కుటుంబ‌ం ఒక్కటే అనుభ‌విస్తోంద‌ని తెలిపారు. రాష్ట్రంలో దోపిడీ, దౌర్జన్య, నియంతృత్వ, జవాబుదారీతనంలేని పాల‌న సాగుతోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజ‌లు వివేచ‌న‌తో ఆలోచిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి గ‌ట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తన ప్రచారంలో అనేక మంది నిరుద్యోగులు, ఉద్యోగులు త‌మ బాధ‌ను చెప్పుకుంటూ క‌న్నీళ్లు పెట్టుకుంటున్నార‌ని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులుగా చ‌లామ‌ణి అవుతూ కాంట్రాక్టులు, యూనివ‌ర్సిటీల‌కు ఆగ‌మేఘాల మీద అనుమ‌తులు తెచ్చుకుంటున్నారన్నారు. ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో ప్ర‌భుత్వం అబద్ధాలు చెబుతోంద‌ని, ఆ మాటలను ప్రజ‌లు విశ్వసించే ప‌రిస్థితిలో లేరన్నారు. తాను గెలుస్తాన‌నే న‌మ్మకం పూర్తిగా ఉందని, అందులో భాగంగానే ప్రత్యర్థులు ఓటుకు రేటు పెంచారని, అదే తమ విజయానికి సూచిక అని చెప్పారు. కార్యక్ర‌మంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధ‌ర్‌రెడ్డి, ప్రధాన కార్యద‌ర్శి పెరుమాండ్ల వెంక‌టేశ్వర్లు, సీనియ‌ర్‌ జ‌ర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed