దాన్ని రద్దు చేయాలని కోరుతూ.. ఆర్థిక మంత్రికి నిర్మాతల సంఘం లేఖ..

by Shamantha N |
nirmala
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న సినిమా పరిశ్రమ పునరుద్ధరణ కోసం తగిన నిర్ణయం తీసుకోవాలని ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎంపీపీఏ) ఆర్థిక మంత్రిని కోరింది. ఈ మేరకు సినిమా, వినోద పరిశ్రమపై జీఎస్టీని రద్దు చేయడం లేదంటే వీలైనంత తగ్గించాలని కోరుతూ బుధవారం నిర్మలా సీతారామన్‌కు ఐఎంపీపీఏ లేఖ రాసింది. అధికంగా ఉన్న పన్నులు, 18 శాతం జీఎస్టీ వల్ల పరిశ్రమ ఎదుర్కొంటున్న భారాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. జీఎస్టీ చాలా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ప్రభుత్వ పెట్టుబడులు లేని పరిశ్రమ నుంచి ఎక్కువ భాగం ఆదాయం పన్నుల రూపం వెళ్తోంది. పారిశ్రామికవేత్తల నుంచి వచ్చే పెట్టుబడులతో కొనసాగుతున్న పరిశ్రమ కరోనా సంక్షోభం వల్ల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొత్త వారిని ప్రోత్సహించేందుకు జీఎస్టీ తగ్గించడం, ఇతర పన్నులను రద్దు చేయడం లాంటి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. పూర్తిగా టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో వ్యాపారాలు కొనసాగుతున్నాయని, కాబట్టి పరిశ్రమ మనుగడ సాగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ‘నిర్మాతలు ఇప్పటికీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సినిమా, వినోద పరిశ్రమపై జీఎస్టీని రద్దు, లేదా ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. లేదంటే దేశవ్యాప్తంగా ఒకే పద్దతిగా 5 శాతం కనిష్ట పన్ను నిర్ణయం తీసుకోవాలని’ ఐఎంపీపీఏ అధ్యక్షుడు టిపి అగర్వాల్ లేఖలో వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed