- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘డబుల్’ కష్టాలు
ఆర్భాటపు ప్రారంభాలే తప్ప కనీస వసతుల కల్పన ఊసేలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం వేసిన ‘డబుల్’ స్టంట్.. సాక్షాత్తు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కీసర మండలం చీర్యాలలో 40మంది లబ్ధిదారులకు 2020 అక్టోబర్7వ తేదీన డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేటాయించారు. కానీ, కనీస వసతులైన కరెంట్, తాగునీరు, రోడ్లును మరిచిపోయారు. నాలుగు నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. చీమ్మచీకట్లోనే లబ్ధిదారులు పడుతున్న అవస్థలపై ‘దిశ ’ప్రత్యేక కథనం..
దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని కీసర మండలం చీర్యాలలో 2016 నవంబర్ 28వ తేదీన 40 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాలుగేళ్ల తర్వాత 2020 అక్టోబర్ 7వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించారు. మంత్రి మల్లారెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఇళ్లు కేటాయించినట్లు ప్రకటించారు. అయితే, ఇళ్లను నిజమైన లబ్ధిదారులకు కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక లీడర్ల అనుయాయులకే కేటాయించారని చీర్యాల గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో ఇండ్లను పొందిన లబ్ధిదారులు నాటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇండ్లను కేటాయించినా ప్రభుత్వ పెద్దలు కనీస సౌకర్యాలు కల్పించలేదు.
కరెంట్, నీళ్లు లేక అవస్థలు..
సొంతింటి కల సాకారమైందనుకుని గంపెడాశతో కొత్త ఇంట్లో అగుడుపెట్టిన లబ్ధిదారులు నిత్యం నరకం చవిచూస్తున్నారు. తాగేందును గుక్కెడు మంచి నీళ్లు లేవు. నీటి కోసం పక్కనున్న పంట పొలాలకు పరుగులు తీయాల్సి వస్తోందంటన్నారు. తీరా అక్కడికి వెళ్లితే రైతులు రోజు నీళ్లు ఇవ్వాలా..? అంటూ చీదరించుకుంటున్నారని వాపోతున్నారు. పంట పొలాల నుంచి నీళ్లు తీసుకుని వస్తుంటే చాలాసార్లు పొలాల గట్లపై జారిపడిన సందర్భాలున్నాయి. తాగునీటి ట్యాంకర్‌ను పంపమంటే సర్పంచ్ పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించినా.. కరెంట్ పోల్స్‌ను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో రాత్రిపూట కరెంట్ లేక చీమ్మ చీకట్లలో జాగారం చేయాల్సి వస్తోందంటున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు వేసినా.. ఆ పైపులైన్ల నుంచి ఇళ్లకు మురుగు నీరు బయటకు వెళ్లేందుకు ఔట్ ప్లో ఏర్పాటు చేయలేదు. దీంతో మురుగు నీరు బయటకు వెళ్లక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లాది రూపాయాలతో ఇండ్లను కట్టించిన ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించకపోవడంతో లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొందరు పొద్దంతా ఉంటూ రాత్రి వేళ చీర్యాల గ్రామంలో నిద్రిస్తున్నారు. ఇళ్లు కేటాయించినా ఎక్కడ వారి ఇంటిని ప్రభుత్వం తీసుకుంటుందోనన్న భయంతో జీవనం సాగిస్తున్నారు.
నీటి సౌకర్యంలేక అవస్థలు..
డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినా నీటి సౌకర్యం కల్పించలేదు. తాగేందుకు మంచినీరు లేక, కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాము. పక్కనున్న పొలాల వద్ద బిందెలతో నీళ్లను తెచ్చుకుంటున్నాం. నాలుగు నెలలుగా ఇదే పరిస్థితి. సమస్యను పలుమార్లు స్థానిక లీడర్ల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదు.
–జయలక్ష్మి, స్థానిక మహిళ
చీకట్లోనే జీవనం..
నాలుగు నెలలుగా చీకట్లలోనే జీవనం సాగిస్తున్నాం. కోట్లాది రూపాయలు వెచ్చించి ఇండ్లను నిర్మించినా కరంట్ సౌకర్యం కల్పించలేదు. కనీసం పోల్స్ కూడా వేయలేదు. చిన్న పిల్లలతో చీకట్లోనే జీవించా ల్సి వస్తోంది. రాత్రిపూట దోమలు కుడుతున్నాయి.
–గూడ లక్ష్మి,స్థానిక మహిళ
అంతర్గత రోడ్లు లేక ఇబ్బందులు..
సిద్ధిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో సకల సౌకర్యాలు కల్పించారు. కా నీ, మాకు ఎలాంటి వసతులు లేవు. నీరు, కరెంట్ సమస్యలకు తోడు రోడ్లు కూడా నిర్మించలేదు. రాత్రి బయటకు వెళ్లాలంటే భయమేస్తుంది.
– శ్రావణి, స్థానికురాలు
కనీస సౌకర్యాలు కల్పించాలి..
40 ఇళ్లలో 500మందికి పైగా నివాసం ఉంటున్నాం. ఇంత మంది జనాభాకు నీళ్లు ఇచ్చేందుకు పంట పొలాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ లేక విద్యార్థులు చదువుకోవడంలేదు. కనీసం సెల్ ఫోన్లను చార్జింగ్ చేయాలన్నా కష్టంగా మారింది. ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డికి చెప్పినా ఫలితం లేదు.
–లావణ్య, స్థానిక మహిళ