‘విద్య’ను నమ్ముకుని.. కూలి పనుల్లో చేరుతున్న టీచర్లు..!

by Sridhar Babu |
‘విద్య’ను నమ్ముకుని.. కూలి పనుల్లో చేరుతున్న టీచర్లు..!
X

దిశ, గోదావరిఖని : విద్యార్థులకు చదువు నేర్పించి, వారిని ప్రయోజకులను చేయాలనుకునే టీచర్లు చాలా మందే ఉంటారు. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను సన్మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయుల మీదే ఎక్కువ ఉంటుంది. అయితే, కరోనా వలన పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. వీరికి పూట గడవడం కూడా కష్టంగా మారింది. గత సంవత్సర కాలంగా జీతాలు లేకపోయినా కుటుంబం కోసం ఆత్మభిమానాన్ని పక్కన పెట్టి ఇతర వృత్తుల వైపు మళ్లుతున్నారు. కొందరు దుకాణాల్లో పనులకు చేరుతుంటే మరికొందరు కూలి పనులు చేసుకుంటున్నారు. పెద్దజిల్లాలోని రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖనిలో గతంలో 150కి పైగా పాఠశాలలు ఉండేవి. అవి క్రమక్రమంగా తగ్గుతూ.. కరోనాకు ముందు 100 పాఠశాలలకు చేరుకున్నాయి. 50 పాఠశాలలు వివిధ కారణాల వలన మూతపడ్డాయి. మాయదారి కరోనా విజృభించడంతో ప్రైవేట్ టీచర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కరోనా వ్యాప్తితో పాఠశాలలను నడపలేక మేనేజ్‌మెంట్స్ చేతులెత్తేయడంతో ఎంతో మంది ప్రైవేటు ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. కరోనా మొదటి, సెకండ్ వేవ్‌తో చాలా మంది ఉద్యోగాలు పోయాయి. కొందరు ఉన్న ఊరు, సొంతవాళ్ళకు దూరంగా పనుల కోసం వెళ్ళి బతుకుంటే మరికొందరు పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయారు.

మరికొంత మంది రోజు వారి మార్కెట్లో రోడ్డుపై బట్టలను అమ్ముకుంటున్నారు. గతంలో 150 పాఠశాలలు ఉన్న గోదావరిఖని, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ప్రభావం తర్వాత ప్రస్తుతం వాటి సంఖ్య 20లోపు చేరుకుందంటే అతిశయోక్తి కాదు.1300 సిబ్బందికి గాను ప్రస్తుతం 200 మంది మాత్రమే పాఠశాలల్లో పని చేస్తున్నారు. దాదాపు వెయ్యికి పైగా ఉపాధి కోల్పోయి ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు. ఇదిలాఉంటే మరికొంత మంది సిబ్బంది సైతం ఉన్న పాఠశాలలను మూసివేసే పరిస్థితితులు కనిపిస్తున్నాయి. కనీసం వెయ్యికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు 4 నుండి 8 ఉంటే, 500లకు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు 6 కు పైగా ఉన్నాయి. మిగతా పాఠశాలలో విద్యార్థులు 200లకు పైగా ఉంటటంతో పాఠశాలలను నడిపించలేకపోతున్నామని పలువురు పాఠశాల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

పాఠశాలల ప్రారంభంపై అనుమానాలెన్నో?

గతంలో 150 పాఠశాలలు ఉన్న గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో కేవలం 20 పాఠశాలలు మాత్రమే ఉండటంతో కొంత ఆందోళన నెలకొంటుంది. మరో వైపు పాఠశాలలు ప్రారంభం అయ్యాక ప్రత్యక్ష తరగతులకు ఎంత మంది విద్యార్థులు వస్తారో తెలియదు. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని అయోమయ స్థితిలో పాఠశాల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలా ఉంటే పాఠశాల ప్రారంభించాక ఎవరెవరినీ మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి. ఎంత మందిని తీసుకోవాలి అనే దానిపై పాఠశాల యాజమాన్యాలు సైతం సతమమవుతున్నాయి.

మూతపడే దిశగా మరికొన్ని పాఠశాలలు… ?

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న పాఠశాలలు మరికొన్ని మూతపడే దిశగా ఉన్నట్లు తెలుస్తుంది. 200లకు పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలో విద్యార్థులు ఎంత మంది వస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. వీరికి తోడు సిబ్బందికి ఖర్చు చేసి పాఠశాలలు నడిపించినా.. నడుస్తాయో లేదో అని ఆందోళన నెలకొంది. తల్లి తండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తారో తెలియదు. వచ్చినా ఫీజుల విషయంలో ప్రభుత్వం రూల్స్ వీరికి తలకు మించినా భారంగా మారింది. ఈ సమయంలో పాఠశాలల మీద పెద్ద మొత్తంలో ఖర్చు చేసి నడిపించే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఉన్న పాఠశాలలు నడువడమే అగమ్యగోచరంగా మారింది.

కరోనా సమయంలో పాఠశాలలు సరిగా నడవకపోవడం, లాక్డౌన్‌‌తో ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ప్రైవేట్ పాఠశాలలను నడిపించడం భారంగా మారింది. అందుకే పాఠశాలలు మూతబడుతున్నాయి. స్కూళ్లు నడిచిన సమయంలోనూ సరిగ్గా ఫీజులు వసూలు కాకపోవడం, తదితర అనేక సమస్యల వలన నడిచే పాఠశాలలు కూడా ఇప్పుడు మూసివేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కరోనా నిబంధనలకు అనుగుణంగా పాఠశాలను నడిపిస్తామని మేనేజ్‌మెంట్స్ చెబుతునా.. తల్లిదండ్రులు ధైర్యంగా తమ పిల్లలను పంపిస్తారో లేదో వేచిచూడాలి.

– ట్రస్మా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ జనరల్ సెక్రటరీ అరుకాల రామచంద్రా రెడ్డి

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి దిశలో కొనసాగిన పాఠశాలలు అనతి కాలంలోనే కాలగర్భంలో కలిసిపోయాయి. కార్మిక క్షేత్రమైన రామగుండంలో అగ్రికల్చర్ మార్కెట్, బిజినెస్ లేక వచ్చిపోయే జనం లేకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో విద్యారంగంలో ఘననీయమైన మార్పులు చోటుచేసుకోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో పాటు పాఠశాలలు కూడా క్రమక్రమంగా తగ్గి నేడు వందల సంఖ్యలో వున్న పాఠశాలలు నేడు పదుల సంఖ్యకు చేరాయి.దీంతో ఈ ప్రాంతంలో ఎంతోమంది టీచర్లు ఉపాధిని కోల్పోయారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలు కొనసాగాలంటే ప్రభుత్వం స్పందించి వడ్డీలేని రుణ సదుపాయాలను కల్పించి పాఠశాలలను ఆదుకోవాలని పలువురు యాజమాన్యాలు కోరుతున్నాయి.

-ట్రాస్మా పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి

ఒకప్పుడు ఎంతోమంది విద్యార్థులకు విద్యా బోధన అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించిన రామగుండం పారిశ్రామిక ప్రాంతం నేడు విద్యాసంస్థల మూసివేత దిశగా పయనిస్తుంది. గతంలో రెండు వందల పాఠశాలకు పైగా ఉంటే నేడు ఇరవై పాఠశాలలు మాత్రమే మిగలడం దారుణం. రామగుండంలో విద్య మరింత భారంగా మారుతుందనే చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నడవాలంటే విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా అవసరం చాలా అవసరం.

-ట్రస్మా రామగుండం అధ్యక్షులు బంధారవు యాదగిరి గౌడ్

చిన్న పాఠశాల మనుగడను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికి ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించి విద్యార్థులను సకాలంలో పాఠశాలలకు పంపించాలి. రాను రాను విద్యార్థుల సంఖ్య తగ్గుతుండటంతో పాఠశాలలు మూత పడుతున్నాయి. ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో విద్యాసంస్థలపై, ఉపాధ్యాయులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

-ట్రాస్మా పెద్దపల్లి గౌరవ అధ్యక్షుడు పరుపాటి అంజా రెడ్డి

కరోనాతో పాఠశాలలు, కళాశాలలు మూతపడటంతో ఉపాధి కోల్పోయి చిన్న చిన్న వ్యాపారాలను నిర్వహించుకుంటున్నాను. నాపేరు చక్రపాణి. మాది కరీంనగర్‌. 2001లో గోదావరిఖనికి వచ్చాను. అప్పటినుండి మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చేరి విధులు నిర్వహించాను. కరోనాతో కళాశాలలు నడవక మూసివేయడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో గోదావరిఖనిలోని మార్కెట్లో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాను. దాదాపు 20ఏళ్లు కళాశాలలో బోధించాను.

వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న : చక్రపాణి

Advertisement

Next Story

Most Viewed