- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రత్యేక తెలంగాణలోనూ మారని బతుకులు..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఒరిగిందేమీ లేదని, బతుకు భారంగా మారిందని ఆవేదన చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి అసెంబ్లీ సమీపంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర సాధన సమయంలో వినిపించిన ‘జై తెలంగాణ’ నినాదం మళ్లీ ఇప్పుడు ఆ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం సందర్భంగా వినిపించింది.
దిశ, క్రైమ్‌బ్యూరో: నాగులు (55) రంగారెడ్డి జిల్లా కడ్తాల్ గ్రామ నివాసి. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, బతకడానికి మార్గం దొరకక కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక దిగులు చెందుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న నాగులు రవీంద్రభారతి సమీపంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే మంటలను ఆర్పి ఆటోలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఉవ్వెత్తున ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్న సమయంలో విద్యార్థి శ్రీకాంతాచారి ఒంటికి నిప్పంటించుకున్న సంఘటన ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు గుర్తే ఉంది.
ఇప్పుడు చేయడానికి పనిలేక, కరోనా కాలంలో ఉన్న ఉపాధి కోల్పోయి బతకడానికి మార్గం లేక, కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్యే శరణ్యమని భావించారు నాగులు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో పోలీసులకు కూడా కొద్దిసేపటి వరకూ అర్థం కాలేదు. నాగులు మాత్రం ఒంటిమీద గాయాలు ఉన్నా రెండు చేతులెత్తి దండం పెడుతూ ‘కేసీఆర్ సారూ… జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేస్తూ తనను తాను పరిచయం చేసుకుని ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరించారు. రకరకాల పనులు చేసుకుంటూ ప్రస్తుతం ఖైరతాబాద్‌లోని ఒక అపార్టుమెంటులో వాచ్‌మన్ ఉద్యోగం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
63శాతం గాయాలతో ఉస్మానియా ఆస్పత్రికి..
మధ్యాహ్నం 11.30-12.00 గంటల మధ్యలో అసెంబ్లీ సమీపంలోని రవీంద్రభారతి కూడలి దగ్గర నాగులు ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, సాయంత్రానికి రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి తరఫున పీఆర్ఓ స్వయంగా ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా వైద్యులకు వివరించారు. మంత్రి తరపున నాగులుకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు పీఆర్ఓ ప్రకటించారు. పోలీసులు ఆసుపత్రికి తరలించిన తర్వాత ప్రాథమిక వైద్యాన్ని అందించిన వైద్యులు సుమారు 63% మేర గాయాలయ్యాయని, వెంటనే మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నడుము దగ్గరి నుంచి తల వరకు గాయాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. వెంటనే సీరియస్ వైద్యాన్ని అందించాల్సి ఉంటుందని, లేదంటే ఇన్‌ఫెక్షన్ తీవ్రంగానే ఉంటుందని ప్లాస్టిక్ సర్జన్ అభిప్రాయపడ్డారు. నడుము నుంచి మెడ భాగం వరకు చాలాచోట్ల ఉపరితల చర్మం కాలిపోయిందని, అంతర్గత అవయవాలు ఎలా ఉన్నాయో నిరంతరం పరిశీలిస్తూనే అవసరాన్ని బట్టి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
లాక్‌డౌన్‌తో జీవితాలు తారుమారు..
కరోనా పరిస్థితుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయాలతో చాలామంది పేద, దిగువ మధ్య తరగతి సెక్షన్ల ప్రజల బతుకులు ప్రశ్నార్థకంగా మారాయి. చిరుద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ఉపాధి కరువైంది. కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. అప్పులు పుట్టక అర్థాకలితోనే కాలం వెళ్ళదీస్తున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా చాలా కంపెనీలు ఉద్యోగస్తులను పనిలోంచి తీసేస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు పుట్టడంలేదు. ప్రభుత్వాలు ఆదుకోవడం లేదు. రేషను బియ్యం మినహా ప్రభుత్వాల నుంచి సాయం అందడంలేదు. కుటుంబ పోషణకు, ఇంటి అద్దెలకు, రోజువారీ ఖర్చులకు డబ్బుల్లేక సతమతమవుతున్నారు. పట్టణాల్లో బతకలేక పల్లెబాట పట్టిన చిరుద్యోగులు, విద్యాధికులు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పొట్ట నింపుకుంటున్నారు. కానీ జానెడు భూమి కూడా లేని వేలాది కుటుంబాలు సొంతూళ్ళకు వెళ్ళలేక, పట్టణాల్లో బతకలేక దినదిన గండంగా బతుకులీడుస్తున్నారు.
ప్రభుత్వాలు ఆదుకుంటాయన్న నమ్మకాన్ని కోల్పోయారు. ప్రభుత్వానికి మొరపెట్టుకోడానికి కూడా మార్గం లేకుండాపోయింది. ట్విట్టర్ ద్వారా మంత్రులకు చెప్పుకునేవారు కొందరైతే సర్కారు దృష్టికి తీసుకెళ్ళడానికి దారులు లేక ఆత్మహత్యే శరణ్యమని భావించేవారు మరికొందరు. ఇప్పుడు నాగులు పరిస్థితి రెండో కోవకి చెందినదే. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా ఉపాధి కల్పించే మార్గాలు లేకపోవడంతో బతుకు భారంగా మారింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్రం కోసం కొట్లాడిన తనకు ఇప్పుడు సొంత రాష్ట్రం ఏర్పడినా ఒరిగిందేమీ లేదని, బతకడానికి మార్గమే లేకుండా పోయిందని కాలిన గాయాలతోనే తన బాధను వెలిబుచ్చారు. ఇక ఆదుకోవాల్సింది కేసీఆర్ మాత్రమేనంటూ ఆయనకు రెండు చేతులూ జోడించి జై తెలంగాణ నినాదంతో మొరపెట్టుకున్నారు.