అక్కడ కాసుల వర్షం.. కారణం కరోనా

by Shyam |   ( Updated:2020-08-10 21:33:41.0  )
అక్కడ కాసుల వర్షం.. కారణం కరోనా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అవకాశం ఉన్నప్పుడే అంది పుచ్చుకోవాలి.. అవసరాన్ని క్యాష్​ చేసుకోవాలి.. ఎవరికేమైతే మనకేంటే మనం సాధ్యమైనంత గుంజుకున్నామా.. లేదా.. అనేదే ముఖ్యమన్నట్లు తయారైంది జిల్లాలో ప్రైవేట్​ ఆస్పత్రుల తీరు.. మానవాళిని భయపెడుతున్న కరోనాను సాకుగా చూపించి ఆస్పత్రి యాజమాన్యాలు అందినకాడికి దోచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నాయి. రోగి ఏ లక్షణంతో దవాఖానకు వచ్చినా తమకు అనుకూలంగా మలుచుకుని లక్షల్లో పిండుకుంటున్నాయి.. ప్యాకేజీల పేర వరాలు ప్రకటిస్తూ బాధిత కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి తీరని శోకాన్నిమిగుల్చుతున్నాయి నిజామాబాద్​ జిల్లాలోని కొన్ని హాస్పిటళ్ల యాజమాన్యాలు. కరోనా పరీక్షలు చేయాలంటే ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అనుమతి పొందాల్సి ఉన్నప్పటికీ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి.

‘మీకు జ్వరం వస్తుందా.. కొద్దిగా దగ్గు, జలుబు ఉందా.. అయితే మీలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. మీరు వెంటనే హాస్పిటల్​లో అడ్మిట్ కావాల్సిందే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్నా మంచి వైద్యం అందిస్తాం. హైద్రాబాద్ లోని కార్పొరేట్ దవాఖానాలకు తీసిపోని వైద్యం అందిస్తాం. మాదగ్గర మంచి స్పెషలిస్టు డాక్టర్లు, అత్యాధునిక వైద్య పరికరాలు ఉన్నాయి.’ అని మాయ మాటలు చెప్పి కరోనా అనుమానితులను అడ్మిట్​ చేసుకుంటూ అందినకాడికి దోచుకుంటున్నారు కొందరు ప్రైవేటుహాస్పిటల్స్​డాక్లర్లు. కొవిడ్​–19 వైద్యం చేసేందుకు ఎలాంటి అనుమతులు లేకుండా కొవిడ్ వైద్య సేవల పేర నిబంధనలుఉల్లంఘిస్తూ కొత్త దందాకు తెరలేపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ డాక్టర్స్ స్ర్టీట్ గా పేరొదిన ఖలీల్ వాడీ, ద్వారకానగర్, సరస్వతీ నగర్, హైద్రాబాద్ రోడ్ లోని ప్రైవేట్ దవాఖానలన్నీ కరోనా ఆనుమానిత రోగులతో కిటకిటలాడుతున్నాయి.

వైద్య సేవల అనుమతితో దోపిడీకి తెర

కొవిడ్-19 తో సహజీవనం తప్పదని భావించిన ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసింది. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులకుకరోనాకు వైద్యం చేయడానికి అనుమతుల బార్లా తెరిచింది. ముందుగా వైరాలజీ పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో అనుమతులు ఇవ్వలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తున్న సమయంలోనే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు అనుమతులు లేకుండానే టెస్టులు షురూ చేశాయి. తరువాత కేసుల సంఖ్య పెరగడంతో జిల్లా కేంద్రంలో నాలుగు పెద్ద దవాఖానల్లో కొవిడ్​వైద్య సేవలకు జిల్లా అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చింది. అక్కడ కుడా సరైన వెటిలేటర్లు, సెంట్రల్ ఆక్సిజన్ సిస్టం, ఐసొలేషన్ సేవలు పరిమితంగా ఉన్నప్పటికీ అనుమతి ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చూపిన ఫైర్​ సేఫ్టీ మెజర్స్​లేకుండా ఉన్న ఆసుపత్రులు జిల్లా కేంద్రంలో ఎన్నో ఉన్నాయి. ఇదే అదనుగా ట్రీట్​మెంట్​కు పర్మిషన్​ వచ్చిన హాస్పిటల్స్​ కొవిడ్ బాధితులు, అనుమానితుల వద్ద నుంచి పెద్ద ఎత్తున దోచుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పాజిటివ్​ వస్తే లక్షల రూపాయలు తీసకుని వైద్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే నెగిటివ్ వచ్చే వరకూ మరో రూ.50 వేల వరకు లాగేస్తున్నారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు.

ప్రైవేటు వైద్యులకు వరం..

కరోనా నేపథ్యంలో కొందరు ఫీవర్ స్పెషలిస్టులుగా చెప్పుకునే డాక్టర్లకు వరంగా మారింది. రోగం ఏదైనా పేద, ఆమాయక ప్రజలకు వైరస్ బూచి చూపించి వైద్యం చేస్తున్నారు. హాస్పిటల్​లో అడ్మిట్​ చేసుకుని కొవిడ్​–19 పరీక్ష చేసి రిపోర్టు వచ్చే వరకే అనుమానంతో రూ.30 వేల నుంచి రూ. 50 వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక పాజిటివ్ వస్తే రూ. లక్షలు డిపాజిట్​ చేసుకుని వైద్యం చేస్తున్నారు. సర్కారు దవాఖానాల్లో పనిచేస్తున్న కొంత మంది వైద్యులు సొంతంగా ప్రైవేట్ దవాఖానాలు, నర్సింగ్ హోంలను నిర్వహిస్తున్న సర్కారు దవాఖాలకు వచ్చిన వారిని తమ హాస్పిటల్​కు డైవర్ట్​ చేస్తూ దందా షురూ చేశారు. ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, ఆర్ఎంపీల సాయంతో అనుమానుతులను చేర్చుకుంటున్న డాక్టర్లు హాస్పిటళ్లు బంద్​ ఉన్న రెండు కాలంలో వచ్చే ఆదాయాన్ని రాబట్టే పనిలో పడ్డారనే విమర్శలు ఉన్నాయి. కరోనాకు వాడే మందుల ధరలను పెంచి అమ్ముతున్నారని మెడికల్ స్టోర్స్​పై జిల్లాకు చెందిన మంత్రి ఆదేశాలతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులతో తనిఖీలు చేయించిన అధికార యంత్రాంగం, అనుమతులు లేకుండా కొవిడ్–19 కు వైద్యం చేస్తున్న దవాఖానాల చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story