ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రవాణాకు ప్రాధాన్యమివ్వాలి

by Shyam |
Oxygen Express trains
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పర్యవేక్షించాలని అన్ని డివిజన్ల అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య ఆదేశించారు. ఆదివారం సనత్‌నగర్‌ న్యూ గూడ్స్‌ కాంప్లెక్స్‌ నుంచి మూడవ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిస్సా‌కు బయల్దేరిందని ఆయన తెలిపారు. ఐదు ఖాళీ ట్యాంకర్లు గల ఈ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిస్సాలోని ఎమ్‌బీఎమ్‌బీ సైడిరగ్‌ (మెసర్స్‌ టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌ లిమిటెడ్‌)కు బయల్దేరిందని ద్రవ రూపంలోని వైద్య ఆక్సిజన్‌ నింపిన తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వస్తుందని తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ అవసరాలను తీర్చే లక్ష్యంతో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను భారతీయ రైల్వే ప్రారంభించిందని వెల్లడించారు. ద్రవ రూపంలో ఆక్సిజన్‌తో నింపబడిన ట్యాంకర్లు ఆర్వోఆర్వో (రోల్‌ ఆన్‌రోల్‌ ఆఫ్‌) సర్వీసు ద్వారా రవాణా చేయబడుతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు దక్షిణ మధ్య రైల్వే గతంలో అంగూల్‌కు రెండు ఖాళీ ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపి హైదరాబాద్‌కు ఆక్సిజన్‌ను చేరవేసిందని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో మరిన్ని ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల రవాణాకు సంబంధించి ఏమైనా అభ్యర్థనలు వస్తే తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

Next Story