ఆ గౌరవమే మహిళలందరికీ ఇవ్వాలి -మోడీ

by Anukaran |
ఆ గౌరవమే మహిళలందరికీ ఇవ్వాలి -మోడీ
X

దిశ, వెబ్ డెస్క్ : దుర్గా మాతకు ఇచ్చే గౌరవమే ప్రతి మహిళకూ ఇవ్వాలని ప్రధాని మోడీ అన్నారు. దుర్గా పూజ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ, బెంగాలీలో ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో పాల్గొనేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు.

అనేక ఆంక్షల మధ్యలో నిర్వహిస్తున్న ఈ సంబరాల్లో సంతోషపాళ్లు ఏమాత్రం తగ్గలేదని, తాను భౌతికంగా ఢిల్లీలో ఉన్నప్పటికీ వేడుకల్లో నేరుగా పాల్గొన్నట్టే తోస్తున్నదని అన్నారు. తమ ప్రభుత్వం తలపెట్టిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బెంగాల్ నుంచే బలోపేతం చేస్తామని వివరించారు. బెంగాల సంస్కృతి, ప్రతిష్టను మరింత ఉన్నతస్థానాలకు తీసుకెళ్లాలని అన్నారు. పలు సంక్షేమ పథకాల ద్వారా బెంగాలీల అభివృద్ధికి తాము పాటుపడుతున్నట్టు తెలిపారు.

మహిళా సాధికారత కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. 22 కోట్ల మంది మహిళలకు జన్‌ధన్ ఖాతాలు, ముద్రయోజన కింద రుణాలు అందించడం, బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం, ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ ఏర్పాటు, ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచడం సహా అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు.

Advertisement

Next Story