- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్యానికి సెలవు!
దిశ, నల్లగొండ: వైద్యో నారాయణో హరి.. అన్నారు పెద్దలు. అన్ని రకాల రోగాలను నయం చేసే వైద్యుడు నారాయణుడి లాంటి వాడని ప్రతీతి. ఇలా దేవుడితో సమానంగా జనాల జేజేలు అందుకుంటున్న డాక్టర్లకు కరోనా ప్రాణ భయంతో వైద్యానికి సెలవు పెడుతున్నారు. ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ సంక్రమణ జరగకుండ ఉండేందుకు సర్కార్ ఓపి సేవలు బంద్ చేయాలని అదేశాలు ఇవ్వడంతో కొంతమంది అత్యవసర సేవలు సైతం బంద్ చేసి తాళాలు వేయడంతో రోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రాణం పోసే డాక్టర్‌కు ప్రాణ భయం పట్టుకోవడంతో గర్భిణులకు వైద్యం చేయించుకునేందుకు కష్ట కాలం వచ్చింది.
బీపీ, షుగర్, డయాలసిస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు అత్యవసర వైద్య సేవలు అందక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో ఓపి బంద్ కావడంతో అక్కడ వైద్య సేవలు అందడం లేదని రోగులు గగ్గోలు పెడుతున్నారు. డెలివరీ, యాక్సిడెంట్, కరోనా కేసులు మినహా మిగతా అత్యవసర వైద్య సేవలు అందించడానికి సైతం డాక్టర్లు, సిబ్బంది కొరత వెంటాడుతున్నది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులను సైతం ఇంటికి తిప్పి పంపుతున్నారు.
వందల సంఖ్యలో ఆసుపత్రులున్నా..
కరోనా నేపథ్యంలో రోగులకు తిప్పలు తప్పటం లేదు. ప్రత్యేకించి అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, చిన్నపిల్లల ఆసుపత్రులు, జనరల్ మెడిసిన్, సర్జికల్, గైనిక్, అత్యవసర ఆసుపత్రులతోపాటు కిడ్నీ, న్యూమరాలజీ, కార్డియాలజీ, చర్మ, కాలేయ, దంత, ఇఎన్‌టి ఆసుపత్రులు మొత్తంగా ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ-320, యాదాద్రి-130, సూర్యపేట-155 పైగానే ఉంటాయి. వీటిల్లో ఒక్కో ఆసుపత్రుల్లో ప్రతి నిత్యం 100 నుంచి 200 వరకు అవుట్ పేషంట్(ఓపీ) రోగులను చూస్తుంటారు. ప్రత్యేకించి చిన్న పిల్లల ఆసుపత్రులు, గైనకాలజీ ఆసుపత్రుల్లో ఉదయం, సాయంత్రం తాకిడి ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక్కరోజున సుమారు 10 వేల మంది వైద్య సేవల కోసం ఎదురు చూస్తుంటారు. వీటికి అనుబంధంగానే ల్యాబ్‌లు, మెడికల్, డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రతి జిల్లా కేంద్రంలో సుమారు 100 వరకు ఉన్నాయి. ఇప్పడు వీరందరికీ ప్రాణ భయం పట్టకుంది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిండు. ఆ తరువాత ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యే వరకు ఎంతమందిని ఆయన కలిశాడు అన్నది అధికారులు లెక్కలు తీసిండ్రు. అందులో సూర్యపేట పట్టణం భగత్‌నగర్‌కు చెందిన వ్యక్తికి కరచాలనం ఇవ్వడంతోపాటు మందులు కొనుగోలు చేయడానికి వెళ్లినప్పడు సన్నిహితంగా మెదిలినట్టు అధికారులు గుర్తించి మెడికల్ దుకాణంలో పని చేసే వ్యక్తిని ఐసొలేషన్‌కు పంపించి రక్త పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఇక అప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల నిర్వాహకులకు, వైద్య సిబ్బంది, మెడికల్, డయాగ్నోస్టిక్ సెంటర్లలో పనిచేసే వారికి ఇక ప్రాణ భయం పట్టుకుంది. బతికుంటే బలుసాకు తినైనా బతుకొచ్చని సీఎం కేసీఆర్ చెప్పిన సామెత గుర్తొచ్చి కొంత మంది డాక్టర్లు అత్యవసర సేవలను సైతం నిలిపివేసి అర్ధాంతరంగా ఆసుపత్రులకు తాళాలు వేయడంతో నెలవారీ చెకప్‌లు చేసుకునే అత్యవసర రోగులు ఇబ్బంది పడుతున్నారు.
నల్లగొండలో పరిస్థితి అధ్వానం…
నల్లగొండ జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిలో తొలుత నల్లగొండ పట్టణానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. వారి కుటుంబ సభ్యులు 39 మంది రక్త నమూనాలను సేకరించి పంపించగా అందులో నలుగురికి నిర్ధారణ అయ్యింది. సెకండరీ ప్రైమరీ కాంటాక్ట్ అనుమానితులు 89 మందికి సంబంధించి రక్త నమూనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
డాక్టర్లకు భయం పట్టుకుంది..
నల్లగొండ పట్టణంలో కరోనా ప్రమాద ఘంటికలు మోగడంతో అధికారులు పట్టణంలో హై అలర్ట్ ప్రకటించి ఐదు ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా అలజడి రేగడంతో అందరికీ ప్రాణ భయం పట్టుకుంది. ఇందులో ముఖ్యంగా పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యుల్లో కొందరు వైరస్ సోకకముందు స్థానిక ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం పొందారు. ఆ డాక్టర్‌కు కూడా అనుమానిత లక్షణాలు ఉండటంతో ఐసొలేషన్‌కు తరలించారు. ఇక అప్పటి నుంచి డాక్టర్లకు భయం పట్టుకుంది.
నల్లగొండ పట్టణంలో సుమారు 20 చిన్న పిల్లల ఆసుపత్రులు 22 జనరల్ మెడిసెన్, 25 స్త్రీ సంబంధిత ఆసుపత్రులు, 4 కిడ్నీ ఆసుపత్రులు, 5 చర్మ, 8 ఇఎన్‌టీ, 10 సైక్రియాటిక్, 10 న్యూమరాలజీ, 10 గుండె సంబంధిత ఆసుపత్రులు ఉన్నాయి. అదే విధంగా 25 ల్యాబ్ లు, 18 డయాగ్నోస్టిక్ కేంద్రాలు, 400 కుపైగా మెడికల్ షాపులు ఉన్నాయి. వారం రోజుల నుంచి ఇందులో సగానికి పైగా ఆసుపత్రులకు తాళాలు పడ్డాయి. కార్పోరేటు స్థాయిలో ఉన్న ఆసుపత్రుల్లో కేవలం అత్యవసర శస్ర్త చికిత్సలు మాత్రమే చేస్తున్నారు.
ఇటీవల వెలుగు చూసిన ఘటనలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శిశు సంక్షేమ శాఖ అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో 9 వేలు, యాదాద్రిలో 5 వేలు, సూర్యపేటలో 8 వేల మంది వరకు గర్భిణులు ఉన్నారు. వీరందరికి ప్రతి వారం అంగన్‌వాడీ కేంద్రంలో ఇమ్యూనైజేషన్ చేస్తారు. నెలకు ఒకసారి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆశా కార్యకర్త తీసుకెళ్లి డాక్టర్‌తో వైద్య పరీక్షలు చేసి తగు సూచనలు, పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెబుతారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆశా కార్యకర్తలు సుమారు 2వేల మందికి పైగా కరోనా ప్రాంతాల్లో ర్యాపిడ్ సర్వేలైన్స్ టీంలో ఉండి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు.
నల్లగొండ పట్టణంలో ఓ గర్భిణీకి 9నెలలు నిండాయి. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రిలో నెల వారీగా వైద్య పరీక్షలు చేయించుకుంటుంది. అయితే ఒక్కసారిగా కడుపులో ఉన్న బిడ్డ తిరగకపోవడంతో ఆ ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అత్యవసర కేసులు మాత్రమే చూడబడును అని బోర్డు పెట్టి తాళం వేసుకొని వెళ్లారు. పట్టణంలో ఉన్న దాదాపు 10 ప్రయివేటు ఆసుపత్రుల పరిస్థితి ఇలాగే ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఓపీ చూడటం లేదని పంపించారు. తిరిగి నాటు వైద్యంతో సరిపెట్టుకుంది.
ఆ కుటుంబం పరిస్థితి ఏంటీ?
అలాగే, నల్లగొండ పట్టణానికి చెందిన ఓ రాజకీయనాయకుడికి తెల్లవారు జామున గుండెల్లో నొప్పి వచ్చింది. వెంటనే రెగ్యులర్‌గా వెళ్లే ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనకు ఇదే పరిస్తితి ఎదురైంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా ఈసీజీ తీసే వారు లేరు. దీంతో హుటాహుటిన హైదరాబాద్‌కు ప్రయివేటు వాహనంలో తరలించారు. ఇక దారి పొడవునా ఉన్న చెక్ పోస్టుల వద్ద పోలీసుల తనిఖీలతో వారు హైదరాబాద్‌కు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది. ఈలోపు ఆయన ప్రాణానికి ఏమైనా అయ్యి ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటీ? ప్రాణాలు పోసేటువంటి వైద్యులు అత్యవసర సేవలకు సైతం స్వస్తి పలుకడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.