108  అంబులెన్సులోనే ప్రసవించిన గర్భిణి 

by srinivas |
108  అంబులెన్సులోనే ప్రసవించిన గర్భిణి 
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా కోడూరు మండలానికి చెందిన గర్భవతికి నొప్పులు రావడంతో 108 వాహనంలో అవనిగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్లి క్రమంలో భావదేవరపల్లి సమీపంలో ఆమెకు సుఖప్రసవం జరిగింది. ఈ సంఘటన కోడూరు – నాగాయలంక మధ్య భావదేవరపల్లి సమీపాన ప్రధాన రహదారిలో కోడూరు 108 వాహనంలో జరిగింది. వివరాల్లోకి వెళితే… కోడూరు పీహెచ్ సి వద్ద ఉన్న 108 వాహనానికి ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో లింగా రెడ్డి పాలెం శివారు పెద్ద గుడుమోటు గ్రామం నుండి ఫోన్ కాల్ వచ్చింది. గర్భవతిని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కోరారు.

దీంతో కోడూరు 108 వాహన పైలెట్ గుంటూరు రాకేష్, ఈఎంటి యు.రవి కిరణ్ వెనువెంటనే వాహనంతో పెద్ద గుడుమోటుకు చేరుకున్నారు. ఆ గ్రామానికి చెందిన గర్భవతి అయిన దాసి.చందు భార్యను వాహనంలో ఎక్కించారు. ఆమెతో పాటు భర్త చందు, ఆమె తల్లిదండ్రులను కూడా ఎక్కించుకున్నారు. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి వెళ్ళే క్రమంలో దారి మధ్యలోనే భావదేవరపల్లి సమీపాన వాహనంలో గర్భవతికి నొప్పులు ఎక్కువ అవడంతో ఆమె తల్లి సాయంతో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అయిన రవి కిరణ్ ఆమెకి సుఖ ప్రసవాన్ని చేయగా బాబు పుట్టాడు.

దీంతో వారు 108 ఆపరేషనల్ ఎగ్జిక్యూటివ్ అస్మతుల్లాకు సమాచారాన్ని అందించారు. ఆయన ఆదేశాలతో దగ్గర్లో ఉన్న నాగాయలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తల్లి బిడ్డను సురక్షితంగా తరలించారు. అక్కడ స్టాఫ్ నర్స్ వారికి వైద్య సేవలను అందించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో సమయానికి స్పందించి వచ్చిన 108 సిబ్బందిని బాలింత కుటుంబీకులు, ఆసుపత్రి వారు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed