కేటీఆర్, డీజీపీలకు కృతజ్ఞతలు : ప్రకాశ్ రాజ్

by Shyam |
కేటీఆర్, డీజీపీలకు కృతజ్ఞతలు : ప్రకాశ్ రాజ్
X

దిశ, వెబ్ డెస్క్: లాక్‌డౌన్ వ‌ల‌న దేశం పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో వలస కార్మికుల పరిస్థితి దారుణంగా మారింది. వీరిని ఆదుకునేందుకు ప్ర‌భుత్వంతో పాటు ప‌లు స్వ‌చ్ఛంద సంస్ధ‌లు ముందుకు వచ్చాయి. పలువురు ప్రముఖులు కూడా వలస కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లను అందించారు. ఇందులో భాగంగానే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ అనేక మంది వలస కూలీలకు అండ‌గా నిలిచింది. ప్రకాష్ రాజ్ తన ఫామ్ హౌస్‌లో ఎంతోమంది వలస కూలీలకు ఆశ్రయం అందించాడు.

కొద్ది రోజులుగా ప్ర‌భుత్వం వ‌ల‌స కూలీలని వారి వారి స్వ‌స్థాల‌కు త‌రలించేందుకు ఏర్పాటు చేస్తోంది. వారికోసం ప్రత్యేక రైళ్లను సిద్ధం చేసి ఇప్పటికే వేలాది మందిని తరలించింది. ఈ నేప‌థ్యంలోనే ఇన్నాళ్ళు ప్రకాష్ రాజ్ ఫాం హౌజ్‌లో ఉన్న వ‌ల‌స కూలీలు కూడా వారి స్వస్థలాలకు బయలు దేరారు. ఈ క్రమంలో ‘వలస కార్మికులను తరలించే ఏర్పాటు చేసినందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు. 44 రోజుల పాటు కొంతమందికి నా వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఆశ్రయం ఇచ్చాను. ఇప్పుడు వారి వారి ఇళ్ల‌కి వెళుతుండ‌డంతో బాధగా ఉంది. వీరి జీవిత క‌థ‌ల నుంచి ఎంతో నేర్చుకున్నాను. క‌ష్ట‌కాలంలో వారికి అండ‌గా నిలిచినందుకు ఓ తోటి మనిషిగా నేను ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాను. వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం నాకు ఆనందాన్నిచ్చింది అంటూ ప్ర‌కాశ్ రాజ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రకాష్‌ రాజ్ తన ఫామ్‌హౌస్‌లోని కూలీలందరిని ప్రత్యేక బస్సుల ద్వారా రైల్వేస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను కూడా ట్వీట్‌లో జతపరిచారు.

tags: prakash raj, farm house, migrant labourers

Advertisement

Next Story

Most Viewed