పోలింగ్ ముగిసింది… లెక్కలు మొదలు !

by Shyam |
పోలింగ్ ముగిసింది… లెక్కలు మొదలు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇప్పుడు నాలుగు ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. కూడికలు, తీసివేతల్లో మునిగిపోయాయి. ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయని గంటల తరబడి చర్చించుకుంటున్నారు. చివరి నిమిషాల్లో పెరిగిన పోలింగ్ శాతం అనుకూలమా, వ్యతిరేకమా అని ఆరా తీస్తున్నాయి. పోలింగ్ ట్రెండ్‌ను చూసిన తర్వాత ఈ పార్టీలు స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీలు స్వంతంగా పోస్ట్-పోల్ సర్వే చేయించుకుంటున్నాయి. మన లెక్కలు ఎలా ఉన్నా సర్వేలో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూద్దామనుకుంటున్నాయి. ఈ సర్వేలు రెండు రోజుల పాటు జరగనున్నాయి.

ఇప్పటికే రెండు పార్టీల తరఫున వేర్వేరు సర్వే బృందాలు అన్ని డివిజన్లలో ప్రజల మూడ్‌ను పసిగట్టే పనిని మొదలుపెట్టాయి. పోలింగ్ రోజున స్పష్టంగా చెప్పకపోయినా ఇప్పుడు సమాధానం వస్తుందని భావిస్తున్నాయి. ప్రీ-పోల్ సర్వే ఫలితాలు ఆ పార్టీల దగ్గర ఉన్నా ఆశించిన స్థాయిలో పోలింగ్ నమోదు కాకపోవడంతో ఆ లెక్కలపై ఆధారపడడంకంటే పోస్ట్-పోల్ సర్వే చేయించుకోవడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చాయి. డివిజన్ల వారీగా ఈ సర్వే జరుగుతోంది. రెండు రోజులైనా ఫర్వాలేదనే తీరులో ప్రజల నాడిని పసిగడుతున్నాయి. ముంపు ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, బలమైన పట్టు ఉందనుకునే కాలనీలు, మురికివాడల బస్తీలు.. ఇలా ఒక్కో ప్రాంతంపై దృష్టి పెడుతున్నాయి.

పది వేల రూపాయల నగదు పంపిణీ, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అక్కడ పోలైన్ ఓట్లు, లబ్ధిదారుల సంఖ్య తదితర వివరాలన్నింటితో పోల్చి చూసుకునే పనిని టీఆర్ఎస్ మొదలుపెట్టింది. పది వేల నగదు సాయం అనుకూలంగా మారిందా లేక ప్రతికూల పరిస్థితులను తీసుకొచ్చిందా అనేది వారి చర్చల్లో ప్రధానాంశం. మరోవైపు బీజేపీ మాత్రం ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత ఓట్ల రూపంలోకి ఏ మేరకు మారింది, పోలింగ్‌లో పాలుపంచుకున్నవారు మార్పు కోసం ఓటేశారా లేక ప్రభుత్వ వ్యతిరేకతతో అధికార పార్టీపై కసితీర్చుకోడానికి ఓటేశారా అనేదానిపైనే కసరత్తు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed