కొవిడ్ వచ్చి నయమైతే మళ్లీ రాదా?

by  |
కొవిడ్ వచ్చి నయమైతే మళ్లీ రాదా?
X

దిశ, వెబ్‌డెస్క్: జులై నెలలో ఒక 27 ఏళ్ల మహిళకు కొవిడ్ 19 పాజిటివ్ వచ్చింది. లక్షణాలు తక్కువగానే కనిపించడంతో సరైన ట్రీట్‌మెంట్ తీసుకుని, వ్యాధినిరోధక శక్తి పెంచుకోవడం వల్ల త్వరగానే నయమైంది. పూర్తిగా కొవిడ్ 19 నెగెటివ్ రాగానే ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కానీ దురదృష్టశాత్తు, నెల తిరిగేలోగా ఆమెకు మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఈసారి లక్షణాలు ఎక్కువగా కనిపించడమే కాకుండా, పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆమె బెంగళూరులోని బన్నేర్‌ఘట్ట రోడ్‌లో ఉన్న ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కొవిడ్ 19ను ఎంతో బాగా కట్టడి చేసిందని పేరు సంపాదించుకున్న బెంగళూరులో.. కొవిడ్ రీఇన్‌ఫెక్షన్ అయిన మొదటి కేసు ఇదేనని డాక్టర్ ప్రతీక్ పాటిల్ చెప్పారు. తర్వాత ఆయన ట్రీట్ చేసిన మరో వ్యక్తి గురించి కూడా వివరించారు. ‘యాభై ఏళ్ల వ్యక్తికి కొవిడ్ వచ్చి తగ్గిపోయింది. దీంతో అతను ఎప్పటిలాగే అందరితో కలిసి పనుల్లోకి వెళ్లడం మొదలుపెట్టాడు. కానీ పది రోజుల్లోనే రీఇన్‌ఫెక్షన్ వచ్చి మరణించాడని’ డాక్టర్ చెప్పారు. కేవలం బెంగళూరులోనే కాదు తెలంగాణ, మహారాష్ట్రలతో పాటు హాంకాంగ్, అమెరికా, నెదర్లాండ్స్ దేశాల్లోనూ ఈ రీఇన్‌ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి.

ఇక్కడ రీఇన్‌ఫెక్షన్ రావడం వింత కాదు. ఎవరికి వస్తుందనే విషయం మీద ప్రధానంగా దృష్టి సారించాలి. పెద్దమొత్తంలో వైరస్ శరీరం మీద దాడి చేసినపుడు, లక్షణాలు కూడా తీవ్రంగా కనిపిస్తాయి. అప్పుడు వ్యాధినిరోధక శక్తి కూడా బలంగా పనిచేస్తుంది. కానీ లక్షణాలు తక్కువ కనిపించినపుడు వ్యాధి నిరోధక శక్తి పెద్దగా క్రియాశీలకంగా మారదు. అందుకే రెండోసారి వైరస్ దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ వచ్చిన చాలా మందిలో కొవిడ్ లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి రెండు మూడు రోజుల్లో తగ్గిపోతోంది. అయితే తమకు ఒకసారి కొవిడ్ వచ్చిపోయిందని, మళ్లీ రాదని వీళ్లందరూ ధైర్యంగా బయటతిరుగుతున్నారు. కనీసం ముఖానికి మాస్క్ కూడా వేసుకోవడం లేదు. అంటే వీళ్లందరికి మరోసారి కొవిడ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. మొదటిసారి వచ్చినపుడు తక్కువ లక్షణాలు కనిపించి, కొన్ని రోజుల్లోనే నయమైనప్పటికీ, రెండోసారి వస్తే మాత్రం వ్యాధి తీవ్రత దారుణంగా ఉంటుందని వారు అంటున్నారు. కాబట్టి కొవిడ్‌ను అశ్రద్ధ చేయకుండా వ్యాధినిరోధక శక్తి పెంచుకునే పనిలో ఉండాలని వారు సలహా ఇస్తున్నారు. కాబట్టి కొవిడ్ ఒక్కసారి వస్తే మళ్లీ రాదనే అపోహ పెట్టుకోవద్దు. రెండోసారి వస్తే తీవ్రస్థాయిలో వస్తుందనే భయం పెట్టుకుని జాగ్రత్తగా ఉండటం మంచిది.

Read Also…

47లక్షల మార్క్‌ను దాటిన భారత్


Next Story

Most Viewed