వలస నేతలకే కుర్చి.. నిరాశలో ఉద్యమ నేతలు

by Shyam |
వలస నేతలకే కుర్చి.. నిరాశలో ఉద్యమ నేతలు
X

ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకే పెద్ద పీట వేస్తుండటంతో పాటు చైర్మన్ పదవిని సైతం అప్పగించడంతో పార్టీ శ్రేణులు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. అయితే ఆ అసమ్మతి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం నిర్వహించిన ఉద్యమంలో నేతలు భాగస్వాములయ్యారు. నాటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని, పార్టీనే నమ్ముకున్నారు.. గుర్తింపు రాకపోతుందా? అని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే అలాంటి వారికి మొండిచేయి చూపుతోంది పార్టీ అధిష్టానం. అంతేకాదు వలస వచ్చిన నేతలకే పెద్దపీట వేయడం.. వారికే వరంగల్ కార్పొరేషన్‌లో సీట్ల కేటాయింపు, చైర్మన్ అభ్యర్థిని ప్రకటించే బాధ్యతను అప్పగించారు. అయితే ఇన్‌చార్జులు పార్టీ కోసం పనిచేసేవారిని కాకుండా తమ అనుయాయులకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో నాయకులు, కార్యకర్తలు అసంతృప్తికి గురవుతున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుంచి నాగుల వెంకటేశ్వర్లు ప్రత్యేక రాష్ర్ట ఉద్యమంలో పాల్గొన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారు. ప్రస్తుతం రైతు విమోచన కమిషన్ చైర్మన్‌గా పని చేస్తున్నారు. అయితే ఆయనకు వరంగల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం మౌఖికంగా చెప్పడంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే జిల్లా అంతటా పర్యటించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

మరో నేత దాస్యం విజయభాస్కర్ పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. విజయభాస్కర్ సైతం కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశతో ఎదురు చూశారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ జాగృతి వరంగల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వీరిద్దరే కాదు మరికొంత మంది చైర్మన్ పదవిని ఆశించారు. కానీ, అయితే అధిష్టానం మొండి చూపింది. అనూహ్యంగా చైర్మన్ అభ్యర్థిగా గుండు సుధారాణిని ప్రకటించడంతో వలస నేతలకు పెద్దపీట వేసినట్లయింది.

ఎర్రబెల్లి అనుచరురాలికే..

ఎర్రబెల్లి దయాకర్ రావు 2016లో టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. ఎర్రబెల్లి, గుండు సుధారాణి ఇద్దరు టీడీపీలో పనిచేశారు. 2002 నుంచి 2004 వరకు టీడీపీ పాలకమండలి సభ్యురాలుగా, 2005 నుంచి 2010 వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆమె ప్రాతినిధ్యం వహించింది. 2010లో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైనది. టీడీపీకి రాజీనామా చేసి 2015లో టీఆర్ఎస్‌లో చేరింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తుంది. కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి ఎర్రబెల్లిని నియమించడం, అభ్యర్థుల, చైర్మన్ ఎంపిక, ప్రచార బాధ్యతలను టీఆర్ఎస్ అధిష్టానం అప్పగించింది. దీంతో ఆయనకు అనుచరురాలిగా ఉన్న సుధారాణిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పార్టీని నమ్ముకున్న సీనియర్లంతా నిరాశగురయ్యారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపోటములపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed