రైతులకు అంతర్జాతీయ సెలెబ్రిటీల సపోర్ట్..

by Anukaran |   ( Updated:2021-02-03 03:40:58.0  )
రైతులకు అంతర్జాతీయ సెలెబ్రిటీల సపోర్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్ : సెంట్రల్ సర్కార్ తీసుకొచ్చిన సాగు చట్టాలను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయాల్సిందేనని రైతులు భీష్మించుకు కూర్చున్నారు. మీ సమస్యల పరిష్కారానికి ఒక్క కాల్ దూరంలో ఉన్నారని నేరుగా ప్రధాని మోడీ రైతులకు స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామంటేనే చర్చలకు మేము సిద్ధమని రైతు సంఘాలు కుండబద్ధలు కొడుతున్నాయి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తుంది. అంతేగానీ, చట్టాలను రద్దు చేయడం కుదరదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సైతం గట్టిగా చెబుతున్నారు. ఇలా ఎవరికీ వారు మంకు పట్టు వీడటం లేదు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే కాదు.. కనీస మద్దతు ధర (MSP)పై కేంద్రం క్లారిటీ ఇవ్వాలని హర్యానా, పంజాబ్ రైతులు చేపట్టిన నిరసనలు రెండు నెలలుగా కొనసాగుతున్నాయి. ఇటీవల జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ పెను విధ్వంసానికి దారితీసింది. ఆరోజు జరిగిన హింసాత్మక ఘటనల్లో ఓ యువరైతు ట్రాక్టర్ తిరగబడి మరణించగా.. ఆందోళనకారుల దాడుల్లో 200మందికి పైగా పోలీసులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ కావడంతో పాటు పలువురు రైతు సంఘాల నాయకులు, ఆందోళనకారులపై కేసులు పెట్టింది. హింసాత్మక ఘటనల వలన రైతు సంఘాల్లో చీలిక ఏర్పడి నాలుగు రైతు సంఘాల నాయకులు ఆందోళనలను విరమించారు. మరికొన్ని రైతు శిబిరాలను ఢిల్లీ పోలీసులు ఖాళీ చేయించడం, సరిహద్దులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులు నేరుగా రైతులతో గొడవ పెట్టుకోవడం చకచకా జరిగిపోయాయి.

అయితే, మిగిలిన రైతు సంఘాల నాయకులు ఢిల్లీ సరిహద్దుల్లో ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. జనవరి-26 సీన్ రిపీట్ కాకుండా ఉండేందుకు దేశరాజధాని సరిహద్దులను పోలీసులు అష్ట దిగ్భంధనం చేశారు. గణతంత్ర వేడుకల మాదిరిగా రైతులు ట్రాక్టర్లతో ఢీకొట్టిన చెదరకుండా ఉండేలా గట్టి భారీకేడ్లు, ఇనుప కంచెలను ఏర్పాటుచేశారు. తాజాగా రైతులు నిరసనలు మాని చర్చలకు రావాలని కేంద్రం పిలునివ్వగా.. రైతులు, కిసాన్ సంఘాల నాయకులపై పెట్టిన కేసులను తొలిగిస్తే చర్చలకు వస్తామని రైతులు స్పష్టంచేశారు.

ఇదిలాఉండగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలను అంతర్జాతీయ సెలెబ్రిటీలు ప్రశ్నించడమే కాకుండా, తమ మద్దతును సైతం ప్రకటించారు. ముందుగా అమెరికాకు చెందిన పాప్ సింగర్ ‘రిహానా’ రైతు ఆందోళనలపై స్పందిస్తూ.. ‘‘మేము దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదంటూ’’ ట్వీట్ చేయడమే కాకుండా.. రైతు సమస్యలపై CNN ప్రచురించిన కథనాన్ని షేర్ చేశారు. అనంతరం 18 ఏళ్ల స్వీడిష్ క్లైమెట్ యాక్టివిస్ట్ ‘గ్రేటా థనబర్గ్’ సైతం స్పందిస్తూ.. ‘‘ ఇండియాలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనలకు సంఘీభావం’’ తెలిపారు. అనంతరం తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న రైతులు ఉంటున్న శిబిరాల్లో భారత ప్రభుత్వం కరెంట్ సరఫరా, ఇంటర్నెట్ నిలిపివేశారని ప్రచురించిన కథనాన్ని ఆమె ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా, రైతు ఆందోళనలు విరమింపజేసేందుకు ఇప్పటివరకు కేంద్రం కిసాన్ సంఘాల నాయకులతో 10 సార్లు చర్చలు జరపగా, 40 అంశాలపై ఇరువురికి ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed