ప్రధాని ప్రశంసలు పొందిన ‘సరస్సుల మనిషి’

by Shamantha N |
ప్రధాని ప్రశంసలు పొందిన ‘సరస్సుల మనిషి’
X

కర్ణాటక, మాండ్య జిల్లాలోని మాళవల్లి తాలూకాలో ఓ మారుమూల గ్రామం దాసనదొడ్డి. ఆ గ్రామానికి చెందిన కామేగౌడను ‘సరస్సుల మనిషి, కుంటల మనిషి’ అని పిలుస్తుంటారు. గత నాలుగు దశాబ్దాలుగా తన గ్రామం చుట్టూ ఒంటరిగానే సరస్సులు, కుంటలు తవ్వడం అతను చేస్తున్న పని. స్థానికంగా అతని గురించి అందరికీ తెలుసు. కానీ ఆదివారం రోజున ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ఈయన పేరును ప్రస్తావించగానే, కామేగౌడ కృషి గురించి దేశం మొత్తం తెలిసింది. 84 ఏళ్ల కామేగౌడ ఆత్మనిర్భరుడిగా చేస్తున్న పనులను మోదీ కొనియాడారు.

కామేగౌడ పెద్ద పెద్ద సరస్సులను నిర్మించకపోయి ఉండొచ్చు కానీ, 16 కుంటలను ఒంటరిగా నిర్మించి నీటి వనరులను కాపాడారని మోదీ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఎలాంటి అవార్డులు, రివార్డులు అంటే ఇష్టం లేని కామేగౌడ, తన పేరును ప్రధాని ప్రస్తావించడంతో ఆనందంతో పొంగిపోయారు. కామేగౌడ గురించి ఓ రిపోర్టర్ చేసిన ట్వీట్‌తో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆయన గురించి తెలిసింది. నీటి సంరక్షణ కోసం పోరాడుతున్న వారందరినీ ఏకం చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్న ఆ మంత్రిత్వ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్.. స్వయంగా కామేగౌడకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆ వీడియోకాల్‌లో కామేగౌడ తాను నిర్మించిన కుంటలను మంత్రికి చూపించారు. అంతేకాకుండా సరస్సులను ఒకదానితో ఒకటి కలిపి గొలుసుకట్టు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సాయం చేయాలని కామేగౌడ కోరారు. దీనికి సంబంధించి పనులను ముమ్మరం చేయాలని గజేంద్ర సింగ్, అధికారులను ఆదేశించడంతో కామేగౌడ సంతోషపడినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story