AP Politics: సూట్‌కేసు కంపెనీల రమణా రెడ్డి..మధురవాడలోని ఎన్సీసీ భూములకు రెక్కలు

by Indraja |
AP Politics: సూట్‌కేసు కంపెనీల రమణా రెడ్డి..మధురవాడలోని ఎన్సీసీ భూములకు రెక్కలు
X

దిశ ప్రతినిధి , విశాఖపట్నం: ప్రభుత్వ భూములకు పాలక పెద్దలు, అధికారులే భక్షకులు. రక్షించాల్సిన వీరే తప్పుడు మార్గాలతో, దొంగ జీఓలతో దర్జాగా కాజేస్తున్నారు. ఇందుకు విశాఖ నగరంలోని మధురవాడ ఎన్‌సీ‌సీ భూములే చక్కని ఉదాహరణ. రెండు వేల కోట్ల విలువైన ఈ భూములు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వం చేతుల్లోకి రాకుండా పాలక పెద్దలు నిర్ణయించిన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

ఇందుకు వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి విజయసాయిరెడ్డి సూత్రధారి కాగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత కార్యదర్శి కే.నాగేశ్వర రెడ్డి( కే ఎన్ ఆర్ ), మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ లబ్ధిదారులు. ఈ వ్యవహారంలో సూట్‌కేస్ కంపెనీల సృష్టికర్త సింగపూర్‌ రమణా రెడ్డి రచించిన భారీ స్కెచ్‌తో వైజాగ్‌లో వేల కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాదారుల చేజిక్కింది. అడ్డు అదుపు లేని ప్రభుత్వ జీవోలతో ఇష్టమైన కంపెనీలకు విలువైన భూములను కట్టబెట్టారు. ఎన్‌సీ‌సీ భూముల కుంభకోణం చిట్టా కొత్త ప్రభుత్వ పెద్దల చేతికి వెళ్లడంతో విచారణకు రంగం సిద్ధంచేస్తున్నట్లు తెలిసింది.

విలువైన భూములు సూట్‌కేస్‌ కంపెనీల ఖాతాలో..

విశాఖపట్నం నడిబొడ్డులో మధురవాడ గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్లు 411, 412, 419/1, 419/3 లోని ఆంధ్రప్రదేశ్‌ గృహనిర్మాణ సంస్థకు 97.3 ఎకరాల అత్యంత విలువైన భూమి ఉంది. ఇందులో ఐటీ పార్కులు, రెసిడెన్షియల్‌ విల్లాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు గానూ 2005లో ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థ( ఏ పీ హెచ్ బీ) ఓపెన్‌ టెండర్లు పిలిచింది. ఇందులో ప్రముఖ నిర్మాణ సంస్థ నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ( ఎన్ సీ సీ) పాల్గొని, కన్సార్డియం కింద ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకుంది.

ఈ స్థలంలో భారీ ప్రాజెక్టులు కడతామని, స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ చెప్పిన సదరు సంస్థ, సింగపూర్‌ సూట్‌ కేస్‌ కంపెనీల మోజులో కాలయాపన చేసింది. ఏళ్లు గడిచినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ప్రభుత్వం నుంచి దర్జాగా తీసుకున్న భూమిలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ సంస్థ, ఎన్‌సీసీ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దాంతో కోర్టును ఆశ్రయించిన ఎన్‌సీసీ స్టేటస్‌-కో తెచ్చుకుంది.

వైసీపీ అధికారంలోకి రావడంతో కథ మారింది..

దీనిపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయించి నిబంధనలు, షరతుల ఉల్లంఘనలు జరిగాయని చెప్పి భూములు వెనక్కి తెచ్చుకోవాలి. సరిగ్గా ఇదే సమయంలో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం, విశాఖను రాజధానిగా మార్చుతామనే ఆలోచన ఉండడంతో ఈ భూములపై ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. వైసీపీ కీలక నేతగా చలామణి అయిన విజయసాయి రెడ్డి రంగ ప్రవేశంతో ఈ భూముల వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది.

విజయసాయి రెడ్డి కనుసన్నల్లో ఎన్‌సీసీ కంపెనీ తప్పనిసరి పరిస్థితుల్లో సింగపూర్‌ కంపెనీకి ఆ భూములను బదిలీ చేయాల్సి వచ్చింది. అక్కడి నుంచి ఈ విలువైన భూములు ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తమ్ముడు కొట్టు మురళీకి చెందిన జీ ఆర్ పీ ఎల్ సంస్థకు బదిలీ అయ్యాయి.

మార్కెట్ ధర తగ్గించి మరీ రిజిస్ట్రేషన్..

ఇందులోనే అసలు తిరకాసు ఉంది. ఈ బదిలీ సమయంలో భారీ మార్కెట్‌ విలువ ఉన్న భూములను చాలా తక్కువ ధర చూపించి బదిలీ కార్యక్రమాన్ని నడిపించారు. స్వయంగా విజయసాయి రెడ్డి పర్యవేక్షణలో ఈ వ్యవహారం జరిగింది అనేందుకు సుమారు 2 వేల కోట్ల పైచిలుకు మార్కెట్‌ విలువ ఉన్న ఈ భూమిని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల అవినీతి, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో భూమి విలువను 180 కోట్లకు కుదించారు.

ఈ మార్పుల వల్ల స్టాంప్‌ డ్యూటీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రెండు వందల కోట్లకు పైగా ఆదాయం కాస్తా 14 కోట్లకే పరిమితమైంది. ఇలా వ్యవహారాన్ని నడిపించేందుకు కావాల్సిన జీ వో లను సృష్టించడంలో విజయసాయి రెడ్డి, జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కే ఎన్ ఆర్ కీలకంగా వ్యవహరించారు. ఫలితంగానే వీరికి ఆయా సూట్‌కేస్‌ కంపెనీలు భారీ మొత్తంలో సమర్పించుకున్నాయి. అందులో భాగంగా కే ఎన్ ఆర్ సూచించిన ట్రైడెంట్‌ అనే బినామీ సంస్థకు సుమారు నాలుగు ఎకరాల భూమి ధారాదత్తమైంది.

వేలకోట్ల కంపెనీ డైరెక్టర్‌ ఉండేది పూరిపాకలో..

ట్రైడెంట్, ఓక్స్‌లీ డెవలపర్స్‌ పేరుతో బినామీ కంపెనీలు సృష్టించిన ఈ నేతలు ఎన్‌సీసీ కంపెనీ నుంచి 12 వేల 100 చదరపు గజాల భూమిని అప్పటి అధికార పార్టీ పెద్దలకు రిజిస్ట్రర్డ్‌ సేల్‌ డీడ్‌ 6175/2024 ద్వారా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ వ్యవహారం ఇటీవలి ఎన్నికలకు సరిగ్గా రెండు వారాల ముందే చోటుచేసుకోవడం గమనార్హం. ఈ రిజిస్ట్రేషన్‌లో వాడిన ఆధార్‌ కార్డుల వివరాలు, అందులోని వ్యక్తుల గురించి తెలుసుకుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే.

ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయల కంపెనీల డైరెక్టర్‌గా చూపించిన కోలా వెంకట రమణ మూర్తి అనే యువకుడు ఉండేది విజయనగరం పురిటిపెంట ప్రాంతంలోని ఓ చిన్న పూరి గుడిసె లో . అంతేకాదు ఈ సూట్‌కేస్‌ కంపెనీల యజమాని తానే అన్న సంగతి ఈ యువకుడికి తెలియకపోవడమే ఇక్కడ కొసమెరుపు. ఈ పూర్తి వ్యవహారాన్ని జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి కే ఎన్ ఆర్ పర్యవేక్షణలోనే జరగడం, దానికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు మద్ధతు పలకడంతో చీకటి జీవోలు చీకటి వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపాయి.

సూట్‌కేసు కంపెనీల రమణా రెడ్డి..

కుందూరు రమణా రెడ్డి అలియాస్‌ సింగపూర్‌ రమణా రెడ్డిగా ప్రాచుర్యం పొందిన ఈ పెద్దమనిషి , వైఎస్సార్ ముఖ్యమంత్రి అవగానే విశాఖలో వుడా నుంచి వేల కోట్ల భూములను అభివృద్ధి పేరిట తీసుకొని ఏమీ చేయకుండా దొంగ జీఓలతో ఇతర సంస్ధలకు బదిలీ చేసి కోట్లు సంపాదించాడు. విదేశీ పెట్టుబడులు తెస్తానంటూ బురిడీ కొట్టించి అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రైవేట్‌ వ్యక్తులను మోసం చేస్తుండడం ఆయన నైజం.

గత వైఎస్సార్‌ ప్రభుత్వంలో అన్నీ తానై నడిపిస్తానంటూ విదేశీ పెట్టుబడుల పేరుతో ప్రభుత్వాన్ని పూర్తిగా వాడుకుని రూపాయి పెట్టుబడి కూడా తీసుకురాలేదు. పైగా ప్రభుత్వ ఖజానా నుంచి వివిధ పథకాల రూపంలో నిధులను దుర్వినియోగం చేస్తూ దర్జాగా బతికిన వైట్‌కాలర్‌ మోసగాడు సింగపూర్‌ రమణా రెడ్డి పై కూటమి ప్రభుత్వం కూపీ లాగుతోంది.

63 కేసులు, రెడ్ కార్నర్ నోటీసులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక లుకౌట్‌, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయిన ఏకైక తెలుగు వ్యక్తిగా రమణా రెడ్డి చరిత్రలోకి ఎక్కారు. రమణా రెడ్డి జీవితంలో ఇప్పటి వరకు ఒక్కరూపాయి విదేశీ పెట్టుబడి సైతం దేశానికి కానీ, తెలుగు రాష్ట్రాలకు కానీ తీసుకువచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విదేశీ పెట్టుబడులతో ప్రభుత్వ పెద్దలను సంప్రదించడం, తనకున్న లాబీతో అవినీతికి సానుకూలంగా ఉన్న అధికారులకు ఆశలు చూపించడంలో రమణా రెడ్డి దిట్ట.

పెట్టుబడులనే మాయమాటలతో ప్రభుత్వాల నిధుల్ని తన జల్సాలకు వాడుకునే వ్యక్తిగా రమణా రెడ్డికి ముద్ర పడింది. ఈ మాయగాడి స్కెచ్‌ ప్రకారమే ఎన్‌సీసీ మధురవాడ భూములు దొడ్డి దారిన మట్స్‌డో అనే సింగపూర్ కంపెనీకి దారి మళ్లాయి. సింగపూర్‌ రమణా రెడ్డిపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, దిల్లీ తదితర రాష్ట్రాల్లో 63 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయంటే ఎంత పెద్ద మోసగాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ కేటుగాడు ప్రతీ చోట ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల, కీలక అధికారులే టార్గెట్‌గా విదేశీ పెట్టుబడుల పేరుతో బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు దండుకుపోతుంటాడనే ఆరోపణలున్నాయి. రమణా రెడ్డి మోసాల బారినపడి రోడ్డు పాలైన ఎందరో అధికారులు, పారిశ్రామిక వేత్తలు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి.

విచారణకు సిద్ధం

ఈ వ్యవహారంపై ప్రస్తుత ప్రభుత్వం ఉన్నత స్థాయి జ్యూడిషియల్‌ విచారణ జరిపి, రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని సింగపూర్‌ సూట్‌కేస్‌ సంస్థల నుంచి తిరిగి తీసుకుని ప్రభుత్వ ఖజానాకు న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో పాత్రధారులను, సూత్రధారులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొనేందుకు రంగం సిద్ధమవుతోంది.

Advertisement

Next Story