politics:కేంద్ర కేబినెట్​లో చోటు ఎవరికి ?

by Indraja |
politics:కేంద్ర కేబినెట్​లో చోటు ఎవరికి ?
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు మనసులో ఏముందో తెలీదు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరిన ఎంపీల్లో ఉత్కంఠకు తెరపడలేదు. ఎవరూ కూడా తమకు అవకాశం ఇవ్వండని బాబు దృష్టికి తీసుకొచ్చినట్లు లేదు. ఎవరి పేరు ఖరారు చేసినా అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇంతకీ బీజేపీ ఎన్ని కేంద్ర మంత్రి పదవులు ఇస్తుందనేది కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి నడ్డాతో మాట్లాడాలని చంద్రబాబుకు అమిత్​ షా సూచించినట్లు తెలిసింది.

ఆయనకు గ్యారంటీగా చాన్స్..

ప్రస్తుతం కూటమి తరపున విజయం సాధించిన ఎంపీల్లో సీనియర్లున్నారు. కొత్తవాళ్లూ ఉన్నారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్​ నాయుడుకు తప్పనిసరిగా కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నడ్డాతో చంద్రబాబు చర్చల్లో పౌర విమానయాన శాఖను రామ్మోహన్​నాయుడికి కేటాయిస్తామని చెప్పినట్లు సమాచారం. మరో సహాయ మంత్రి పదవిని గుంటూరు ఎంపీ పెమ్మసానికి ఇవ్వాలని చంద్రబాబు సూచించారట. ఇవిగాక మరో కేబినెట్, సహాయ మంత్రి కావాలని చంద్రబాబు అడిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

పురందేశ్వరికి బెర్త్ ఖాయం..

బీజేపీ ఇంకా అదనంగా ఎన్ని పదవులు ఇస్తారనేది స్పష్టత లేదు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్​రెడ్డి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్​, హిందూపురం ఎంపీ పార్థ సారధి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పల్నాడు ఎంపీ లావు కృష్ణ దేవరాయులు మాత్రం క్యూలో ఉన్నారు. బీజేపీ ఎన్ని పదవులు ఇస్తుందనే దాన్ని బట్టి వీళ్లకు అవకాశాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరికి బెర్త్​ ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్​ కూడా మంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నారు. జనసేన నుంచి బందరు ఎంపీ బాలశౌరికి అవకాశం రావొచ్చని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ దఫా కేంద్ర సర్కారు రాష్ట్రానికి అధిక ప్రాధాన్యమిచ్చి మరిన్ని మంత్రి పదవులు ఇవ్వొచ్చని కూటమి పార్టీలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed