నిన్నటిదాకా మంత్రులు, నేడు సీఎం కూతురు.. టీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్​

by Nagaya |   ( Updated:2022-12-02 04:59:30.0  )
నిన్నటిదాకా మంత్రులు, నేడు సీఎం కూతురు.. టీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్​
X

గులాబీ నేతల గుండెల్లో ఈడీ రైళ్లు పరిగెత్తిస్తున్నది. ఎక్కడ తమకు నోటీసులు వస్తాయో? సోదాలు జరుగుతాయోనని టెన్షన్​ పడుతున్నారు. నిన్నటిదాకా మంత్రులు ఇతర నేతల ఇళ్లపై దాడులు చేసిన దర్యాప్తు సంస్థ.. తాజాగా సీఎం కూతురు కవిత పేరును ప్రస్తావించడంతో నేతలు షాక్​కు గురవుతున్నారు. సీఎం భరోసా ఇచ్చినా వారిలో ఆందోళన తగ్గడం లేదు. అసలు ఈడీ విచారణకు వెళ్లాలా? వద్దా?.. వెళ్తే ఏం అడుగుతారు? దానికి ఏం చెప్పాల్సి వస్తుందోనని తలలు పట్టుకుంటున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులతో టీఆర్ఎస్ లీడర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. సోదాలు.. నోటీసుల జారీలతో పుల్ స్టాప్ లేకుండా జరుగుతున్న పరిణామాలతో పార్టీలో ఎవరికి ఎప్పుడు ఏం అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మొన్నటివరకు మంత్రులు, ఎంపీలు, లీడర్లకు పరిమితమైన ఈడీ దర్యాప్తు.. తాజాగా సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు తేవడంతో నేతలంతా ఒక్కసారి షాక్ అయ్యారు. ఈ కేసు ఎటు దారితీస్తుందనే టెన్షన్​లో మునిగిపోయారు. జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఏకంగా కవితనే స్వయంగా ప్రకటించడంతో ఆ పరిణామం త్వరలో జరుగబోతున్నదా? అందుకే అలా మాట్లాడారా? అన్న చర్చ కూడా పార్టీలో జోరుగా సాగుతున్నది.

ఫస్ట్ టైమ్.. కేసీఆర్ ఫ్యామిలీ

కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మొదటిసారి సీఎం కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్ల పేర్లను ప్రస్తావించించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కోర్టుకు సమర్పించిన అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది. దీంతో కవితకు త్వరలో విచారణకు రావాలని నోటీసులు వస్తాయని ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాత ఈడీ కస్టడీలోని తీసుకునే చాన్స్ కూడా ఉండొచ్చని టాక్ జోరుగా వినిపిస్తున్నది. కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఈడీ చురుకుగా సోదాలు, విచారణలు కొనసాగిస్తున్నది. కాసినో కేసులో తొలిసారి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డిని విచారణకు పిలిచింది. ఆ తర్వాత అదే కేసులో ఎమ్మెల్సీ రమణ, మంత్రి తలసాని కొడుకు సాయికిరణ్​​ను విచారణ చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించిన కేసులో మంత్రి గంగుల కమాలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ శాఖ తనిఖీలు జరిగాయి.

బ్యాన్ చేసినా ఎంట్రీ ఇచ్చిన సీబీఐ

రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. కానీ, సీబీఐ ఢిల్లీకి సంబంధించిన కేసులో టీఆర్ఎస్ లీడర్లకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ అధికారి పేరుతో ఏపీకి చెందిన శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడటంతో ఆతన్ని రీసెంట్ గా సదరు సంస్థ అరెస్టు చేసింది. ఆ నకిలీ అధికారితో మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు మంచి సంబంధాలు ఉన్నట్టు సీబీఐ అనుమానిస్తున్నది. ముగ్గురూ కలిసి దిగిన ఫోటోలు లభ్యం కావడంతోపాటు వాట్సాప్ సంభాషణలు గుర్తించినట్టు ప్రచారంలో ఉన్నది.

కేసీఆర్ భరోసా ఇచ్చినా తగ్గని టెన్షన్

త్వరలో రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు వస్తాయని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ నవంబర్​ 15న తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలను అలర్ట్ చేశారు. కేసులను ఎదుర్కుంటూనే ప్రజల్లో ఉండాలని సూచించారు. ఆ సమయంలో ధీమాగానే ఉన్న నేతలు.. తర్వాత వరుసగా జరుగుతున్న ఐటీ సోదాలు, ఈడీ విచారణలతో టెన్షన్​ పడుతున్నారు. ఐటీ సోదాల సమయంలో మంత్రి మల్లారెడ్డి నానా హంగామా చేశారు. ఐటీ అధికారులపైనే కేసులు పెట్టినా.. ఫలితం లేకుండాపోయింది.

స్పందించని సీనియర్​ నేతలు

తాజాగా కవిత పేరును ఈడీ తన రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించడంతో కవిత చాలా షాక్​కు గురైనట్టు ప్రచారం జరుగుతున్నది. బుధవారం రాత్రి నుంచే ఓదార్చేందుకు పెద్ద సంఖ్యలో లీడర్లు ఆమె ఇంటికి వెళ్లారు. మీడియాతో మాట్లాడే సమయంలో కూడా సీనియర్ లీడర్లు ఆమె వెంట కనిపించారు. అయినా ప్రెస్​మీట్​లో ఎమ్మెల్సీ ఉద్వేగానికి గురయ్యారు. అయితే, కవిత పేరును ఈడీ ప్రస్తావించడంపై పెద్ద లీడర్లు ఎవరూ స్పందించడంలేదు. మంత్రి కేటీఆర్ మునుగోడులో జరిగిన కార్యక్రమంలో హాజరైనా ఈడీ కేసు గురించి ప్రస్తావించలేదు. కవితతో కలిసి మంత్రి హరీశ్ రావు జగిత్యాలలో జరిగిన ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆయన కూడా ఈ అంశాన్ని టచ్ చేయలేదు.

వెళ్తే ఓ సమస్య.. లేకుంటే మరో సమస్య

కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు వెళ్తే ఓ సమస్య.. వెళ్లకపోతే మరో సమస్య వచ్చే ప్రమాదం ఉందని గులాబీ లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచారణలో ఏం అడుగుతారు? ఏం సమాధానం చెప్పాలి? ఒకేసారి పిలుస్తారా? మళ్లీ మళ్లీ రావాలని చెప్తారా? అనే టెన్షన్ పట్టుకుంది. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు తప్పకుండా వెళ్లాలని ప్రగతిభవన్ వర్గాలు సూచించినట్టు తెలిసింది. ఒకవేళ డుమ్మా కొడితే ఫాంహౌజ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు బీజేపీ కేంద్ర నేతలు డుమ్మా కొడుతారేమోనని అనుమానం వెంటాడుతుంది. అందుకని ఈడీ, ఐటీ, సీబీఐ విచారణకు రావాలని పిలిస్తే తప్పకుండా వెళ్లాలని లీడర్లకు చెప్పినట్టు తెలిసింది.

Also Read.....

మోగుతున్న ముందస్తు సైరన్

Advertisement

Next Story