పొంగులేటి వెంటే 'తెల్లం'.. భద్రాచలం బరి నుంచి పోటీకి సిద్ధం..?

by Mahesh |   ( Updated:2023-01-10 06:30:50.0  )
పొంగులేటి వెంటే తెల్లం.. భద్రాచలం బరి నుంచి పోటీకి సిద్ధం..?
X

దిశ, చర్ల: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం ఖాయమని తేలిపోయింది. నాలుగున్నర సంవత్సరాలు ఇప్పుడున్న పార్టీలో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్న ఆయన కొద్దిరోజుల్లో కారు దిగి కమలం పువ్వు అందుకోడానికి సిద్ధమైనారు. ఈనెల 18న కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం ఆయన బీజేపీలో చేరేది ఎప్పుడనేది క్లారిటీ వస్తుంది. ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరడం కంటె బీజేపీ పెద్దలను ఖమ్మంకు పిలిపించుకొని భారీ బహిరంగ సభ వేదికగా రాజకీయంగా ఆదరిస్తున్న ప్రజల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోవాలనే ఆలోచనగా కనిపిస్తోంది.‌ అందుకోసమే అమిత్ షా‌తో ముందుగా భేటీ అవుతున్నట్లు సమాచారం. ఈ భేటీ సందర్భంగా ఆయన తన భవిష్యత్తు, తన అనుచరులకు తగిన గుర్తింపు, కేసీఆర్‌ని ఢీకొట్టడానికి కావాల్సిన సపోర్టు గురించి పొంగులేటి అమిత్‌షాతో చర్చించి ఫైనల్ చేసుకుంటారని తెలుస్తోంది.

‌పొంగులేటికి బీజేపీలో కీలక పదవి లభిస్తుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పొంగులేటి పార్టీ మారితే ఆయన వెంట వెళ్ళేవారు ఎందరు, బీఆర్ఎస్‌ పార్టీకి జరగబోయే నష్టమెంత అనేది స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి సోమవారం ఖమ్మం జిల్లా నేతలతో భేటీ సందర్భంగా ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ మేరకు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి పువ్వాడ సహా ఉమ్మడి ఖమ్మంలోని తాజా, మాజీ ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా పొంగులేటి మాదిరిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ వీడకుండా సీఎం కేసీఆర్ ఆయనకు ఫోన్‌చేసి రాజకీయ భవిష్యత్తుపై (ఎంఎల్‌సి సీటు ఆఫర్) స్పష్టత ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

పొంగులేటి వెంట నడిచేది వీరే..!

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే ఆయన వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావు తదితరులు పార్టీ మారతారని తెలుస్తోంది. తెల్లం వెంకట్రావు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. తెల్లం వెంకట్రావు తో పాటు భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిథులు పార్టీ‌ మారుతారని తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌కి భారీ నష్టమే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పాయం వెంకటేశ్వర్లు (పినపాక), కోరం కనకయ్య (ఇల్లందు) పొంగులేటి టీమ్‌గా పోటీచేస్తారని సమాచారం. అశ్వారావుపేట విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

పొంగులేటి చేరికపై బీజేపీ క్యాడర్‌లో ఆందోళన

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరగణంతో బీజేపీలో చేరితే ఇప్పటివరకు ఉన్న ప్రాధాన్యత ఉంటుందా లేక టీఆర్ఎస్‌లో తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి మాదిరిగా పక్కకు నెట్టివేయబడుతుందా అనే ఆందోళన బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. ఏ చెట్లు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అన్నట్లుగా బీజేపీకి చాలా మండలాల్లో సమర్థ నాయకత్వం లేనప్పటికీ ఉన్నవారే ఇప్పటి వరకు కింగ్ మేకర్‌లుగా చెలామణి అవుతున్నారు.

పొంగులేటి చేరితే ఆయన అనుచరుల చేతుల్లోకి పార్టీ వెళ్ళిపోతుందని, అప్పుడు తమ పరిస్థితి ఏంటనే ఆందోళన చాలామంది బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. పొంగులేటి చేరడం వలన పార్టీకి ఎంతో మేలు జరుగుతుందని అనుకునే వారికంటె నాయకులుగా నష్టం జరుగుతుందని భయపడే వారే అధికంగా కనిపిస్తున్నారు. ఈ సమస్యని ముందుగానే గుర్తించి పార్టీ అధిష్టానం తగిన చర్యలు తీసుకోకుంటే టీఆర్ఎస్‌లో పెరిగిన వలసల మూలంగా ఏర్పడిన పాత, కొత్త నాయకత్వ సమస్య ఇక్కడ బీజేపీలోను ఉత్పన్నమయ్యే ప్రమాదం లేకపోలేదు.

Advertisement

Next Story

Most Viewed