యువగళం.. రణగళం

by Javid Pasha |   ( Updated:2023-05-09 14:14:02.0  )
యువగళం.. రణగళం
X

దిశ, కర్నూలు ప్రతినిధి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్ర రాజకీయ రణరంగంగా మారింది. కర్నూలు జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి నేటి వరకు ఉమ్మడి జిల్లాలో డోన్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కర్నూలు వరకు సాగుతోంది. అందులో పాదయాత్ర చేసిన నియోజవకర్గాల్లో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేస్తూ లోకేష్ విమర్శలు గుప్పించారు. సవాళ్లు..ప్రతి సవాళ్లతో కందనవోలు హీటెక్కింది. ఎమ్మెల్యేలతో పాటు సీఎం జగన్ కు అడ్డపేర్లు పెడుతూ ముందుకు సాగుతున్నారు. దీంతో అదే స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు లోకేష్ పై ఘాటుగా స్పందిస్తూ ప్రతి సవాళ్లు విసురుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అందరి కంటే తీవ్ర స్థాయిలో మండిపడి బల నిరూపణకు సిద్ధమయ్యారు. లోకేష్ జోకర్ కు ఎక్కవ..బఫూన్ కు తక్కువ అంటూ విరుచుకు పడ్డారు. ప్లేస్ నువ్వు చెప్పిన సరే..నేను చెప్పమంటవా..? లేక కొండరెడ్డి బురుజు వద్దకు వస్తావా? అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో గౌరు దంపతులు కాటసాని సవాల్ ను స్వీకరించారు. ఇక కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఏకంగా లోకేష్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్ 14 నుంచి డోన్ నియోజకవర్గం నుంచి ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం నాటికి 26వ రోజుకు చేరింది. ఈ మూడు వారాల కాల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు. అందులో ఇద్దరు జిల్లా మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలకు అడ్డపేర్లు పెడుతూ..సెల్ఫీలు దిగుతూ సవాళ్లు..విమర్శలు చేస్తూ వస్తున్నారు. డోన్ లో ఆర్థికశాఖ మంత్రి బుగ్గనను అవినీతి సామ్రాట్ బుగ్గన అని, డోన్ నియోజకవర్గంలో మైనింగ్ గనులను దోచేస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవినీతి సామ్రాట్ గా అవతారమెత్తారని అన్నారు. అక్రమ మైనింగ్ పై పోరాడిన శ్రీనివాసులు అనే వ్యక్తిని దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. మంత్రి మేనల్లుడు గజేంద్రా రెడ్డికి అక్రమ మైనింగ్, ఇసుక వ్యాపారాలను అప్పగించారని ధ్వజమెత్తారు. టిప్పర్ ఇసుకను రూ.30 వేలకు విక్రయించి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు. మట్కా, మద్యం వ్యాపారాలను మంత్రి తన అనుచరులు దినేష్, ప్రసాద్లకు అప్పగించారని ఆరోపించారు.

అలాగే కమలాపురం అర్జున్ రెడ్డికి చెందిన రూ.5 కోట్ల ఆస్తిని మంత్రి అనుచరులు కొట్టేశారని విమర్శలు చేశారు. అలాగే బూరుగుల గ్రామంలో 500 ఎకరాలను మంత్రి అనుచరులు స్వాహా చేశారని కూడా ఆరోపణలు చేశారు. అలాగే పత్తికొండ ఎమ్మెల్యే స్టిక్కర్ ఎమ్మె్ల్యే అని వ్యాఖ్యా నించారు. పత్తికొండలో కుటుంబ మాఫియా రాజ్యమేలుతోందన్నారు. ఆలూరులోకి ప్రవేశించిన యాత్రలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంను బెంజి మంత్రి అని, ఆదోనిలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ ను ఇసుక డాన్ అని, ఎమ్మిగనూరులో అభివృద్ధి పనులపై సెల్ఫీతో సవాల్ విసిరారు. మంత్రాలయంలో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డిని కాల నాగు అంటూ వ్యంగస్ర్తాలు సంధించారు. అక్కడి నుంచి కోడుమూరులో ప్రవేశించిన యాత్రలో ఎమ్మెల్యే సుధాకర్, కుడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు.

ఇక పాణ్యం నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన లోకేష్ సుధీర్ఘ కాలం ఎమ్మెల్యేగా, ఏడాది పొడవునా ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. కరప్షన్ రాంభూపాల్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పై కూడా విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించి అక్రమంగా సంపాదిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లోకేష్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

వైసీపీ నేతల ఘాటు విమర్శలు

డోన్ నియోజకవర్గం నుంచి కర్నూలు జిల్లా కేంద్రానికి చేరుకున్న యువగళం పాదయాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు నారా లోకేష్ పై ఘాటు విమర్శలతో ఆడుకుని తాము చేసిన వాటికి ఆధారాలు చూపుతావా అంటూ ప్రతి సవాల్ విసిరారు. మంత్రులు బుగ్గన, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు సాయి ప్రసాద్, ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, సుధాకర్, కాటసాని రాంభూపాల్రె డ్డిలు లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి గుమ్మనూరు తాను ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నానని, ఎక్కడ అవినీతి చేశానో నిరూపించాలని సవాల్ విసిరారు. అలాగే కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ లోకేష్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏకంగా నిరసనకు దిగారు. ఈయనకు ప్రజా సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ముందు ఎన్నికల బరిలో నిలిచి గెలవాలని, ఎక్కడ పాదయాత్ర చేపట్టినా తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో లోకేష్ పై విరుచుకుపడ్డారు. తాను 1985 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశానే తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. ఒక ముఖ్యమంత్రి కుమారుడివై ఉండి ఎవరో రాసిచ్చిన స్ర్కిప్ట్ చదివితే అవి నిజమైపోవనే విషయాలు తెలుసుకోవాలన్నారు.

తాను ఎలాంటి అవినీతి అక్రమాలు చేశానో ఆధారాలతో సహా నిరూపిస్తా అన్నావు కదా..తాను ఎక్కడికైనా చర్చకు సిద్ధమే..నువ్వు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నా ఇంటికి రావడానికి భయమేస్తే నీ శిబిరానికి రమ్మంటావా ?, లేక కొండరెడ్డి బురుజు వద్దకు రావాలన్నారు. కర్నూలు జిల్లా దాటేలోపు ఏ నిర్ణయం చెప్పాలని ప్రతి సవాల్ విసిరారు. ముందు విజ్ఞత నేర్చుకోవాలంటూ హితవు పలికారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను చేసిన అవినీతి అక్రమాలను నిరూపించాలని ఓ మసీదులో ప్రార్థనలు చేసి అక్కడే లోకేష్ ను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఇలా కర్నూలు జిల్లాలో చేపట్టిన యువగళం పాదయాత్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇంకా కర్నూలు, నందికొట్కూరు, శ్రీశైలం, బనగానపల్లె, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గా్ల్లో పాదయాత్ర చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విమర్శలు చేసిన లోకేష్ ఎందుకు చర్చకు రావడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని పలువురు చర్చించుకుంటున్నారు.

సవాల్ స్వీకరించిన గౌరు దంపతులు

పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నారా లోకేష్ కు విసిరిస సవాల్ ను టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి దంపతులు స్వీకరించారు. కాటసాని చేసిన అవినీతి అక్రమాలను తాము ఆధారాలతో సహా బయటపెడతామని, అవసరమైతే బాధితులను బహిరంగంగా నిలబెడతామని తేల్చి చెప్పారు. అందుకు కొండారెడ్డి బురుజు దగ్గరికి రమ్మంటారా ?, లేక రాజ్ విహార్ సెంటర్ కు రమ్మంటారా ? అంటూ ప్రతి సవాల్ విసిరారు. వైసీపీ అధికారంలోకొచ్చిన నాటి నుంచి నేటి వరకు 20 గ్రూపులను ఏర్పాటు చేసి ఎక్కడ ఖాళీ స్థలం కన్పిస్తే ఆ స్థలాన్ని కబ్జా చేయడం, ఎదిరిస్తే వారిపైనే తిరిగి బలవంతంగా కేసులు నమోదు చేయించడం అందరికీ తెలుసన్నారు. తమ కుటుంబం ఒకరికి పెట్టేదే గానీ ఎవరికీ ఏ హానీ చేయమని తెలిపారు. వీరువురి తీరుతో పాణ్యం రాజకీయంగా హీటెక్కింది. భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మహాకుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం

Advertisement

Next Story

Most Viewed