AP Politics: పశ్చిమను ఆదర్శంగా నిలుపుతా.. సుజనా చౌదరి

by Indraja |
AP Politics: పశ్చిమను ఆదర్శంగా నిలుపుతా.. సుజనా చౌదరి
X

దిశ, ప్రతినిధి విజయవాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు (గురువారం) ఉదయం 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు, బీజేపీ మహిళా నాయకురాలు పగడాల స్వర్ణలత, జనసేన నాయకులు వెంపలి గౌరీ శంకర్‌తో కలిసి లంబాడీ పేట, ఐజాక్ వీధి, కుండల బజార్, చిన్న మస్తాన్ వీధిలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ప్రాంతాల్లో పర్యటించారు.

పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మరోసారి స్పష్టం చేశారు. సుజనాకు కొండ ప్రాంత ప్రజలు సమస్యలు ఏకరువు పెట్టారు. జగన్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మొరపెట్టుకున్నారు. ప్రజల సమస్యలను సుజనా ఓపికగా విన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వెనుకబడిపోయిందని, ప్రజల ఇబ్బందులు తనను ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు.

విజయవాడ వన్ టౌన్ అంటే అభివృద్ధిలో ముందుండాలని, కానీ ఆధునిక కాలంలో కూడా ఇంత వెనుకబడి ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. అభివృద్ధి చేశామని చెబుతున్నవారు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా డిమాండ్ చేశారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను పాలకులు మోసం చేశారని దుయ్యబట్టారు.

ఓట్ల కోసం హామీలు ఇచ్చి అమలు చేయనివారిని రీకాల్ చేసే విధానం రావాలని, అప్పుడు ప్రజలను ప్రజా ప్రతినిధులు మోసం చేయలేరని సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో తనకున్న పరిచయాలతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా, సుజనా ఫౌండేషన్ పేరుతో ఎంతో అభివృద్ధి చేశానని, సేవ చేశానని గుర్తు చేశారు.

విజయవాడ కనకదుర్గమ్మ తనకు ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం కల్పించిందని, మోడీని ఈ నియోజకవర్గానికి తీసుకొస్తానని చెప్పారు. నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్టు వివరించారు. సుజనాకు మద్దతుగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, జనసేన నాయకులు బాడిత శంకర్, టీడీపీ మాజీ కార్పొరేటర్ గుర్రంకొండ, ఓబీసీ మోర్చా, ఏపీ మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Advertisement

Next Story

Most Viewed