బరిలో ఆ సామాజిక వర్గ నేత.. మునుగోడులో కాంగ్రెస్‌కు వచ్చే ఫలితమిదే!!

by GSrikanth |   ( Updated:2022-08-23 04:41:51.0  )
బరిలో ఆ సామాజిక వర్గ నేత.. మునుగోడులో కాంగ్రెస్‌కు వచ్చే ఫలితమిదే!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడు బరిలో కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎత్తుకునే అవకాశం కనిపిస్తోంది. 25 రోజుల పాటుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం చేసిన సర్వే నివేదికను ఏఐసీసీ ముందుంచారు. పార్టీల వారీగా బలాబలాలు, అభ్యర్థులు, ద్వితీయ శ్రేణి కేడర్ పరిస్థితులను వివరించినట్లు సమాచారం. ఈ నివేదికను ఏఐసీసీ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నేతల ముందు పెట్టారు. ఈసారి బీసీ నేతకు ప్రయార్టీ ఇవ్వాలని, బీసీ నేతను బరిలోకి దింపితే గెలుపు చాన్స్ ఉంటుందని, గట్టి పోటీ ఇస్తారని నివేదికల్లో పేర్కొన్నారు. ఇప్పటికీ మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకే గెలుపు అవకాశం ఉందని కాంగ్రెస్ సర్వేల్లో తేలింది. అయితే, ఇక్కడ రెడ్డి వర్గీయులకు ఈసారి టికెట్ వద్దని, బీసీకి ఇస్తే కొంత మేలు జరుగుతుందని, ఈసారి గెలువకున్నా.. రెండోస్థానాన్ని పదిలం చేసుకుంటామని కాంగ్రెస్ వ్యూహకర్త సర్వే రిపోర్టుల్లో ఏఐసీసీకి వివరించారు. అయితే, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంశాన్ని కూడా ఈ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. ఎంపీ వెంకట్ రెడ్డి ప్రచారం చేసినా.. చేయకపోయినా పార్టీకి నష్టమేమీ లేదంటూ సూచించినట్లు తెలుస్తోంది.

రేవంత్ సైలెంట్

మునుగోడు సెగ్మెంట్‌పై రాష్ట్ర నేతలతో ఏఐసీసీ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సోమవారం సాయంత్రం సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ గొడవకు దిగడంతో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. ఆ తర్వాత నేతలందరినీ పిలిచి, మునుగోడుపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే సునీల్ కనుగోలు టీం చేసిన సర్వే నివేదికను పార్టీ నేతలకు వివరించారు. పార్టీ అభ్యర్థి విషయంలో కీలక అంశాలను ఈ సందర్భంగా వెల్లడించారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. అభ్యర్థి పేరును చెప్పకుండా బీసీ వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రిపోర్ట్‌లో సూచించినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే, దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైలెంట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చలమల్ల క్రిష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి పేర్లు పరిశీలనలో ఉండగా.. రేవంత్​ మాత్రం కృష్ణారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునీల్ టీం ఇచ్చిన సర్వే రిపోర్ట్‌లో బీసీ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని వివరించారు. దీంతో ఏఐసీసీ పెద్దల సమావేశంలో అభ్యర్థి అంశంపై రేవంత్​ రెడ్డి సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం.

ఉత్తమ్, జానా నో ఇంట్రెస్ట్

ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్​ నేతలు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మునుగోడు అభ్యర్థి అంశంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని సునీల్ టీం నివేదిక చెప్తుందని కేసీ వేణుగోపాల్ వివరిస్తున్న నేపథ్యంలోనే వారు కొంత అడ్డు చెప్పినట్లు పార్టీ కీలక నేత చెప్పారు. సర్వే నివేదిక ప్రకారం అక్కడ బీసీ అభ్యర్థిని పోటీకి దింపితే.. రెడ్డి వర్గీయుల ఆధిపత్యానికి దెబ్బ వస్తుందనే కోణంలో అక్కడి సీనియర్ నేతలు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో బీసీ అభ్యర్థిని పోటీకి దింపితే రెండో స్థానం కూడా కష్టమంటూ ఉత్తమ్, జానా అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం.

వెంకట్ రెడ్డి బ్యాక్

సునీల్ టీం రిపోర్ట్ సోమవారం మధ్యాహ్నం వరకే పార్టీ నేతలకు లీకైంది. ఈ రిపోర్ట్ ప్రకారమే చర్చలు ఉంటాయని పార్టీ నేతలు భావించారు. కేవలం అభ్యర్థి అంశం ఒక్కటే కాకుండా పార్టీ నేతల వ్యవహారం, ఎంపీ కోమటిరెడ్డి వ్యాఖ్యలు, మునుగోడు, నల్గొండ జిల్లాల్లో ఆయన ప్రభావం వంటి అంశాలపై రిపోర్ట్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే, మునుగోడులో బీసీ అభ్యర్థికి ప్రయార్టీ అంటూ సునీల్ రిపోర్ట్‌లో చెప్పారని లీకు కావడంతో.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కనీసం ఏఐసీసీ కార్యాలయం వైపు కూడా వెళ్లలేదని పార్టీ నేతల అభిప్రాయం. ఏఐసీసీ మీటింగ్ కోసం సాయంత్రం నాలుగు గంటల వరకూ ఢిల్లీలో ఉన్న వెంకట్​ రెడ్డి పరిస్థితులు అనుకూలంగా లేవనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చినట్లు చర్చ జరుగుతోంది. అంతేకాకుండా బీసీ అభ్యర్థికి ఇస్తే ప్రచారం చేయనని కూడా ప్రకటించారు.

'చెరుకు' కోసమేనా..?

ప్రస్తుతం మునుగోడులో బీసీ అభ్యర్థి కావాలంటే ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. టీఆర్‌ఎస్‌కు చెందిన ఓ ద్వితీయ శ్రేణి లీడర్ కూడా పార్టీ టికెట్ ఇస్తే పార్టీ మారుతారునే సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటీవల తెలంగాణ ఇంటి పార్టీని విలీనం చేసిన చెరుకు సుధాకర్‌తో పాటుగా పల్లె రవి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చెరుకు సుధాకర్ లేదా ఆయన భార్యకు టికెట్ ఇస్తే.. రెండు వర్గాలతో లాభం వస్తుందని పార్టీలోని ఒక వర్గం భావిస్తోంది. ఇప్పటికే చెరుకు సుధాకర్ పార్టీలో చేరడాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికీ తప్పు పడుతూనే ఉన్నారు. తనకు సమాచారం లేదని, ఆయన్ను ఎలా తీసుకుంటారని అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇప్పుడు సర్వే రిపోర్టు ప్రకారం చెరుకు సుధాకర్‌కు టికెట్ ఇస్తే.. తాను ప్రచారం చేయనని, అందుకే ముందస్తుగానే ఆయన మునుగోడుకు దూరంగా ఉంటానని ప్రకటించినట్లు గాంధీభవన్‌లో టాక్.

అయినా.. సెకండ్ ప్లేస్​

మునుగోడు పరిస్థితులపై సునీల్​టీం సుదీర్ఘమైన నివేదికను పార్టీ అధినేతలకు ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ టీఆర్ఎస్ పార్టీకి విన్నింగ్ చాన్స్ ఉందని నివేదికల్లో వెల్లడించినట్లు సమాచారం. రెండోస్థానంలో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ ఉందని, బీజేపీ మూడో స్థానం ఉందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉందనే విషయాన్ని కూడా చూపించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు బీసీ అభ్యర్థిని బరిలోకి దింపి, నేతలు సమిష్టిగా ప్రయత్నంచేస్తే కొంత ఫలితం ఉంటుందని, ఒకవేళ ఇప్పుడు రెండోస్థానంలో ఉన్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు కలిసి వస్తుందంటూ సర్వే నివేదికల్లో వివరించినట్లు పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ప్రస్తుతం పార్టీలోని సీనియర్లు రేవంత్, ఠాగూర్, సునీల్ పైనా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సునీల్ టీం రిపోర్ట్‌ను ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed