AP Politics: అమాత్య యోగం ఎవరికి? ఆశలు పల్లకిలో కూటమి ఎమ్మెల్యేలు

by Indraja |
AP Politics: అమాత్య యోగం ఎవరికి? ఆశలు పల్లకిలో కూటమి ఎమ్మెల్యేలు
X

దిశ ప్రతినిధి, కడప: ఉమ్మడి కడప జిల్లాలో అమాత్య యోగం ఎవరిని వరించనుంది. కడప గడప నుంచి మంత్రి మండలిలో అడుగు పెట్టేదెవరన్న ఉత్కంఠ భరిత చర్చలు సాగుతున్నాయి. ఊహించని రీతిలో ఫలితాలు సాధించిన తెలుగుదేశం, దాని కూటమిలో గెలిచిన ఏడు మంది ఎమ్మెల్యేలు అమాత్య పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

మంత్రి పదవిలో ఎవరు ఆధిపత్యం సాగిస్తారు అన్నది స్పష్టం కాకపోయినా ముందు వరసలో కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఉన్నారన్న ఊహాగానాలు బలంగా సాగుతున్నాయి. టిడిపి వర్గీయుల్లో కూడా ఆమె పేరే బాగా వినిపిస్తోంది. ఆమెతో పాటు టిడిపి నుంచి గెలిచిన వారు నలుగురు ,బిజెపి జనసేన ని గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు, పశ్చిమ రాయలసీమ పట్టు భధ్రులనుంచి ఎన్నికైన రామ్ గోపాల్ రెడ్డి లు కూడా ఆశల్లో కనిపిస్తున్నారు.

ఒక్కొక్కరు ఒక్కో ఈక్వేషన్‌తో తనకే మంత్రి పదవి దక్కవచ్చన్న అంశాల్లో ఉండడంతో ఇంతకూ మంత్రి పదవి వరించేదవరిని అన్నది చర్చనీయాంశంగా మారింది.

*మొదటి వరుసలో మాధవీ రెడ్డి

మంత్రి పదవి రేసులో ఉమ్మడి కడప జిల్లా నుంచి మాధవీరెడ్డి పేరు మొదటి వరుసలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆమె జిల్లా కేంద్రమైన కడప నుంచి పోటీ చేశారు. కడప అసెంబ్లీ ఏర్పాటు అయినప్పటి నుంచి మహిళలు పోటీ చేసి గెలిచిన పరిస్థితులు లేవు. కడప నుండి పోటీ చేసి గెలిచిన మొదటి మహిళా ఎమ్మెల్యేగా మాధవీరెడ్డికి కడప రాజకీయ చిత్రపటంలో స్థానం దక్కింది.

పార్టీ పరంగా చూస్తే కూడా ఆమె కడప ఇంచార్జిగా నియామకం అయినప్పటి నుంచి కడపలో టీడీపీకి ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. అదే స్థాయిలో ఆమె ఇమేజ్‌ని కూడగట్టుకుంది. కడపలో మైనార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఇక్కడ టీడీపీ గెలవడం కష్టమని అందరూ అనుకున్న చోట, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించి తన సత్తా చాటారు.

దీంతో ఆమెకు ఈ ఎన్నికల్లో ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నారు. ఆయనకు పార్టీ అధిష్టానంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నట్లు చెప్పుకోవచ్చు. చంద్రబాబు దగ్గర ఆయనకున్న సాన్నిహిత్యం అనొచ్చు, నమ్మకం అనొచ్చు ఏదైనా సరే అధిష్టానంలో పట్టు కలిగి ఉన్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి.

అటు మాధవీ రెడ్డి ఎన్నికల్లో కష్టపడ్డతీరు, శ్రీనివాస్ రెడ్డికి అధిష్టానంలో ఉన్న గుర్తింపులాంటి పరిస్థితులన్నీ కలిపి ఆమెకు మంత్రి పదవిలో అవకాశం దక్కుతుందన్న చర్చలకు ప్రాధాన్యం దక్కుతోంది.

అందరూ.. ఆశల పల్లకిలో..

మంత్రి పదవి ఆశల్లో కూటమి నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు. వీళ్ళలో ప్రధానంగా గట్టి ప్రయత్నాలు ఉన్నది కొందరైతే, తెలుగుదేశం పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ,కూటమిలోని పార్టీలకు మంత్రి పదవులు కేటాయించే అంశాలను విశ్లేషించుకుని ఏదో రకంగా తమకు మంత్రి పదవి దక్కుతుందని మరికొందరు ఆశిస్తున్నారు. ఇలా ఎవరి ఆశల్లో వారు ఉండగా మరి కొందరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఆదికి దక్కే చాన్స్..

జమ్మలమడుగు అసెంబ్లీ బీజేపీ నుంచి ఎన్నికైన ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవిని గట్టిగా ఆశిస్తున్నట్టు సమాచారం. తనకున్న రాజకీయ చాణక్యం, బీజేపీకి వెళ్లక ముందు టీడీపీలో చంద్రబాబు, లోకేష్‌తో ఉన్న సంబంధాలతో ఇప్పుడు మంత్రి పదవి దక్కేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే బీజీపీ నుంచి సుజనా చౌదరికి అవకాశం కల్పిస్తున్న తరుణంలో కడప నుంచి ఆదినారాయణ రెడ్డికి అవకాశం కల్పిస్తారా అన్నది వేచి చూడాలి.

ఈయనతో పాటు ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేరు కూడా బాగా వినిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆయన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో ఇమేజ్ తెచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మంచి ఫలితాలు ఉంటాయన్న సంకేతాలు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో అధిష్టానం ఎమ్మెల్సీల కోటాలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీరే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. కమలాపురం నుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామపై గెలుపొందిన యువకుడు పుత్తా చైతన్య రెడ్డి కూడా మంత్రి పదవి అంశాల్లో ఉన్నట్లు చెప్పవచ్చు.

జిల్లాలో అందరికంటే ఎక్కువ మెజార్టీతో గెలుపొందిన యువకుడిగా ఆయన ప్రాధాన్యం సంతరించు కానున్నారు. ఈయనకు మంత్రి పదవి ఇస్తే జిల్లాలో రాజకీయంగా చొరవ చూపే అవకాశం ఉంటుందని బావిస్తే ఆయనకు సైతం మంత్రి పదవి లభించే అవకాశాలు ఉండవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అరవ శ్రీధర్‌కు అవకాశం వస్తుందా?

కూటమి నుంచి జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికైన రైల్వే కోడూరుకు చెందిన అరవ శ్రీధర్‌కు మంత్రి మండలిలో అవకాశం ఉండొచ్చేమోనన్న ఊహగానాలూ సాగుతున్నాయి. రాయలసీమ నుంచి ఆయన గెలవడం, రిజర్వడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడంతో ఆయనకు ఏమైనా మంత్రి పదవి అవకాశం ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఆ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌కు మంత్రి మండలిలో అవకాశం కల్పించనుండడంతో కడప జిల్లాకు అవకాశం ఉంటుందా అన్నది సందేహంగా మారింది. ఇలా ఎవరి ఆశల్లో వారు, ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండడంతో ఉమ్మడి కడపలో అమాత్య యోగం ఎవరికన్నది రేపటి దాకా వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story