ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 2500 ఐటీ ఉద్యోగాలు.. మంత్రి కేటీఆర్

by Javid Pasha |
ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 2500 ఐటీ ఉద్యోగాలు.. మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : అమెరికా పర్యటనలో భాగంగా శుక్రవారం వాషింగ్టన్ డీసీలో మంత్రి కేటీఆర్ 30 కి పైగా ఐటీ కంపెనీ యాజమాన్యాలతో సమావేశయ్యారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. డి కాంజెస్ట్ , డీ కార్బోనైజ్, డీ సెంట్రలైజ్ అనే త్రీడీ మంత్రతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్లో ఐటీ టవర్లను ప్రారంభించుకున్నామని, త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్ , నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పారు. అదిలాబాద్ లోనూ మరో ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటుచేసిన రెండు ఐటీ కంపెనీలను పరిశీలించామని, బెల్లంపల్లి లాంటి చిన్న పట్టణంలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నప్పుడు తెలంగాణలోని ఏ పట్టణంలోనైనా ఐటీ కార్యాలయాలను ఏర్పాటుచేసి నడపడం ఈజీ అన్నారు.

కరోనా సంక్షోభం తర్వాత ఐటీ కార్యకలాపాలను నిర్వహించడంలో కంపెనీలు వినూత్న పంథాను అనుసరిస్తున్నాయని ప్రస్తుతం పెరిగిన ఇంటర్నెట్ కనెక్టివిటీతో ద్వితీయ శ్రేణి నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయడం సులభం అయిందన్నారు. అనంతరం పలు కంపెనీల సీఈవోలు, ఐటీ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందాలతో సుమారు 2500 ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయి. పరోక్షంగా మరో పది వేల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థ సహకారంతో టెక్నోజెన్ ఇంక్ సీఈఓ లక్స్ చేపూరి, మహేష్ బిగాల ఏర్పాటుచేసిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణువర్ధన్‌ రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి పాల్గొన్నారు.

ఏరోస్పేస్ డిఫెన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో..

ఎరో స్పేస్, డిఫెన్స్ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలు, ఏరోస్పేస్ డిఫెన్స్ స్టార్ట్ అప్ ల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రంగాల్లో తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఏరో స్పేస్ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ టీఎస్ ఐపాస్ విధానాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వానికి ఏరోస్పేస్ డిఫెన్స్ రంగం అత్యంత ప్రాధాన్యత రంగం అని, 2018, 2020లో ఏరో స్పేస్ రంగానికి సంబంధించి తెలంగాణ ఉత్తమ రాష్ట్ర అవార్డుని అందుకుందన్నారు. అవార్డులతో ఏరో స్పేస్ రంగంలో పెట్టుబడులకు తెలంగాణనే అత్యుత్తమ గమ్యస్థానం అని నిరూపితమైందన్నారు.

Advertisement

Next Story