వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం.. మంత్రి కేటీఆర్

by Javid Pasha |
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం.. మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కార్పొరేటర్లు తమ తమ వార్డుల్లో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమయత్తం చేయాలని సూచించారు. రానున్న సంవత్సర కాలం పాటు పార్టీ కార్యకలాపాలు విస్తృతంగా ఉంటాయని, వాటన్నింటిని విజయవంతం చేస్తూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కార్పొరేటర్లను ఆదేశించారు. ప్రగతి భవన్ లో మంగళవారం జీహెచ్ఎంసీ లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ గ్రేటర్ లో ఈ నెల 16న వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ వార్డు కార్యాలయాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ వారితో మమేకమయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధికి పాటుపడుతున్న తీరును ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని మార్గనిర్దేశనం చేశారు. వార్డు కార్యాలయాల ప్రారంభంతో నగరంలో సుపరిపాలన మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజలకు మరిన్ని సంక్షేమ ఫలాలను, ప్రభుత్వ కార్యక్రమాలను వేగంగా అందించాలన్న ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ సంస్కరణలను సీఎం కేసీఆర్ చేపట్టారని తెలిపారు. ఈ ఆలోచన దృక్పథంలోంచి జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు, గ్రామపంచాయతీలను నూతనంగా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ఇంటి ముందట నిలిపేందుకు ప్రయత్నం చేశామన్నారు. ఇదే వికేంద్రీకరణ స్ఫూర్తితో వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలకు మరిన్ని సేవలు అందుతాయనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్పొరేటర్లు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. వార్డు కార్యాలయ వ్యవస్థపై అవగాహన కోసం విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ తరఫున నిర్వహించే సమావేశాల్లో కార్పొరేటర్లు మరింత చురుగ్గా పాల్గొనాలని, పార్టీ బలోపేతంతోనే మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు నవీన్ రావు ,శంభీపూర్ రాజు, మేయర్ విజయలక్ష్మి, ఇతర సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Next Story