AP Politics: హీరోలు కాదు.. జీరోలు!

by Indraja |   ( Updated:2024-06-11 07:36:00.0  )
AP Politics: హీరోలు కాదు.. జీరోలు!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం అంటూ ఈ పర్యాయం ఎన్నికల బరిలోకి దిగిన పలు కొత్త పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములను కూడా ప్రభావితం చేయలేకపోయాయి. జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించిన వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు.

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశాఖపట్నం పార్లమెంట్, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో నిలిచారు. భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ పుంగనూరుతో పాటు మంగళగిరి నుంచి పోటీ చేశారు. జైభీమ్‌రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు.

కేఏ పాల్ ఓట్లు రెట్టింపు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. నరసాపురం ఎంపీ స్థానంలో ఆయనకు 3,018 (0.26 శాతం) ఓట్లు వచ్చాయి. ఆయన డిపాజిట్ కోల్పోయారు. నరసాపురం అసెంబ్లీ స్థానంలో 281 (0.21 శాతం) ఓట్లు వచ్చాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి బరిలో దిగిన ఆయనకు 1,700 ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఇక్కడ గెలిచారు. విశాఖపట్నం ఎంపీ స్థానానికి కూడా పోటీ చేసిన ఆయనకు 7,696 (0.55శాతం) ఓట్లు వచ్చాయి.

జేడీ ప్రభావం నిల్..

సీబీఐ అధికారిగా ఉంటూ, వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన వీవీ లక్ష్మీనారాయణ తొలుత జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విశాఖ ఎంపీగా బరిలో దిగారు. అప్పట్లో ఆయన ఓటమి పాలయినప్పటికీ గణనీయంగా ఓట్లు సాధించారు. 23.3% శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు 2,88,874 ఓట్లు వచ్చాయి.

ఆ తర్వాత ఆయన జనసేనకు దూరమయ్యారు. 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందు సొంతంగా పార్టీ స్థాపించారు. జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో ఆయన రిజిస్టర్ చేసి తనతో పాటుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను దింపారు.

నార్త్ అసెంబ్లీ బరిలో..

ఈసారి కూడా ఆయన విశాఖ నగరంలోనే పోటీ చేశారు. అయితే, పార్లమెంట్‌కి బదులుగా విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన బరిలో నిలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయం సాధించగా, రెండో స్థానంలో వైఎస్సార్సీపీ, మూడో స్థానం ఇండిపెండెంట్ అభ్యర్థికి దక్కాయి. వీవీ లక్ష్మీనారాయణకు కేవలం 5,160 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయనతో పాటు ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఇతర అభ్యర్థులు కూడా రాష్ట్రంలో ఎక్కడా ప్రభావం చూపలేకపోయారు.

బీసీవైపీ కూడా అంతే

బోడే రామచంద్రయాదవ్ 2019 ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు 16,452 (8.4శాతం) ఓట్లు లభించాయి. ఆ తరువాత సొంత పార్టీ బీసీవైపీని స్థాపించారు. 2024 ఎన్నికల్లో ఆయన రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను బరిలో దించారు. పుంగనూరు, మంగళగిరి అసెంబ్లీ స్థానాల్లో ఆయన పోటీ చేశారు. పుంగనూరులో మూడో స్థానంలో నిలిచిన ఆయనకు 4,559 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గెలిచారు. మంగళగిరిలో 373 ఓట్లు పడ్డాయి. ఇక్కడ నారా లోకేశ్ గెలిచారు.

జడ శ్రవణ్ కుమార్‌కు 416 ఓట్లే..

జై భీమ్‌రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్‌కు రాష్ట్రవ్యాప్తంగా అడ్వకేట్‌గానూ, సామాజిక అంశాలపై స్పందించే ఉద్యమ నేతగానూ గుర్తింపు ఉంది. జడ్జి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన శ్రవణ్ కుమార్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. ఆయనకు కేవలం 416 ఓట్లు వచ్చాయి.

Advertisement

Next Story