పేదల భూముల జోలికొస్తే ఖబర్దార్ కేసీఆర్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

by Kalyani |
పేదల భూముల జోలికొస్తే ఖబర్దార్ కేసీఆర్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన భూములను బలవంతంగా గుంజుకుంటే ఖబర్దార్ సీఎం కేసీఆర్ నీ సంగతి చూస్తాం, మీ సర్కార్ ను కూలుస్తాం’ అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా గగ్గలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న భూములను తిరిగి ప్రజలకు చట్టబద్ధంగా వారికి అప్పగిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గగ్గలపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 183లో దళిత, గిరిజనులకు ఇచ్చిన 200 ఎకరాల భూములను ధరణిలో బ్లాక్ చేయడం దుర్మార్గమన్నారు. దళిత, గిరిజనులకు పంపిణీ చేసిన ఈ భూముల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేస్తామని వాగ్దానం చేసిన సీఎం కేసీఆర్ అమలు చేయకపోగా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను బలవంతంగా గుంజుకోవడం దుర్మార్గమన్నారు. స్మశాన వాటికలు, హరితహారం పేరిట దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం బాగుండాలని ఆదిలాబాద్ నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు వివరించారు. ధనిక రాష్ట్రంలో సంపదంత దోపిడీ జరిగిందని, కొట్లాడి కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో కొలువులు లేక నిరుద్యోగులు, ఇండ్లు లేక పేదలు, పింఛన్లు రాక వృద్ధులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా 9 నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం నిత్యవసర సరుకుల కోత విధించి బియ్యం మాత్రమే ఇస్తుందన్నారు. కెఎల్ఐ పంట పొలాలకు సాగునీరు అందించే పిల్ల కాలువలను కూడా తవ్వకుండా దున్నపోతు వలే బీఆర్ఎస్ ప్రభుత్వం నిద్రపోతున్నందున గగ్గలపల్లి గ్రామంలో 2,500 ఎకరాల భూములకు సాగు నీరు అందక రైతులు నష్టపోవలసిన దుస్థితి వచ్చిందని ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ అని మండిపడ్డారు. నియోజకవర్గంలో రైతుల పొలాలకు సాగు నీరు ఇవ్వవలసిన పిల్ల కాలువలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రశ్నించారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిచేసిన కాలువల్లో పారుతున్న నీళ్లను తామే ఇచ్చామని చూయిస్తూ శిలాఫలకాలు కట్టుకొని వాటి ముందు ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి సిగ్గుండాలని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని అమలు చేయకపోవడం వల్ల రైతుల ఖాతాలు బ్యాంకుల్లో బ్యాడ్ అకౌంట్స్ గా మారి బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవడం వల్ల వడ్డీలకు అప్పులు తెచ్చుకొని సాగుకు పెట్టుబడి పెట్టుకోవాల్సిన దుస్థితి ఎదురైందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు.

జడ్చర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ తదితర రోడ్ల వెంట 15 రోజులుగా రైతులు ధాన్యం కుప్పలుగా పోసి నిరీక్షిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టించుకోకుండా ఏమైనా గాడిదలు కాస్తుండ్రా అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నించే గొంతుకల పట్ల ఈ ప్రభుత్వం నియంతగా నిర్బంధం ప్రయోగిస్తున్నదని మండిపడ్డారు. భయం, భయం గుప్పిట్లో బతుకుతున్న తెలంగాణ సమాజాన్ని భయం పడగ నుంచి విముక్తి చేయడానికి రాష్ట్రంలో వచ్చే ఐదు నెలల తరువాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని స్వేచ్ఛాయుత వాతావరణంలో బతుకుదామని ప్రజలకు భరోసానిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed